ISIS drug - Tramadol: ట్రెమడాల్‌ ప్రమాదమని తెలిసీ.. పట్టించుకోరా?

కేంద్ర ప్రభుత్వం సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్స్‌ (మాదకద్రవ్యం)గా గుర్తించిన ట్రెమడాల్‌ వంటి ప్రమాదకరమైన మాత్రల్ని భారీగా ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలోని మందుల కంపెనీలకు రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం యథాలాపంగా అనుమతులివ్వడం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 30 Apr 2023 12:21 IST

వర్క్‌ ఆర్డర్‌ సరే,  ఎగుమతి ఆర్డర్‌ను పరిశీలించరా?
ఆ డ్రగ్‌ విధ్వంసకర శక్తుల  చేతుల్లో పడితే?
విస్తుగొలుపుతున్న  రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి తీరు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్స్‌ (మాదకద్రవ్యం)గా గుర్తించిన ట్రెమడాల్‌ వంటి ప్రమాదకరమైన మాత్రల్ని భారీగా ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలోని మందుల కంపెనీలకు రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం యథాలాపంగా అనుమతులివ్వడం ఆందోళన కలిగిస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని సేఫ్‌ ఫార్ములేషన్స్‌ కంపెనీలో ఉత్పత్తయిన ట్రెమడాల్‌ మాత్రలను బెంగళూరుకు చెందిన ఓ సంస్థ అనుమతుల్లేకుండా, కాల్షియం మాత్రల ముసుగులో ఎగుమతి చేస్తుండగా మూడు రోజుల క్రితం ముంబయి కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఇలాంటి మాత్రల తయారీకి అనుమతుల ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో బయటపడింది. ట్రెమడాల్‌ మాత్రల కోసం ఫలానా సంస్థకు ఎగుమతి ఆర్డర్‌ వచ్చిందని, ఆ సంస్థ తమకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిందని, వాటి తయారీకి అనుమతివ్వాలని ఏదైనా ఔషధ కంపెనీ దరఖాస్తు చేస్తే చాలు, ఔషధ నియంత్రణ విభాగం గుడ్డిగా అనుమతులిచ్చేస్తోంది. నిజంగానే ఎగుమతి ఆర్డర్‌ ఉందా? ఉంటే, ఏ తయారీ సంస్థ.. ఏ వినియోగ సంస్థ కోసం తయారు చేయాలనుకుంటోంది? ఏ దేశానికి ఎగుమతి చేస్తుంది? తదితర విషయాలు పట్టించుకోవడం లేదు. ఎగుమతి ఆర్డర్‌ లేకపోయినా, వర్క్‌ ఆర్డర్‌ చూపించి ట్రెమడాల్‌ మందుల ఉత్పత్తికి అనుమతి తీసుకుని, వాటిని దేశంలోనే సరఫరా చేసే ప్రమాదముంది. అనుమతులిచ్చాక కూడా.. ఆ ఔషధ కంపెనీ అనుమతిచ్చిన మోతాదు, పరిమాణంలోనే ఉత్పత్తి చేస్తుందా అన్నది పరిశీలిస్తున్నట్లుగా లేదు.

కేంద్రం ఆంక్షలను తోసిరాజని

నొప్పుల నివారణలో వాడే ట్రెమడాల్‌ను అధిక మోతాదులో తీసుకుంటే దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఐసిస్‌ వంటి సంస్థల్లో పనిచేసే ఉగ్రవాదులు తీవ్రమైన నొప్పుల నుంచి ఉపశమనానికి, తక్షణ శక్తికి, ఎక్కువ సమయం మేల్కొని ఉండేందుకు ఈ మాత్రలను వాడుతుంటారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు దీన్ని ‘ఐసిస్‌ డ్రగ్‌’గా పిలుస్తుంటాయి. ట్రెమడాల్‌ను మాదకద్రవ్యంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని 2018లో ‘మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్‌)’ పరిధిలోకి తెచ్చింది. దేశంలో ఈ మాత్రల వాడకమే కాదు, తయారీ, నిల్వ, ఎగుమతిపైనా ప్రభుత్వం పరిమితులు విధించింది. విదేశాలకు ఎగుమతి చేయాలంటే సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ (సీబీఎన్‌) అనుమతి కావాలి. మాత్రల తయారీకి ఔషధ కంపెనీలు సంబంధిత రాష్ట్రాల ఔషధ నియంత్రణ విభాగాల అనుమతి పొందాలి.


ఈ దందా ఎన్నాళ్లుగానో?

సేఫ్‌ ఫార్ములేషన్స్‌ కంపెనీలో తయారైన ట్రెమడాల్‌ మాత్రల్ని ఫస్ట్‌వెల్త్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ ఇటీవల భారీ సంఖ్యలో దక్షిణ సూడాన్‌ రాజధాని జుబాకు ఎగుమతి చేస్తూ కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడటం సంచలనం రేపింది. ఫస్ట్‌వెల్త్‌ సంస్థ ఆ మాత్రల ఎగుమతికి సీబీఎన్‌ అనుమతి తీసుకోకపోవడం, కస్టమ్స్‌ అధికారులు ఆ అక్రమ ఎగుమతుల తీగ లాగితే డొంక నరసరావుపేటలో కదలడం, ఆ కేసులో సేఫ్‌ ఫార్మొలేషన్స్‌ కంపెనీ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం చర్చనీయాంశమయ్యాయి. తెదేపా సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ దివంగత కోడెల శివప్రసాదరావు కుటుంబానికి చెందిన సేఫ్‌ ఫార్మా, సేఫ్‌ ఫార్ములేషన్స్‌ కంపెనీలు.. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక చేతులు మారాయి. డైరెక్టర్లుగా ఉన్న కోడెల కుటుంబసభ్యులను బయటకు పంపేసి, శనగల శ్రీధర్‌రెడ్డి, గాదె కనిగిరి, బాలినేని గోవిందరెడ్డి, బాలినేని అరుణ డైరెక్టర్లుగా చేరారు. వారంతా అధికార పార్టీ నాయకులకు సన్నిహితులని తెలుస్తోంది. సేఫ్‌ ఫార్ములేషన్స్‌ కంపెనీ ఇది వరకు కూడా ఫస్ట్‌వెల్త్‌ సొల్యూషన్స్‌కు 3.31 కోట్ల మాత్రలు (15,745 కిలోలు) సరఫరా చేసినట్టుగా ముంబయి కస్టమ్స్‌ విభాగం గుర్తించింది. మరో రెండు కంపెనీలకు కూడా ట్రెమడాల్‌ మాత్రలు సరఫరా చేసిందని, వాటిలో ఒక కన్‌సైన్‌మెంట్‌ను మార్చి 5న బెంగళూరుకు చెందిన ఐరిష్‌హెల్త్‌ గ్లోబల్‌ వెల్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సరఫరా చేసిందని ముంబయి కస్టమ్స్‌ విభాగం గుర్తించింది. అవన్నీ ట్రెమడాల్‌ మాత్రలేనా అన్నది నిర్ధారణ కావాల్సి ఉందని ఇటీవల ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చాయి. సేఫ్‌ ఫార్ములేషన్స్‌ సంస్థ యాజమాన్యం మారినప్పటి నుంచీ ఈ తరహా ఔషధాలను ఉత్పత్తి చేస్తోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలేవీ పెదవి విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని