EPFO: ఉద్యోగి సమ్మతికి మూడు నెలల సమయం
అధిక పింఛను కోసం ఉద్యోగుల పింఛను నిధికి (ఈపీఎస్) బకాయిలు చెల్లించేందుకు, ఉద్యోగి పీఎఫ్ ఖాతాల్లోని నగదు బదిలీ చేసేందుకు పింఛనుదారులు/సభ్యులు తమ సమ్మతి తెలియజేయడానికి డిమాండ్ నోటీసు జారీ చేసినప్పటినుంచి మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది.
ఈపీఎస్ బకాయిల చెల్లింపునకు రాతపూర్వక అంగీకారం తప్పనిసరి
ఈపీఎఫ్ ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకుంటే ప్రత్యేకంగా డిపాజిట్, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు
ఈపీఎస్ బకాయిల లెక్కింపు, జమపై మార్గదర్శకాల జారీ
ఈనాడు, హైదరాబాద్: అధిక పింఛను కోసం ఉద్యోగుల పింఛను నిధికి (ఈపీఎస్) బకాయిలు చెల్లించేందుకు, ఉద్యోగి పీఎఫ్ ఖాతాల్లోని నగదు బదిలీ చేసేందుకు పింఛనుదారులు/సభ్యులు తమ సమ్మతి తెలియజేయడానికి డిమాండ్ నోటీసు జారీ చేసినప్పటినుంచి మూడు నెలల సమయం ఇవ్వనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. అధికపింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ల ఆమోదం, ఈపీఎస్‌లో జమచేయాల్సిన బకాయిలు వడ్డీతో లెక్కింపు, ఆ మొత్తం జమచేసేందుకు మార్గదర్శకాలను ఈపీఎఫ్‌వో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ (పింఛన్లు) అప్రజిత జగ్గీ జారీచేశారు. త్వరలోనే పింఛను లెక్కింపు విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అధిక పింఛనుకు అర్హులైన పింఛనుదారులు/ సభ్యులు ఈపీఎస్‌లో 9.49 శాతం జమచేయాలని కార్మికశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల పరిష్కారాన్ని నిరంతరం పరిశీలించి జోనల్, ప్రాంతీయ పీఎఫ్ అధికారులు బకాయిల లెక్కింపు, సమాచారం చేరవేత వివరాలతో రోజువారీగా నివేదికలు అందజేయాలని సూచించారు.
అధిక పింఛను నోటిఫికేషన్ ప్రకారం..
* ఉమ్మడి ఆప్షన్లు అర్హమైనవిగా గుర్తించినప్పుడు రూ.15 వేలకు మించిన వేతనంపై 1.16 శాతం అదనపు చందా మొత్తాన్ని ఈపీఎస్‌కు యజమాని వాటా నుంచి చెల్లించాలి.
* అర్హమైన దరఖాస్తుల విషయంలో గతంలో అధికవేతనంపై చందాను ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో చెల్లించారు. కానీ అంతే మొత్తాన్ని పింఛను నిధిలో చెల్లించలేదు. ఈ తరహా కేసుల్లో యజమాని వాటా నుంచి 8.33 శాతాన్ని పింఛను నిధికి సర్దుబాటు చేయాలి.
* ఇప్పటికీ సర్వీసులో కొనసాగుతున్న సభ్యులు ఉమ్మడి ఆప్షన్లు ఆమోదం పొందినప్పుడు, ప్రస్తుత యజమాని భవిష్యత్తులో అధిక వేతనంపై పింఛనునిధికి అదనపు చందా 1.16 శాతంతో కలిపి 9.49 శాతం చందా జమచేస్తూ ఉండాలి.
దరఖాస్తుల వర్గీకరణ ఇలా...
తొలి కేటగిరీ : ఉద్యోగి వేతనంపై ఈపీఎస్‌కు చెల్లించాల్సిన మొత్తం అప్పటికే ఈపీఎస్‌లో జమచేసి ఉంటే, అధిక పింఛను బకాయి సొమ్ము స్వీకరించినట్లు ఈపీఎఫ్‌వో సంబంధిత పింఛనుదారుడు/చందాదారుడికి సమాచారం ఇస్తుంది.
రెండో కేటగిరీ : బకాయిల మొత్తాన్ని ఈపీఎస్‌లో జమచేయకుండా, అధిక వేతనంపై చందాను పూర్తిగా ఉద్యోగి ఖాతాలో జమ చేసిన సందర్భంలో పీఎఫ్ ఖాతాలో బకాయిలకు తగిన నిల్వలు ఉంటే, ఆ మొత్తాన్ని పింఛనునిధికి మళ్లిస్తామని సంబంధిత యజమాని ద్వారా పింఛనుదారు/చందాదారుడికి ఈపీఎఫ్‌వో సమాచారం అందిస్తుంది. ఈ మళ్లింపు కోసం యజమాని సంబంధిత ఉద్యోగి నుంచి రాతపూర్వక అంగీకారపత్రాన్ని తీసుకుని, దానిని ఫీల్డ్ అధికారికి అందజేయాలి.
మూడోకేటగిరీ: బకాయిల మొత్తం ఈపీఎస్‌లో జమకాలేదు. కానీ అధికవేతనంపై పూర్తిచందా ఈపీఎఫ్ ఖాతాలో జమ అయింది. అయితే ప్రస్తుతం ఆ పీఎఫ్ ఖాతాలో బకాయిలకు సరిపడా నిల్వలు లేవు. ఈ సందర్భంలో అవసరమైన నగదు నిల్వలు లేవంటూ ఈపీఎఫ్‌వో యజమాని ద్వారా సమాచారం ఇస్తుంది. ఈ సమయంలో అందుబాటులోని నిధులు మళ్లించేందుకు ఉద్యోగి అంగీకారపత్రాన్ని క్షేత్రస్థాయి అధికారికి ఇవ్వాలి. అలాగే మిగతా నగదును ఈపీఎఫ్‌వో రికార్డుల్లో నమోదైన బ్యాంకు ఖాతా నుంచి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ జమకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సౌకర్యం అందిస్తుంది. సంబంధిత ప్రాంతీయ పీఎఫ్ అధికారి పేరిట డీడీ తీయాలి. ఈ డీడీ వెనుక దరఖాస్తు ఐడీ, యూఏఎన్ నంబరు లేదా పింఛను చెల్లింపు పత్రం (పీపీవో) నంబరు, పేరు, మొబైల్ నంబరు, డిమాండ్ నోటీసు నంబరు, తేదీ వివరాలు రాయాలి.
బకాయిల లెక్కింపు ఇలా...
ఉద్యోగుల వేతన వివరాలను జతచేసి యాజమాన్యాలు దరఖాస్తులు సమర్పించిన తరువాత క్షేత్రస్థాయి అధికారులు వాటిని పరిశీలిస్తారు. ప్రతి సభ్యుడు/చందాదారుడి కేసుకు ఈ-ఆఫీసులో ప్రత్యేక దస్త్రాన్ని సిద్ధం చేయాలి. దీనిపై ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు సమయంలో వచ్చిన ఐడీని జతచేయాలి. మినహాయింపు సంస్థలకు సంబంధించి చందా వివరాలు అందుబాటులో ఉండాలి.
* 1995 నవంబరు 16 నుంచి (ఈపీఎస్ చట్టం అమలులోకి వచ్చాక) యజమాని వాటా నుంచి 8.33 శాతం మొత్తాన్ని లెక్కించాలి.
* 2014 సెప్టెంబరు 1 నుంచి గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులకు యజమాని నుంచి 1.16 శాతం మొత్తాన్ని గణించాలి.
* పీఎఫ్ ఖాతాలపై చట్టప్రకారం ఇచ్చిన వడ్డీ ప్రాతిపదికన బకాయిల మొత్తంపై వడ్డీని వసూలు చేస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్