Puttaparthi: అట్టుడికిన పుట్టపర్తి
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పరస్పర విమర్శలతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తల దాడి
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనం ధ్వంసం
పరస్పర సవాళ్లతో వివాదం
తెదేపా నాయకుల గృహనిర్బంధం
నిర్బంధించినా.. పరామర్శ పేరుతో బయటకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
పుట్టపర్తి - న్యూస్‌టుడే
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పరస్పర విమర్శలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు తెదేపా శ్రేణులపై రాళ్లు, చెప్పులతో దాడికి దిగడంతో ఓ దశలో రణరంగమైంది. యువగళం పాదయాత్రలో భాగంగా ఇటీవల పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. పుట్టపర్తిని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు రావాలని సవాలు విసిరారు. దీనికి రఘునాథరెడ్డి స్పందించి, చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పట్టణంలో పోలీసు-30 చట్టాన్ని అమలు చేశారు.
వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
అభివృద్ధిపై చర్చకు స్థానిక సత్యమ్మ ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. శనివారం ఉదయం రఘునాథరెడ్డి తెదేపా కార్యాలయం నుంచి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి అక్కడికి బయల్దేరేందుకు సిద్ధంకాగా, ఇద్దరినీ పోలీసులు నిర్బంధించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు తెదేపా నాయకులను పుట్టపర్తికి చేరుకోకుండా గృహనిర్బంధం చేశారు. పట్టణంలోని ఎనుములపల్లిలో వైకాపా నాయకుడు ఒకరు చనిపోయారని, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తానంటూ ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి బయటకు వచ్చారు. ఆ సమయంలో పోలీసులు ఆయన వెంట ఉన్నారు. పరామర్శించాక ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి వెళ్లకుండా, తెదేపా కార్యాలయం మీదుగా దారి మళ్లారు. కాన్వాయ్‌లో ఉన్న అనుచరులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కవ్వించినప్పటికీ, పోలీసులు అడ్డుకోలేదు. వారంతా నేరుగా సమీపంలోని హనుమాన్ ఆలయంలోకి చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకొని, పార్టీ కార్యాలయంలో నిర్బంధంలో ఉన్న రఘునాథరెడ్డి భవనంపైకి ఎక్కి కార్యకర్తల సహాయంతో వెనుక భాగం నుంచి కిందకు దిగారు. వాహనంలో హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తన వాహనంపైకి ఎక్కారు. పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకున్నారు. వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న కర్రలతో పల్లె వాహనాన్ని ధ్వంసం చేశారు. చెప్పులు, టెంకాయలు విసిరారు. రఘునాథరెడ్డిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పోలీసు స్టేషన్ తరలిస్తుండగా, ఆ వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు ఠాణా ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయం నుంచి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ర్యాలీగా తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయిన తర్వాతే పోలీసులు రఘునాథరెడ్డిని వదిలేశారు. స్టేషన్ నుంచి రఘునాథరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మళ్లీ సత్యమ్మ ఆలయానికి చేరుకొని, అమ్మవారికి పూజలు చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ప్రమాణం చేశారు.
ఓటమి భయంతోనే వైకాపా దాడులు: చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: పుట్టపర్తిలో మాజీ మంత్రి రఘునాథరెడ్డి వాహనం, తెదేపా కార్యకర్తలపై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ‘వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం, ఒత్తిడితోనే వైకాపా రౌడీలు దాడులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులకు దిగడం సమాధానం కాబోదు’ అని శనివారం ట్వీట్ చేశారు. దాడులకు సంబంధించిన వీడియోను జత చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ‘సీఎం జగన్‌రెడ్డి అండతోనే వైకాపా రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తిని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అరాచకాలు, అక్రమాలకు నిలయంగా మార్చారు. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి బడా కాంట్రాక్టర్లు, బిల్డర్ల వరకు ఎవరినీ వదలకుండా బెదిరించి కమీషన్లు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన రఘునాథరెడ్డి సవాలుకు భయపడి చర్చ నుంచి పారిపోయారు. వైకాపా గూండాలతో తెదేపా కార్యకర్తలపై దాడి చేయించారు. పోలీసులు దౌర్జన్యకారులను వదిలేసి బాధితులపైనే లాఠీఛార్జి చేయడం దారుణమ’ని మండిపడ్డారు.
30 యాక్ట్ ఉల్లంఘించిన వారిపై కేసులు
- యశ్వంత్, డీఎస్పీ, పుట్టపర్తి
పుట్టపర్తిలో శాంతి భద్రతలకు విఘాతం కలగరాదని పోలీసు 30 చట్టాన్ని విధించాం. దాన్ని ఉల్లంఘించి ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు చెప్పులు, కొబ్బరికాయలు విసురుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు జీపు అద్దాలు ధ్వంసం చేశారు. వీడియోల ఆధారంగా ప్రతి ఒక్కరిపైనా కేసులు నమోదు చేసి, కఠినంగా వ్యవహరిస్తాం.
చర్చకు ఎప్పుడైనా సిద్ధమే..: శ్రీధర్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సమస్యలు పరిష్కరించాం. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. నేను అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. తెదేపా వాళ్లే చర్చకు పిలిచి మా పార్టీ కార్యకర్తలతో గొడవకు దిగారు. వాళ్లే మా వాళ్లపై దాడులకు పాల్పడ్డారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు
- పల్లె రఘునాథరెడ్డి, మాజీ మంత్రి
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. తెదేపా కార్యకర్తలపై మాత్రమే లాఠీఛార్జి చేశారు. వైకాపా వాళ్లు దాడులు చేస్తున్నా పట్టించుకోలేదు. వాస్తవాలను ప్రజలు చూశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!