Viveka murder case: వారిద్దరితో నా ప్రాణాలకు ముప్పు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవరు దస్తగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 18 Apr 2023 08:30 IST

సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిపై దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, కడప - న్యూస్‌టుడే, ఎర్రగుంట్ల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవరు దస్తగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్యకు సాయం చేసి తప్పు చేశానని, ప్రాయశ్చిత్తానికి సిద్ధపడ్డానని పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్లలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘నేను అప్రూవర్‌గా మారడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అప్రూవర్‌గా మారేటప్పుడు ఎంపీ అవినాష్‌రెడ్డి లాంటివాళ్లు నన్నెందుకు ప్రశ్నించలేదు? మీ వరకు రానంత వరకు నేను మంచోడిని, ఇప్పుడు చెడ్డవాడినయ్యానా? వివేకా కుమార్తె సునీత నుంచి డబ్బులు తీసుకోలేదు. ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధం. ‘వివేకా హత్యకేసులో అవినాష్‌రెడ్డి పాత్ర ఉంది కాబట్టే సీబీఐ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. వివేకా హత్య సమయంలో డబ్బుకు ఆశ పడే ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేశా. ఇప్పుడు నాకు అవసరం లేదు. సీబీఐకి అన్ని నిజాలూ చెప్పేశాను. ‘గతంలో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ను మీకు పలుకుబడి ఉందని మార్చేశారు. రామ్‌సింగ్‌ను మార్చితే కొత్త బృందం.. కొత్త కోణంలో విచారిస్తుందా? విచారణ ఆగిన చోటు నుంచే ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను అవినాష్‌రెడ్డి తప్పు బట్టడం ఎంతవరకు సమంజసం? పులివెందులలోని వైఎస్‌ జయమ్మ కాలనీలోనే ఉంటున్నాను. నేనెక్కడికీ పారిపోను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేను తప్పు చేస్తే జైలుకెళతాను. అదే మీరు తప్పు చేస్తే జైలుకెళతారు. మీరు తప్పు చేసినట్లు రుజువైతే పదవులకు రాజీనామా చేస్తారా?’ అని దస్తగిరి డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని