Guntur: గుంటూరులో వీధి పేరు మార్పుపై వివాదం

గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది ఓ వీధికి వేరొక పేరుతో బోర్డు పెట్టడం వివాదంగా మారింది. గుంటూరు నగరానికి కొత్తగా వచ్చిన వారు వీధులను గుర్తించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.

Published : 05 May 2023 06:55 IST

గుంటూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది ఓ వీధికి వేరొక పేరుతో బోర్డు పెట్టడం వివాదంగా మారింది. గుంటూరు నగరానికి కొత్తగా వచ్చిన వారు వీధులను గుర్తించేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏటీ అగ్రహారం 2వ లైన్‌ వద్ద ‘ఫాతిమా నగర్‌’ పేరుతో సూచిక బోర్డు ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. వైకాపా ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వచ్చాయి. దీంతో నగరపాలక కమిషనర్‌ కీర్తి చేకూరి స్పందించారు. కింది స్థాయిలో జరిగిన పొరపాటు వల్ల పక్కనున్న ‘ఫాతిమా నగర్‌’ వీధి పేరుతో ఏటీ అగ్రహారంలో సూచిక బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు.  దీనిపై పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందిస్తూ.. పేరు మార్పు ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గుత్తేదారు అవగాహన లేమితోనే పొరపాటున బోర్డు పెట్టారని.. విషయం తెలియగానే వెంటనే దాన్ని తొలగించామని పేర్కొన్నారు.


అగ్రహారం పేరును ఎందుకు మార్చారు?: సోము వీర్రాజు

ఈనాడు, అమరావతి: రాత్రికి రాత్రి గుంటూరులోని అగ్రహారం అనే ప్రాంతం పేరును మార్చేసి ఫాతిమా పేరుతో బోర్డును పెట్టడంలో అంతర్యమేమిటని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీచేశారు. విశాఖ నగరంలో సీతమ్మకొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహం పెట్టాలనుకోవడం వంటి ప్రయత్నాల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తుండడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు