Karumuri Nageswara Rao: ‘ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న’ అని అర్థం: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

‘ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న’ అని అర్థమని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సరికొత్త భాష్యం చెప్పారు. అంతటితో ఆగకుండా అది తమ వాడుక భాష అని  సమర్థించుకున్నారు.

Updated : 09 May 2023 07:15 IST

ఈనాడు-అమరావతి: ‘ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న’ అని అర్థమని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సరికొత్త భాష్యం చెప్పారు. అంతటితో ఆగకుండా అది తమ వాడుక భాష అని  సమర్థించుకున్నారు. ఈ నెల 6న తణుకు మండలం వేల్పూరులో మంత్రి పర్యటన సందర్భంగా అకాల వర్షాల వల్ల ధాన్యం మొలకొచ్చిదంటూ ఓ రైతు తన ఆవేదనను వివరించే ప్రయత్నం చేశారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి కారుమూరి.. ఆ రైతును ఉద్దేశించి ‘‘ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తా’’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, మంత్రి వ్యవహారించిన తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. సోమవారం ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. ‘‘నేను రైతులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి బాగా తాగొచ్చారు. నా ధాన్యానికి మొలకొచ్చిందండి, మొలిచేసిందండి అంటూ పదే పదే చెప్పారు. ఏ గింజైనా కొంటామని నేను సమాధానం చెప్పాను. మరి అగ్రిగోల్డ్‌ సంగతి ఏంటండి అంటూ మాట్లాడారు. అందుకే నేను ఎర్రిపప్పా అని అన్నా. ఎర్రిపప్పా అంటే బుజ్జినాన్న అన్నట్లు. ఇది మా వాడుక భాష. ఎర్రిపప్పా.. ఎర్రినాన్న అని అంటారు...’’ అని కారుమూరి అన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని