Chandrababu - Rajinikanth: చంద్రబాబు విజన్‌ అమలైతే.. దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు ఒక దీర్ఘదర్శి అని, న్యూయార్క్‌ నగరాన్ని తలపించేలా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొనియాడారు.

Updated : 29 Apr 2023 10:10 IST

ఆ శక్తి ఆయనకు ఇవ్వాలని దేవుణ్ని కోరుకుంటున్నా
న్యూయార్క్‌ను తలపించేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దారు
లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారంటే ఆయన ఘనతే
చంద్రబాబుపై రజనీకాంత్‌ ప్రశంసల జల్లు

ఈనాడు, అమరావతి: చంద్రబాబు ఒక దీర్ఘదర్శి అని, న్యూయార్క్‌ నగరాన్ని తలపించేలా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొనియాడారు. ఇప్పుడు లక్షల మంది తెలుగువారు దేశవిదేశాల్లో ఐటీ రంగంలో పనిచేస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారంటే చంద్రబాబే కారణమని ప్రశంసించారు. చంద్రబాబు రూపొందించిన విజన్‌ 2047 ఒక అద్భుతమని, అది అమలైతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన ప్రణాళికలు అమలు కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని కోరుకుంటున్నానన్నారు. ఎన్టీఆర్‌  శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘ఆయనకు 24 గంటలూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే. దేశ రాజకీయాలే కాదు, అంతర్జాతీయ రాజకీయాలూ తెలుసు.. ఆయన ఒక విజనరీ.. ఇది నేను చెప్పేది కాదు. ఆయన ఘనత, ప్రతిభ గురించి దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలుసు. ఇక్కడున్న వారి కంటే బయటి వారికే చంద్రబాబు గొప్పతనం తెలుస్తుంది’ అని వివరించారు. ‘1996-97లోనే ఆయన విజన్‌ 2020 అని చెప్పారు. ఐటీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో అంచనా వేశారు. ఆయన చెప్పిన డిజిటల్‌ వరల్డ్‌ను అప్పుడు ఎవరూ ఊహించలేదు. తర్వాత హైదరాబాద్‌ను హైటెక్‌ సిటీగా మార్చారు. బిల్‌గేట్స్‌ లాంటి దిగ్గజాలు వచ్చి ఇక్కడ కంపెనీలు ప్రారంభించారు’ అని పేర్కొన్నారు.

ఏపీకి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు..

‘పదవిలో ఉన్నా, లేకున్నా ఎప్పుడు అపాయింట్‌మెంట్‌ అడిగినా చంద్రబాబు కాదనరు. నేను విదేశాల్లో ఉన్నా ఫోన్‌ చేసి పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతారు’ అని రజనీకాంత్‌ చెప్పారు. ‘నాలుగు నెలల కిందట ఆయనతో మాట్లాడే అవకాశం లభించింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఈ తీరిక సమయంలో.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో ఏమేం చేయాలో ఆయన ఆలోచిస్తున్నారు. 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండాలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ ప్రాజెక్టు అమలైతే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఎక్కడికో వెళ్లిపోతుంది. అవన్నీ జరగాలని, అందుకు తగ్గ శక్తిని దేవుడు ఇవ్వాలని.. ఎన్టీఆర్‌ ఆత్మ ఆయనతో ఉండి అదంతా జరిగేలా చూడాలని ఆప్తమిత్రుడిగా కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు.

ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా?

‘ఇటీవల జైలర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌కు వెళ్లాను. 20, 22 సంవత్సరాల తర్వాత రాత్రి సమయంలో అటు వెళ్లి చూస్తే.. నేను ఇండియాలో ఉన్నానో, న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదు. ఇండియాలోనే హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. ఆర్థికంగా బలంగా నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా ఇదే విషయం చెప్పారు’ అని వివరించారు.

చంద్రబాబు ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడకపోతే ఎలా?

‘ఏం మాట్లాడాలో జ్ఞానం, బుద్ధి చెబుతుంది. ఎలా మాట్లాడాలో సమర్థత చెబుతుంది. ఎంతసేపు మాట్లాడాలో సభ చెబుతుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుంది. ఇంత పెద్ద సభను చూస్తే రాజకీయం మాట్లాడాలనిపిస్తున్నా.. వద్దురా రజనీ, జాగ్రత్త, రాజకీయం ఇక్కడ మాట్లాడొద్దని అనుభవం చెబుతుంది. కానీ ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన గురించి కొద్దిగా అయినా రాజకీయం మాట్లాడకపోతే అది    సభా సంస్కారం కాదు’ అంటూ రజనీకాంత్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘చంద్రబాబు 30 ఏళ్లుగా నా మిత్రులు. నా మిత్రుడు మోహన్‌బాబు ఆయన్ను పరిచయం చేస్తూ పెద్ద నాయకుడు అవుతారని చెప్పారు. హైదరాబాద్‌ వెళ్లినప్పుడు చంద్రబాబును కలిసి మాట్లాడేవాణ్ని. అలా మాట్లాడితే నా జ్ఞానం పెరిగింది’ అని కొనియాడారు.

బాలయ్య చేస్తేనే అంగీకరిస్తారు

‘చూపుతోనే చంపేస్తాను అనే నా మిత్రుడు బాలకృష్ణ.. ఆయన ఒక తన్ను తంతే జీపు 20 నుంచి 30 అడుగులు పోతుంది.. అలా రజనీకాంత్‌, అమితాబ్‌బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ ఎవరు చేసినా జనం అంగీకరించరు. బాలయ్య చేస్తేనే చూస్తారు. తెలుగు ప్రజలు బాలయ్యలో ఎన్టీఆర్‌ను చూస్తున్నారు. ఆయన ఇంకా చాలాకాలం రాజకీయాలు, సినిమాల్లో ఉండాలని దేవుణ్ని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని