రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు

రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Published : 02 Apr 2023 04:55 IST

నిమిషం ఆలస్యమైనా అనుమతించం
ఒంటిపూట బడులు 3వ తేదీ నుంచే
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు ఉదయం 8.45 నుంచి 9.30 లోపు కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రత్యేక కారణాలుంటే తప్ప ఉదయం 9.30 తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని చెప్పారు. 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. పదోతరగతి పరీక్షల ఏర్పాట్లు, ఒంటిపూట బడులపై శనివారం ఆయన విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. హాల్‌టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షకేంద్రానికి చేరుకోవచ్చని తెలిపారు.

‘ఈ ఏడాది 6 సబ్జెక్టులకు 6 రోజులు పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 6,09,070 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 3,349 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశాం. 53,410 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 682 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటుచేశాం. 104 పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశాం. మొబైల్‌ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను పాఠశాల ఆవరణలోకి అనుమతించం. ఉపాధ్యాయులు, సిబ్బంది తమ సెల్‌ఫోన్లను కౌంటర్‌లో ఇచ్చి కేంద్రంలోకి వెళ్లాలి’ అని తెలిపారు. పది, ఇంటర్‌ విద్యార్థులకు 270 కేంద్రాల్లో ఓపెన్‌స్కూల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. గతంలో పరీక్షపత్రాల లీకేజీ కేసులో ఉన్న 74 మందిని తహసీల్దారు కార్యాలయాల్లో హాజరుకావాలని ఇటీవల ఆదేశించామని.. ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు దాన్ని ఉపసంహరించామన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నపత్రాలను ఎవరికైనా పంపిస్తే.. అది ఎలా వచ్చిందో తెలుసుకునే కొత్త సాంకేతికతను ఏర్పాటుచేశామని మంత్రి వివరించారు. 43వేల మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేషన్‌ విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ప్రతి గదికి 24 మంది విద్యార్థులు ఉంటారని చెప్పారు. ‘దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అంధ విద్యార్థులు స్వయంగా పరీక్ష రాసే ఏర్పాట్లు చేశాం. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో హెడ్‌ఫోన్ల ఆధారంగా వారు పరీక్ష రాయొచ్చు. అనంతపురం ఆర్‌డీటీలో ఆరుగురు విద్యార్థులకు అనుమతి ఇచ్చాం’ అని తెలిపారు. పరీక్షలు జరిగేటప్పుడు పాఠశాలల్లో నాడు-నేడు పనుల్ని నిలిపేయాలని ఆదేశించామన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉన్నాయనే లెక్కలు సేకరిస్తున్నామని, ఎన్ని అవసరమో గుర్తించి సాధ్యమైనంత త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు.

ఎండలు ఉన్నాయనే ఒంటిపూట బడులు

ఈ నెల 3వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఆ రోజు తరగతులు జరగవని తెలిపారు. రాబోయే నాలుగువారాల్లో ఎండలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నాడు-నేడు బిల్లుల బకాయిలను పూర్తిగా చెల్లించామని తెలిపారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, పాఠశాల విద్య కమిషనర్‌, సమగ్రశిక్ష ఎస్‌పీడీ సురేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని