NTR - Rajinikanth: యుగపురుషుడు ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ యుగపురుషుడని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొనియాడారు. ‘నటజీవితంలో ఎన్టీఆర్‌ నాకు స్ఫూర్తి. ఆయన  నుంచి ఎంతో నేర్చుకున్నాను. నాకు, ఆయనకు ఎంతో బాంధవ్యం ఉంది’ అని వివరించారు.

Updated : 29 Apr 2023 10:13 IST

ఆయన డైలాగులు వినే తెలుగు నేర్చుకున్నా
టైగర్‌లో ఆయనతో కలిసి నటించాకే సినిమాలొచ్చాయి
ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ యుగపురుషుడని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొనియాడారు. ‘నటజీవితంలో ఎన్టీఆర్‌ నాకు స్ఫూర్తి. ఆయన  నుంచి ఎంతో నేర్చుకున్నాను. నాకు, ఆయనకు ఎంతో బాంధవ్యం ఉంది’ అని వివరించారు. ‘రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఎన్టీఆర్‌ పారితోషికం సినిమాకు రూ.10 లక్షలు.. 42 ఏళ్ల కిందట రూ.10 లక్షలంటే ఇప్పుడు ఎన్ని కోట్లు? అవన్నీ వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు ఆత్మగౌరవం పేరుతో రాష్ట్రమంతా తిరిగారు’ అని పేర్కొన్నారు. ‘తెలుగువారు పాలించాలా? దిల్లీ పాలించాలా? అని ఒకే ప్రశ్న వేశారు. ఫుట్‌పాత్‌లపై నిద్రపోయారు. పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే సంచలనం సృష్టించారు. ఆయనో యుగపురుషుడు. ఆయన గురించి ఎంతైనా మాట్లాడుతూ ఉండొచ్చు’ అంటూ గుర్తుచేసుకున్నారు. తన జీవితంలోని ఎన్నో అంశాలు ఎన్టీఆర్‌తో ముడిపడి ఉన్నాయంటూ.. విజయవాడలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భావోద్వేగంతో ప్రసంగించారు.

పాతాళ భైరవి ఆశీస్సులతోనే

పాతాళభైరవి.. ఆరేడేళ్ల వయసులో నా జీవితంలో చూసిన తొలి సినిమా. అందులోని 20 అడుగుల భైరవి విగ్రహమే నా మనసులో నిలిచింది. ఏ శక్తి విగ్రహం చూసినా.. భైరవే అన్పించేది. అంతగా ముద్ర వేసింది. నా మొదటి సినిమా సమయంలో కెమెరా ముందు మొదటిగా చెప్పిన డైలాగ్‌ కూడా ‘భైరవి ఇల్లు ఇదేనా?’ అని..  నేను మొదట హీరోగా చేసిన సినిమా భైరవి.. ఇది ఆ జగన్మాత భైరవి ప్రసాదం.

ఎన్టీఆర్‌తో కలిసి టైగర్‌లో

ఎన్టీఆర్‌తో కలిసి టైగర్‌లో నటించాను. 1977లో నేను రాత్రింబవళ్లు పనిచేయడంతో నిద్ర లేదు. చెడు అలవాట్లతో నరాల బలహీనత.. ఎక్కువ కోపం ఉండేది. అందర్నీ కొట్టేసేవాడ్ని. చేతిలో రెండు, మూడు సినిమాలే ఉన్నాయి. బుక్‌ చేసిన నిర్మాతలంతా అడ్వాన్సు తిరిగి తీసుకున్నారు. టైగర్‌ కూడా అలాగే అవుతుందనుకున్నా. అందరూ వద్దని చెప్పినా ఎన్టీఆర్‌ మాత్రమే మిమ్మల్నే తీసుకోవాలన్నారని డైరెక్టర్‌ నాతో చెప్పారు. అలా ఎన్టీఆర్‌ పట్టుబట్టి ఆ సినిమాలో నన్ను నటింపజేశారు. తర్వాతే ఇతర నిర్మాతలు వచ్చి సినిమాలిచ్చారు.

ఎన్టీఆర్‌.. ఓ ఎనర్జీ

యాక్షన్‌ సీన్‌లో ట్రాలీలో కెమెరా వెంబడిస్తుంది. ఇద్దరు ఫైటర్లను కొట్టుకుంటూ స్పీడ్‌గా వెళ్లాలి. బ్రదర్‌ నేను స్పీడ్‌గా వెళ్తాను.. నా వేగానికి అనుగుణంగా మీరు రావాలని ఎన్టీఆర్‌ చెప్పారు. ‘రజనీకాంత్‌ అంటే స్పీడ్‌.. స్పీడ్‌ అంటే రజనీకాంత్‌, ఆయన వచ్చి నాకు చెబుతున్నారా’ అనుకుంటూ ఓకే సార్‌ అన్నా. షాట్‌ అయ్యాక కెమెరామెన్‌ కట్‌ చెబుతుంటే నేను వెనకే ఉన్నా, ఎన్టీఆర్‌ ముందుకు వెళ్లిపోయారు. ఆయనలో అంత ఎనర్జీ. అప్పుడు ఎన్టీఆర్‌.. బ్రదర్‌ నేను కొంచెం నెమ్మదించనా అన్నారు. షూటింగ్‌ ఉంటే 6.45 గంటలకే ఆయన సిద్ధంగా ఉండేవారు. వ్యక్తిత్వానికి ఆయన ఇచ్చే మర్యాద అది. సినిమాల్లోనే కాదు, బయట కూడా అలాగే జీవించారు.  

దుర్యోధనుడి పాత్రలో నటించాలని ప్రయత్నించి..

రాజమండ్రిలో షూటింగ్‌ చేస్తుంటే ట్రాఫిక్‌లో వేల మంది ఉన్నారు. ఏంటని చూస్తే దానవీరశూరకర్ణ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకు తెలియదు. దాన్ని వీసీడీలో చూశాక ఎలాగైనా దుర్యోధనుడి పాత్రలో నటించాలనుకున్నా. ఒక నిర్మాత, దర్శకుడు అంగీకరించారు. దుర్యోధనుడి డైలాగ్‌ అలాగే రాయమన్నా. దాన్ని కంఠతా పట్టి స్క్రీన్‌టెస్ట్‌కు వెళ్లాను. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌కు మేకప్‌మన్‌ అయిన పీతాంబరాన్ని పిలిచాం. ‘బాబూ తప్పుగా అనుకోవద్దు.. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ తర్వాత ఎవరికీ మేకప్‌ వేయలేదు’ అని బొట్టు పెట్టి వెళ్లిపోయారు. తర్వాత దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్‌ గెటప్‌లా అదే కిరీటం, అదే శరీరం, మేకప్‌తో చిత్రీకరించారు. ఫొటోలు వచ్చాక అంతా బాగుందంటున్నా నాకే ఏదోలా అనిపించి వదిలేశాను. తర్వాత 1982లో బొబ్బిలిపులి షూటింగ్‌ ఏవీఎంలో జరుగుతుంటే పక్కనే మరో షూటింగ్‌లో ఉన్న నేను అక్కడికి వెళ్లాను. అప్పుడే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ప్రకటించారు. సెట్‌లో అంతా నిశ్శబ్దం.. కళ్లుమూసుకుని కూర్చున్న ఎన్టీఆర్‌ తన చుట్టూ అంతా గమనిస్తూనే ఉన్నారు. ఆ సినిమాలో ఖైదీగా 2 పేజీల డైలాగ్‌ను భావోద్వేగాలతో ఒకే టేక్‌లో         పూర్తి చేశారు.

రామోజీరావు మద్దతుతోనే ఎన్నికల్లో పెద్ద విజయమని చెప్పారు..

రామోజీరావు మద్దతు లేకుంటే ఎన్నికల్లో తనకు పెద్ద విజయం వచ్చేది కాదని ఎన్టీఆర్‌ అప్పట్లో నాతో చెప్పారు. రామోజీరావుకు ఎప్పుడూ కృతజ్ఞుడినని అన్నారు. అంతా తనదే అని ఎన్టీఆర్‌ చెప్పొచ్చు. కానీ అలా చెప్పలేదు. ఎన్టీఆర్‌, శివాజీ, రాజ్‌కుమార్‌.. వీళ్లందరి ఆఖరు రోజుల్లో వారితో గడిపే అవకాశం నాకు లభించింది. ఎవరైనా పొగిడితే వారికి రుచించేది కాదు. ఇతరుల గురించి మాట్లాడరు. ఎన్టీఆర్‌ యుగపురుషుడు.. ఆయన కుటుంబంతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడాన్ని నాకు లభించిన భాగ్యంగా భావిస్తున్నా అని రజనీకాంత్‌ భావోద్వేగంగా మాట్లాడారు. అనంతరం చంద్రబాబు ఆయనను ఆలింగనం చేసుకుని అభినందించారు.


నాకే తెలియకుండా ఎగిరి గంతేశా

నా జీవితంలో నాకే తెలియకుండా నేను రెండుసార్లు ఎగిరి గంతేశా. 1983లో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పుడు, రెండోసారి హిమాలయాలకు వెళ్లి గంగా నదిని చూసినప్పుడు.


శ్రీకృష్ణపాండవీయం చూసి తెలుగు నేర్చుకున్నా

తెరపై చూసిన ఎన్టీఆర్‌ను 1963లో నిజంగా చూశాను. 13 ఏళ్ల వయసులో మినర్వా థియేటర్‌కు ఎన్టీఆర్‌, అంజలి, రేలంగి వచ్చారు. ఎవరో పైకెత్తి చూపించారు. తర్వాత 1966లో శ్రీకృష్ణపాండవీయంలో దుర్యోధన పాత్రలో ఎన్టీఆర్‌ను చూసి మెస్మరైజ్‌ అయ్యాను. ఆ డైలాగులతోనే తెలుగు నేర్చుకున్నాను.


ఎన్టీఆర్‌తో కలిసి పని చేసిన ప్రముఖులకు సత్కారం

ఈనాడు, అమరావతి : నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన అయిదుగురు ప్రముఖులను శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కలిసి సన్మానించారు. సన్మానం పొందిన వారిలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపల్లి నర్సాయమ్మ, గౌడప్రభ పత్రిక సంపాదకుడు వీరంకి నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌కు డిజైనర్‌గా పనిచేసిన వాలేశ్వరరావు, పూర్ణ పిక్చర్స్‌ అధినేత గ్రంథి విశ్వనాథ్‌, ఏపీ ఫిలిం ఛాంబర్స్‌ మాజీ అధ్యక్షుడు సి.రామచంద్రరావులను దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.


ఎన్టీఆర్‌ ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ

ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్‌ శాసనసభలో, బయట వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలతో ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌, వెబ్‌సైట్‌’ కమిటీ రూపొందించిన రెండు పుస్తకాల్ని చంద్రబాబు, రజనీకాంత్‌, బాలకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్‌, కమిటీలో సభ్యులుగా ఉన్న సీనియర్‌ పాత్రికేయుడు ఎస్‌.వెంకటనారాయణ, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సినీ నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్‌, అట్లూరి నారాయణరావు, పుస్తకాల్ని ఎడిట్‌ చేసిన పాత్రికేయుడు పూల విక్రం తదితరుల్నిఆయన అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని