Anakapalli: ‘జై జనసేన’ అన్నందుకు విద్యార్థులపై పోలీసు వీరంగం

మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ‘జై జనసేన’ అని నినదించినందుకు విద్యార్థులపై పోలీసు ప్రతాపం చూపించారు.

Updated : 06 Apr 2023 07:13 IST

కళాశాలలోకి వెళ్లి విద్యార్థులపై  దురుసు ప్రవర్తన

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:  మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ‘జై జనసేన’ అని నినదించినందుకు విద్యార్థులపై పోలీసు ప్రతాపం చూపించారు. విద్యార్థులను నోటికొచ్చినట్లు తిడుతూ అందరూ చూస్తుండగా కళాశాల నుంచి బయటకు చొక్కా పట్టుకుని లాక్కొచ్చారు. ప్రిన్సిపల్‌, అధ్యాపకులు మొర పెట్టుకుంటున్నా వినేదే లేదంటూ, మంత్రిని మెప్పించడమే ధ్యేయంగా వీరంగం సృష్టించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాలలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కళాశాల ఛైర్మన్‌ దాడి రత్నాకర్‌, ప్రిన్సిపల్‌ కోరిబిల్లి రమేష్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాల ఎదురుగా బుధవారం జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కలెక్టర్‌ రవి తదితరులంతా జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సమయంలో కళాశాల మేడమీద నుంచి ఓ విద్యార్థి ‘జై జనసేన’ అంటూ నినాదాలు చేశాడు. మంత్రితోపాటు అంతా ఒక్కసారిగా అటువైపు చూశారు. అక్కడే విధుల్లో ఉన్న అనకాపల్లి పట్టణ ఎస్సై దివాకర్‌ పరుగున కళాశాల మేడమీదకు వెళ్లారు. ఆయన వెంట మరో ముగ్గురు వైకాపా నాయకులు సైతం వెళ్లారు. ‘జై జనసేన అన్నది ఎవడ్రా’ అంటూ ఎస్సై ఓ డిగ్రీ విద్యార్థి చొక్కా పట్టుకున్నారు. మరో ముగ్గురు విద్యార్థులను సైతం కిందకు లాక్కొచ్చారు. మేడపై నుంచి దిగాక ఉన్నతాధికారులు వారించడంతో ఎస్సై వారిని విడిచిపెట్టారు. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కళాశాలకు చేరుకుని డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు, సీఐ దాడి మోహనరావుతో మాట్లాడారు.

ఆ హక్కు ఎవరిచ్చారు?

రాజకీయాలకు అతీతంగా తాము కళాశాల నిర్వహిస్తున్నామని దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాల ఛైర్మన్‌, వైకాపా అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్‌ తెలిపారు. విద్యార్థి తప్పు చేశాడని భావిస్తే కళాశాల యాజమాన్యానికి చెబితే చర్యలు తీసుకుంటామని..కళాశాలలో విద్యార్థులపై దౌర్జన్యం చేసే హక్కు ఎస్సైకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులమంతా వైకాపాలోనే ఉన్నామని, తమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఏదో మాట్లాడితే తాము బాధ్యత వహించలేమన్నారు. జరిగిన సంఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారు. ఎస్సై దివాకర్‌ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్‌ కోరిబిల్లి రమేష్‌, అధ్యాపకులు డీఎస్పీ మళ్ల మహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదేశాలతోనే ఎస్సై విద్యార్థులపై దురుసుగా వ్యవహరించారని జనసేన నేత పరుచూరి భాస్కరరావు విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదికను ఎస్పీకి పంపుతామని అనకాపల్లి డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని