కోడిగుడ్ల గుత్తేదార్లకు రూ.70 కోట్ల బకాయిలు

అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్లు సరఫరా చేసే గుత్తేదారులకు జనవరి, ఫిబ్రవరి నెలలకు రూ.70 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది.

Published : 02 Apr 2023 03:39 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్లు సరఫరా చేసే గుత్తేదారులకు జనవరి, ఫిబ్రవరి నెలలకు రూ.70 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. దీనిపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో గర్భిణులు, బాలింతలు 7 లక్షల మంది, 6 నెలల వయసు నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 23 లక్షల మంది వరకు ఉన్నారు. గర్భిణులు, బాలింతలు, 3-6 ఏళ్ల మధ్య చిన్నారులకు కోడిగుడ్లను అందిస్తున్నారు. రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ నెలకు ఆ నెల బిల్లు చెల్లిస్తుండగా గతేడాది అక్టోబరు నుంచి బకాయిలు పేరుకున్నాయి. ఇక సరఫరా చేయడం కష్టమని పలు జిల్లాల గుత్తేదారులు స్పష్టం చేయడంతో ఇటీవల నవంబరు బిల్లులను చెల్లించారు. శుక్రవారం డిసెంబరు నెల బిల్లులు పెట్టినట్లు సమాచారం. దీనిపై మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను వివరణ కోరగా జనవరి, ఫిబ్రవరి బిల్లులను కూడా వారం రోజుల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. మరో పక్క వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్‌ సరఫరాకు సంబంధించి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరికి సంబంధించి రూ.25 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. మార్చి కూడా కలిపితే బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది. వాటిని కూడా త్వరితంగా చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు