‘హిందూ ధర్మం’లో.. జ్ఞాన వెలుగులు

హైందవ సనాతన ధర్మం ఎంతో విశిష్టమైందని, ప్రపంచానికి జ్ఞాన వెలుగులను ప్రసరిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ అన్నారు.

Published : 02 Apr 2023 03:47 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌
ముగిసిన జిల్లెళ్లమూడి అమ్మ శత జయంత్యుత్సవాలు

బాపట్ల, న్యూస్‌టుడే: హైందవ సనాతన ధర్మం ఎంతో విశిష్టమైందని, ప్రపంచానికి జ్ఞాన వెలుగులను ప్రసరిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ అన్నారు. బాపట్ల జిల్లాలో జిల్లెళ్లమూడి అమ్మ శతజయంత్యుత్సవాల ముగింపు సభలో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. అన్నపూర్ణాలయం ద్వారా లక్షల మంది ఆకలి తీర్చిన గొప్ప మానవతామూర్తి.. జిల్లెళ్లమూడి అమ్మ అని కొనియాడారు. ‘జిల్లెళ్లమూడి అమ్మ గురించి చిన్నతనంలో విన్నాను. ఇన్నేళ్లకు దర్శించుకునే భాగ్యం లభించింది. అన్నం, ఔషధం అమృతాలని హైందవ ధర్మం చాటుతుంది. మారుమూల ప్రాంతంలో సంస్కృత కళాశాలను నెలకొల్పి విద్యార్థులకు దశాబ్దాలుగా ఉచితంగా విద్యా బోధన చేస్తూ వేల మందిని తీర్చిదిద్దటం గొప్ప విషయం. దేశంలో భిన్న మతాలు, విశ్వాసాలు అంతిమంగా మానవత్వాన్నే చాటుతాయి. అమ్మ చూపిన దివ్యమార్గంలో నడిచి ఆపన్నులకు అండగా నిలవాలి’ అని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ‘జిల్లెళ్లమూడి అమ్మ అందరిని తన బిడ్డలుగా ఆదరించిన విశ్వజనని. ఆమె చూపిన ప్రేమతత్వం, త్యాగం, కరుణ అజరామరం. ప్రతి గ్రామంలో అన్నపూర్ణాలయం ఏర్పాటైతే అన్నార్థులు ఉండరు’ అని పేర్కొన్నారు. ప్రేమ, దయ అనే రెండు పాదాలతో జిల్లెళ్లమూడిలో నడిచిన అద్వైత స్వరూపిణి అమ్మ అని ఆదాయ పన్ను శాఖ పరిశోధన కార్యనిర్వాహక సంచాలకుడు జె.కృష్ణకిశోర్‌ అభివర్ణించారు. కైలాసాశ్రమ మహాసంస్థాన్‌ బెంగళూరు పీఠాధిపతి జయేంద్రపురిస్వామి మాట్లాడుతూ జగత్తుకు వసంతాన్ని ప్రసాదించడానికి అమ్మ వసంత రుతువులో జన్మించారని, ఆమె అపరశక్తి స్వరూపిణి అని కీర్తించారు. మాతృదేవోభవ, అమ్మ శతజయంతి సంచికలను జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ ఆవిష్కరించారు. న్యాయమూర్తులు స్థానిక ఆలయాల్లో పూజలు చేశారు. గజల్‌ శ్రీనివాస్‌ ప్రదర్శించిన గానలహరి అలరించింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ లక్ష్మణ్‌, జిల్లా న్యాయమూర్తి పార్థసారథి, సబ్‌ కోర్టు న్యాయమూర్తులు సాధుబాబు, వాణి, రుక్మిణి, ఆర్డీవో రవీందర్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌, డీఎస్పీ శ్రీనివాసరావు, విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు ఛైర్మన్‌ నరసింహమూర్తి, ధర్మకర్తలు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని