Botsa Satyanarayana: ఉన్న సంగతి రాస్తే ఉలుకెందుకు అమాత్యా?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుక మడతేసిన తీరుపై ‘‘హవ్వ.. అది నోరేనా?’’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు.

Updated : 05 May 2023 07:30 IST

నోరు పారేసుకుంటే అబద్ధాలు నిజాలైపోవు
లేవనెత్తిన ప్రశ్నలకు బదులు చెప్పలేక బుకాయిస్తారా?

ఈనాడు-అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుక మడతేసిన తీరుపై ‘‘హవ్వ.. అది నోరేనా?’’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. ఈ కథనంలో లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వలేక.. బుకాయించారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ప్రాజెక్టు అసలు అవసరమే లేదని, దానిపై ఆరోపణలు చేసి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చటం నిజం కాదా? అవే అంశాలను జగన్‌ అప్పుడేమన్నారు.. ఇప్పుడేమంటున్నారు.. అనేది ఉన్నది ఉన్నట్లు, చెప్పింది చెప్పినట్లు రాస్తే అంత ఉలుకెందుకు..? అప్పట్లో ఈ విమానాశ్రయ ప్రాజెక్టుకు అడుగడుగునా మోకాలడ్డి.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీ నాయకుడు ఆటంకం కలిగించారనే విషయం ప్రజలందరికీ తెలుస్తోందనేగా మీ ఆందోళన? ఇష్టానుసారం నోరు పారేసుకున్నంత మాత్రాన మీరు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న ఆరోపణలు నిజమైపోవు బొత్స గారూ! తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ‘ఈనాడు’ సంధిస్తున్న ప్రశ్నలు.


టెండర్లు రద్దు చేయకుండా జీఎంఆర్‌కే ఎందుకిచ్చారు.. ఈ ఒక్క ప్రశ్నకు  సమాధానం చెప్పండి బొత్సా?

వైకాపా అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు మొదలుకుని అనేక ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులు రద్దు చేశారు కదా.. మరి భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి తెదేపా హయాంలోనే పిలిచిన టెండర్లు మాత్రం మీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదు? అప్పట్లో జీఎంఆర్‌ సంస్థకు ఈ టెండరు దక్కటంపై ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారే.. మరి అవే టెండర్లు ఆధారంగా, అదే జీఎంఆర్‌ సంస్థకు నాలుగేళ్ల తర్వాత మీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించటం వెనక మతలబు ఏంటి? అది కూడా జీఎంఆర్‌ గ్రూపు ఆధ్వర్యంలోని కాకినాడ సెజ్‌, కాకినాడ పోర్ట్‌ను.. జగన్‌కు సన్నిహితుడి కంపెనీ అరబిందోకు బదిలీ అయిన రెండేళ్లకి జరగటం ఏంటి? ‘‘చర్చకు సిద్ధమా?’’ అంటూ మీరు సవాల్‌ విసరుతున్నారు కదా! మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఒక్క ప్రశ్నకు సూటిగా, డొంక తిరుగుడు లేకుండా స్పష్టమైన సమాధానం చెప్పండి బొత్స గారూ చాలు.


నాడు-నేడు జగన్‌ది ఒకే మాట అనటం బరితెగింపు కాదా?

మంత్రి బొత్స సత్యనారాయణ: జగన్‌మోహన్‌రెడ్డి నాడు (ప్రతిపక్షంలో ఉన్నప్పుడు), నేడు (అధికారంలోకి వచ్చాక) ఒకే నోరుతోనే మాట్లాడుతున్నారు.

* 350 ఎకరాల్లో ఉన్న విశాఖ విమానాశ్రయంలోనే ఈగలు తోలుకుంటుంటే.. కొత్తగా భోగాపురం విమానాశ్రయం అవసరమా? అని మీ నాయకుడు జగన్‌ అనలేదా? చెన్నై విమానాశ్రయం 1,283 ఎకరాల్లో, కొచ్చిన్‌ విమానాశ్రయం 800 ఎకరాల్లో ఉన్నాయని.. అలాంటిది కొత్త విమానాశ్రయం కోసం భూమి సేకరించాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేయటం ఏంటి? రైతుల కడుపు కొట్టటం ఏంటి? అని మీ నాయకుడు అప్పట్లో ప్రశ్నించలేదా? ‘‘మరో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుంది. మన ప్రభుత్వం వస్తుంది. మీ భూములన్నీ తిరిగిచ్చేస్తాం’’ అంటూ ఓ నిర్వాసితురాలి తలపై చెయ్యిపెట్టి మరీ మీ నాయకుడు చెప్పలేదా? కోర్టుల్లో కేసులు వేసి మరీ భూ సేకరణను, ప్రాజెక్టును అడ్డుకుంటామని మీ జగన్‌ అనలేదా? ఆయన వ్యాఖ్యలన్నింటికీ మీరే కదా ప్రత్యక్ష సాక్షి. అప్పట్లో ఆయన పక్కన మీరే ఉన్నారు కదా! వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసుంటారు కదా! అయినా సరే మీరు ఇంతలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే.. దాన్నీ బరితెగింపు అనాలి.


మీ కడుపుమంట వల్లే ఈ పరిస్థితి

బొత్స: భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు చేస్తుంటే మీకు ఎందుకంత కడుపు మంట?

తెదేపా హయాంలో భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటే కడుపు మంటతో బాధపడింది.. రగిలిపోయింది మీరు, మీ పార్టీయే. ‘విశాఖపట్నం విమానాశ్రయంలోనే ఈగలు తోలుకుంటుంటే.. భోగాపురంలో ఎందుకు?’ అని ప్రశ్నించింది మీ నాయకుడు జగనే. కేసులేసైనా సరే భూ సేకరణను అడ్డుకుంటామని చెప్పింది, జీఎంఆర్‌ సంస్థ టెండర్లు దక్కించుకోవడంపై ఆరోపణలు చేసిందీ మీ నాయకుడే. ఈ పాటికే ఒక రూపం రావాల్సిన ఈ ప్రాజెక్టు నాలుగేళ్లుగా ఆగిపోయింది మీ కడుపు మంట వల్లే కాదా?


అప్పుడు ఈ ఇంగితజ్ఞానం ఏమైపోయింది?

మంత్రి బొత్స సత్యనారాయణ: రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి అంశంలోనూ వివాదం సృష్టించి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. దీని వల్ల ప్రజలు నష్టపోతారనే ఇంగితజ్ఞానం లేదా?

భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి తెదేపా హయాంలోనే ప్రతిపాదనలు రూపుదిద్దుకుని శంకుస్థాపన జరిగింది. ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా మోకాలడ్డింది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మీ నాయకుడు జగన్‌ కాదా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుంటే... ఈ ప్రాజెక్టును, భూ సేకరణను ఎందుకు వ్యతిరేకించారు? అప్పుడు మీరు చేసింది రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవటం కాదా? ఇప్పుడు మీరు చెబుతున్న ఇంగితజ్ఞానం అప్పుడేమైపోయింది? ఇప్పుడు కూడా భోగాపురం ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించట్లేదు. పైగా ఆ అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారు కూడా. ఇప్పుడు మీరు చెబుతున్న ఇంగితజ్ఞానం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీకు, మీ నాయకుడికి ఉండుంటే.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పాటికే విమానాశ్రయానికి ఒక రూపం వచ్చి ఉండేది కదా!


బలగం, భద్రత లేకుండా నిర్వాసితుల వద్దకు వెళ్లండి

బొత్స: భోగాపురం విమానాశ్రయం కోసం బెదిరించి, బలవంతంగా భూములు సేకరించినట్లు రైతులు మీకు చెప్పారా? మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశారా?

‘విమానాశ్రయం పేరిట ఉన్న ఊళ్లు బలవంతంగా ఖాళీ చేయించేశారు. అప్పటికప్పుడు పునరావాస కాలనీలకు పంపేశారు. ఇక్కడ ఎలా ఉన్నామో? ఎన్ని బాధలు పడుతున్నామో కనీసం ఒక్కరైనా చూశారా?’ అంటూ నిర్వాసితులు వాపోతుంటే వారి ఆవేదన మీ చెవికెక్కదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు గురించి పలుమార్లు వినతులిస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదంటూ వారు లబోదిబోమంటుంటే వారి బాధ మీకు పట్టదు. ఒక్కసారి మీ వెంట బలగం, భద్రత లేకుండా నిర్వాసితుల వద్దకు వెళ్లి అడగండి.. అప్పుడు వారు మీ పట్ల ఎలా ఉన్నారో అర్థమవుతుంది.


ఎందుకు అడ్డుకున్నారు?

బొత్స: ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకూడదన్నది మీ అభిప్రాయమా?

గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును అడ్డుకున్నది మీరే కదా! అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడింది కూడా మీరే కదా! మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు గడిపేసి ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అంటూ మాటలు చెబుతున్నారు. దీన్నిబట్టే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మీకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు