Tejasvi kattimani: యాభై పైసల కూలీ.. ‘ఆదర్శ ఉపకులపతిగా!’

‘నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వ లేదయ్యో.. నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయో..’ అనే గీతంలో చిన్నారి పడే యాతనే విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉప కులపతి తేజస్వి కట్టీమని తన బాల్యంలో ఎదుర్కొన్నారు.

Updated : 05 May 2023 11:17 IST

స్ఫూర్తినింపుతున్న గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి కట్టీమని ప్రస్థానం
నూతన జాతీయ విద్యా విధాన రూపకల్పన కమిటీలో సభ్యుడిగా రాణింపు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే

‘నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వ లేదయ్యో.. నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయో..’ అనే గీతంలో చిన్నారి పడే యాతనే విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉప కులపతి తేజస్వి కట్టీమని తన బాల్యంలో ఎదుర్కొన్నారు. కానీ, ఆ కష్టాలను నెమరు వేస్తూ ఆయన కూర్చోలేదు. తన లక్ష్యం కోసం పని, చదువును సమన్వయం చేసుకుంటూ నేడు జాతీయ విద్యా విధానంలో సూచనలు చేసే స్థాయికి ఎదిగారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నదానికి చక్కని నిదర్శనం కట్టీమని. గిరిజన గూడెం నుంచి ఉపకులపతి స్థాయి వరకు ఎదిగారు. తినడానికి తిండి లేని పరిస్థితుల నుంచి నేడు ఎంతో మంది విద్యార్థుల ఆకలి తీర్చుతున్నారు. చదువు కోసం ఇంటి నుంచి పారిపోయి దొరికిన పనల్లా చేసిన అతనే తనలాగా ఎవరూ బాధపడొద్దని దిక్సూచీగా మారారు. కష్టాలు ఎదురొడ్డితే అద్భుతాలు సృష్టించగలమని తన అనుభవాలకు సాహిత్యాన్ని జోడించి అక్షర యజ్ఞం చేస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాసి నేటి తరంలో స్ఫూర్తి నింపుతున్నారు.

కట్టీమని.. 1955లో కర్ణాటకలోని కొప్పళ జిల్లా అళవండిలో జన్మించారు. తల్లి సంగవ్వ, తండ్రి యంకప్ప తలారి. వ్యవసాయ కూలీ పనులే వీరి జీవనాధారం. ముగ్గురన్నదమ్ముల్లో కట్టీమని తప్ప మిగతా ఇద్దరూ నిరక్షరాస్యులే.చిన్నతనం నుంచే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కలలుగన్నారు. కానీ..ఇంట్లో పరిస్థితులు అనుకూలించక బాల్యంలో పశువులు మేపడంతో పాటు రోజుకు 50 పైసలకు పొలంలో కూలీ పనికి వెళ్లారు. అయినా.. చదువుపై మనసు చంపుకోలేక కొన్నాళ్లకు ఉపాధ్యాయుల ఇంట్లో రాత్రిళ్లు పనులు చేస్తూ సొంతూరిలో ఏడో తరగతి పూర్తి చేశారు. ఇక చాలని కట్టీమనిని తండ్రి చదువు మాన్పించి, కిరాణా కొట్టులో పనికి పెట్టారు. ధ్యాసంతా చదువుపైనే ఉండటంతో కట్టీమని 60కి.మీ దూరంలో ఉన్న అమ్మమ్మ ఊరైన గదగ్‌కు పారిపోయారు. ఆమె ప్రోత్సాహంతో ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఎనిమిదో తరగతిలో చేరి ఇంటర్‌ వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత కూడా హాస్టల్‌లో మకాం, సెలవుల్లో నూనె మిల్లులో, హోటల్‌లో పని, గ్రంథాలయాల్లో చదువుతో డిగ్రీ వరకు నెట్టుకొచ్చారు.


చదువును వదల్లేదు..

‘ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును వదల్లేదు. అదే నేడు నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం కల్పించింది’ అని కట్టీమని గర్వంగా చెబుతున్నారు. డిగ్రీ చదువుతున్నప్పుడు తండ్రి మరణించడంతో కుటుంబ భారం కట్టీమనిపై పడింది. దాంతో.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అటెండర్‌గా పని చేస్తూనే చదువు కొనసాగించారు. కర్ణాటక విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీలో ప్రథమస్థానం సాధించారు. పీజీ పూర్తి చేసిన కొన్ని రోజులకే నెలకు రూ.745 జీతంతో విశ్వవిద్యాలయంలో ఒప్పంద అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. 1982లో శాశ్వత అధ్యాపకుడిగా ఎంపికై హైదరాబాద్‌ మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, 2014లో మధ్యప్రదేశ్‌లోని అమరకంటకలో ఆరేళ్లు ఉపకులపతిగా పనిచేశారు. 2020 నుంచి విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కొనసాగుతున్నారు.


అక్షర యజ్ఞంలో.. సేవా నేస్తం

కవి, రచయిత, అనువాదకుడిగా కట్టీమని గుర్తింపు పొందారు.

* 1983లో కన్నడంలో ‘ముంగారు మతై’ కవితా సంకలనం ప్రచురించారు.
* సాహిత్యం, గిరిజన హక్కుల ఉద్యమాలు, దేవదాసీ విధానం రద్దు కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

* రెండు కవితా సంకలనాలు, వ్యాస సంకలనాలు ప్రచురించారు.
* మండల్‌ నివేదిక గురించి కట్టీమని రాసిన పుస్తకం ఎంతగానో పేరు తెచ్చింది.

* 2016లో కర్ణాటక ప్రభుత్వం రాజోత్సవ పురస్కారం, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రతిష్ఠాత్మక పురస్కారం, భారత ప్రభుత్వం గంగాశరణ్‌ సింహా పురస్కారాలు లభించాయి.

* ‘జంగ్లీ కులపతి’ ఇటీవలే తెలుగు, కన్నడ భాషల్లో ప్రచురితమైంది. ఈ పుస్తకం విశ్వవిద్యాలయ ఆత్మకథగా ఆయన అభివర్ణించారు.
* గిరిజన పిల్లలు చదువు వైపు మళ్లేలా ధార్వాడ్‌లో నాయక్‌ హాస్టల్‌ని ప్రారంభించారు.


నూతన విద్యా విధానంతో  దృక్పథం మారింది: కట్టీమని

నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)తో నా ఆలోచనా దృక్పథం మారింది. ఏదో ఒక నైపుణ్యంతో ఏ వ్యక్తి రాణించలేరు. రాబోయే కాలంలో మల్టీ డిసిప్లీనరీ విద్యావిధానం వైపు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉండాలి. వేలసంఖ్యలో అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునేలా బహుళ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. కష్టాలు అనుభవించనిదే సుఖాలు పొందలేరన్న విషయాన్ని తెలుసుకోవాలి. బాల్యంలో జొన్నరొట్టే నా ఆహారం. వరి అన్నం తినడం గొప్పగా భావించేవాళ్లు. అటెండర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు తొలి జీతంతో బియ్యం కొని, అన్నం వండుకుని తినాలనుకున్నా సాధ్యపడలేదు. ప్రస్తుతం అన్నీ అందుబాటులో ఉన్నాయి. అధిక నైపుణ్యాలు నేర్చుకోవడంలో యువత దృష్టి పెట్టాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని