ఏడాదిలో 3%లోపు పనులే

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 2.86% పనులే చేసినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి.

Published : 02 Apr 2023 04:56 IST

ఇలా అయితే... ఎప్పటికీ పోల‘వరం’?
కేంద్రం నుంచి నిధులు సాధించలేని పరిస్థితి
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 2.86% పనులే చేసినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. ప్రాజెక్టును మార్చి ప్రారంభంలో డ్యాం డిజైన్‌ రివ్యూకమిటీ (డీడీఆర్‌సీ) నిపుణులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, కేంద్ర జలసంఘం అధికారులు సందర్శించారు. కీలకాంశాలపై సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అధికారులు ఏడాది కాలంలో జరిగిన పనులపై నివేదిక ఇచ్చారు. ఆ గణాంకాల ప్రకారమే ఇక్కడ పనులు అంతంతమాత్రంగా జరిగాయని తేటతెల్లమవుతోంది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కల సాకారమయ్యేది ఎప్పటికన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతీ లేదు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్‌ టెండర్ల పేరుతో మళ్లీ టెండర్లు పిలిచారు. మేఘా ఇంజినీరింగు సంస్థ ఈ పనులు చేపట్టింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రధాన డ్యాం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఎడమ కాలువ పనులకు, పునరావాస పనులకు వేర్వేరు గుత్తేదారులున్నారు. పనులు ఆలస్యం కావడానికి కొన్నాళ్లు కరోనా, తర్వాత వేరే కారణాలు చెప్పారు. నిర్మాణంతో సంబంధం లేని పునరావాసం పనులూ పూర్తి చేయడం లేదు. ఎడమ కాలువ పనులూ ముందుకు సాగడం లేదు. ప్రధాన డ్యాంతో అనుబంధంగా ఉన్న అనుసంధాన పనులూ అంతంతమాత్రంగా ఉన్నాయి. డయాఫ్రం వాల్‌ భవితవ్యం తేల్చి ఆ పనులు పూర్తిచేసేవరకూ ఒక ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభించడంలో ఆలస్యం కావడానికి అంతో ఇంతో కారణం ఉందేమో తప్ప.. కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, అనుబంధ పనులు, పునరావాస పనుల పూర్తికి ఏ ఇబ్బందులూ లేకపోయినా పోలవరం ముందుకు సాగడం లేదు.
ప్రధాని నరేంద్రమోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన బంధముందని సీఎం జగన్‌ స్వయంగా ప్రకటించారు. ఎన్నోసార్లు దిల్లీ వెళ్తూ.. పోలవరం నిధుల కోసం ప్రతిసారీ అడుగుతూనే ఉన్నామంటున్నారు. 22 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో ఒకానొక దశలో వైకాపా మద్దతు లేకపోతే గట్టెక్కలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఎంపీల అవసరం కేంద్రానికి ఏర్పడ్డ సందర్భంలోనూ సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరిన దాఖలాలు లేవు. ఒకవైపు పోలవరంపై రాష్ట్రం ఖర్చుచేసిన దాదాపు రూ.2,600 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాలి. ఆ నిధుల్లో తాజాగా రూ.826 కోట్లే వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.1,671 కోట్లే వచ్చాయి. కేంద్రం నియమించిన రివైజ్డు కాస్ట్‌కమిటీ ఆమోదించిన ప్రకారం ప్రాజెక్టుకు రూ.47,725 కోట్లు అవసరం. విద్యుత్‌ కేంద్రం నిధులు, ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులు మినహాయిస్తే, ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులూ మినహాయిస్తే ఇంకా మరో రూ.25 వేల కోట్లకు పైగా నిధులు కేంద్రం నుంచి రావాలి. ఇలా ఏడాదికి కేంద్రం నుంచి సగటున రూ.1,600 కోట్లే వస్తుంటే.. ఇక ఎప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే అంచనాలు ఏ స్థాయిలో పెరిగి మరింత భారంగా మారతాయనే అంశమూ చర్చనీయాంశమవుతోంది.


గడచిన ఆర్థిక సంవత్సరంలో..

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు తాజాగా గణాంకాలు తయారుచేశారు. వైఎస్‌ హయాంతో పాటు ఆ తర్వాత 2014 జూన్‌ వరకు ఎంతమేర పోలవరం పనులు జరిగాయో, ఆ పై చంద్రబాబు హయాంలో ఎంతమేర పనులు జరిగాయో.. జగన్‌ ప్రభుత్వంలో 2023 జనవరి వరకు ఎంత పని జరిగిందో లెక్కలు తయారుచేశారు. ఆ రకంగా చూసినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంతో పోలిస్తే జగన్‌ ప్రభుత్వ హయాంలోనే పనులు చాలా మందకొడిగా ఉన్నాయని ఆ గణాంకాలు తెలియజేస్తున్నాయి. తాజాగా 2022 మార్చి నెలాఖరు నుంచి 2023 ఫిబ్రవరి నెలాఖరు వరకు పోలవరంలో పురోగతిని జలవనరులశాఖ అధికారులే లెక్కించారు. ఆ ప్రకారం కొన్నిచోట్ల పనులే ముందుకు కదల్లేదని అవగతమవుతోంది.


* సీఎం జగన్‌ గతేడాది వరదల సమయంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. తొలిదశ పునరావాసం సెప్టెంబరు, అక్టోబరు కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ సంవత్సరంలో భూసేకరణ, పునరావాసంలో జరిగిన పని పురోగతి 1.97% మాత్రమే. ఇంకా తొలిదశ నిర్వాసితులను అనేక మందిని ఇంకా తరలించనేలేదు. సీఎం హామీ నెరవేరలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని