Viveka Murder Case: నెక్స్ట్‌ ఎవరు?.. పులివెందులలో సర్వత్రా కలకలం..

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పరిణామాలు ఆది నుంచి సంచలనం.. ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. హత్య కేసులో అరెస్టులు ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సభ్యుల వరకు రావని వారి బంధువులు, అనుచరులు గట్టి విశ్వాసంతోనే ఉన్నారు.

Updated : 20 Apr 2023 10:54 IST

కడప, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పరిణామాలు ఆది నుంచి సంచలనం.. ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. హత్య కేసులో అరెస్టులు ముఖ్యమంత్రి జగన్‌ కుటుంబ సభ్యుల వరకు రావని వారి బంధువులు, అనుచరులు గట్టి విశ్వాసంతోనే ఉన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి సైతం తన తండ్రిని అరెస్టు చేస్తారని ఊహించలేదని తెలిసింది. అయితే కొత్తగా ఏర్పాటైన సీబీఐ సిట్ బృందం వివేకా హత్య కేసులో దూకుడు పెంచింది. అనూహ్యంగా వైఎస్‌ భాస్కరరెడ్డిని ఆదివారం అరెస్టు చేసింది.

వివేకా హత్యతో సంబంధం ఉన్నవారిని ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తుండటంతో.. తరవాత వంతు ఎవరిదై ఉండొచ్చనే చర్చ సాగుతోంది.  రెండు రోజుల క్రితం  అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయగా, తాజాగా ఎంపీ తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.  సీబీఐ దర్యాప్తు మొదలైన నాటి నుంచి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవలే సుప్రీంకోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకెన్నాళ్లు చేస్తారంటూ సీబీఐపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 30 లోపు కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన సిట్ బృందం కేసుపై ఓ అవగాహనకు రాగానే ‘కీలక వ్యక్తుల’ పై దృష్టి పెట్టింది.  ఆదివారం వేకువ జామునే పులివెందులకు వెళ్లి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకువెళ్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరిచింది.

ఈ అరెస్టుకు నిరసనగా కడపలో చేపట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనకు అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కడపలో వైకాపాకు 49 మంది కార్పొరేటర్లు, అయిదుగురు కోఆప్షన్‌ సభ్యులున్నారు. కానీ ఆదివారం జరిగిన నిరసన ర్యాలీలో సుమారు 15 మంది కార్పొరేటర్లు మాత్రమే పాల్గొనడం గమనార్హం. మిగిలిన వారికి సమాచారం లేదా, సమయాభావం వల్ల రాలేకపోయారా అన్న ప్రశ్నలు వినిపించాయి. మిగిలిన పార్టీ క్యాడర్‌ సైతం పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని