Supremecourt: హైకోర్టు తుది తీర్పునకు లోబడే.. ఆర్‌5 జోన్‌లో పట్టాల పంపిణీ

ఆర్‌5 జోన్‌లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు ఇళ్ల పట్టాల పంపిణీ.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లలో హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated : 18 May 2023 07:36 IST

ఒకవేళ పంపిణీ చేస్తే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి
కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలాంటి ప్రత్యేక హక్కులూ కోరరాదు
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: ఆర్‌5 జోన్‌లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు ఇళ్ల పట్టాల పంపిణీ.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లలో హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ పట్టాలు పంపిణీ చేస్తే లబ్ధిదారులకు ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు (స్పెషల్‌ ఈక్విటీ) వారికి ఉండబోదని స్పష్టం చేసింది. అమరావతి మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఎలక్ట్రానిక్‌ సిటీకి కేటాయించిన 900 ఎకరాలను రద్దు చేసి ఆ స్థలాన్ని ఈడబ్ల్యూఎస్‌ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజధాని రైతులు వేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ అరవింద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గంటన్నరపాటు విచారించి ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ‘ప్రస్తుత కేసులో పిటిషనర్లు కోరినట్లు మధ్యంతర ఉపశమనం కల్పించడానికి హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ప్రతివాదుల చర్యలను బట్టిచూస్తే లోగడ హైకోర్టు కొన్ని నిర్దుష్టమైన ఆదేశాలనిచ్చింది. ఆ కేసులు ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. అది అలా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఈ-సిటీకి కేటాయించిన భూమిలో చెప్పుకోదగ్గ భాగాన్ని (గుడ్‌ చెంక్‌) ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించాలని నిర్ణయించింది.

దీన్ని పిటిషనర్లు (రాజధానిని) దెబ్బతీయడంగా పేర్కొంటున్నారు. ఇది ఇదివరకు హైకోర్టు ఫుల్‌బెంచ్‌ తీర్పును ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. ఈ కేసులో కక్షిదారుల వాదనలు విన్నాక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వును సవరిస్తున్నాం. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈడబ్ల్యూఎస్‌ ఇళ్ల కోసం ఒకవేళ ఎవరికైనా పట్టాలనిస్తే అది ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌పిటిషన్లలో వెలువడే తుది తీర్పునకు లోబడే ఉంటుంది. పట్టాలిచ్చేటప్పుడు స్థలాల కేటాయింపు హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టంగా పేర్కొనాలి. (ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే) అవి పొందినవారికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు ఉండదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్యామ్‌దివాన్‌, రంజిత్‌కుమార్‌, దేవదత్‌ కామత్‌, దామా శేషాద్రినాయుడు, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ, లబ్ధిదారుల తరఫున సీనియర్‌ అడ్వొకేట్లు అభిషేక్‌ మనూసింఘ్వీ, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, రాజూరామచంద్రన్‌లు వాదనలు వినిపించారు.

మాస్టర్‌ప్లాన్‌ ధ్వంసమే..

మాస్టర్‌ప్లాన్‌ రూపొందించేటప్పుడే ప్రతిపాదిత 9 ఉపనగరాల్లోనూ రెసిడెన్షియల్‌ జోన్లు కేటాయించి అందులో ఈడబ్ల్యూఎస్‌కు స్థలాలు గుర్తించారని రైతుల తరఫు న్యాయవాది శ్యామ్‌దివాన్‌ తెలిపారు. మొత్తం రాజధానిలో ఈడబ్ల్యూఎస్‌ వర్గాల కోసం 5% స్థలాలు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మారినంత మాత్రాన మొత్తం ప్రణాళికను పక్కనపెట్టడానికి వీల్లేదన్నారు. చట్టప్రకారం ప్రభుత్వాలు ఎప్పుడు మాస్టర్‌ప్లాన్లు రూపొందించినా ప్రజాభిప్రాయాన్ని సేకరించి పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను న్యాయమూర్తులకు చూపించారు. గత ప్రభుత్వం రాజధాని వ్యాప్తంగా ఇళ్ల స్థలాలను కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ సిటీకి కేటాయించిన 900 ఎకరాలను ఇందుకోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని అన్నారు. ఒక సిటీ కోసం కేటాయించిన స్థలాన్ని పట్టాలుగా పంపిణీ చేస్తే పునరుద్ధరించడం అసాధ్యమని, తద్వారా రాజధాని స్వరూపం ధ్వంసమవుతుందని పేర్కొన్నారు.

ఈ సమయంలో జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ రాజధాని కోసం భూమి ఇచ్చినందుకు మీకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు తప్పితే వాటితోపాటు ఫలానావి ఉంటాయని చెప్పలేదు కదా? అని న్యాయవాది శ్యామ్‌దివాన్‌ను ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ మాస్టర్‌ప్లాన్‌లోనే ఎక్కడ ఏమేం ఉంటాయని చెప్పారని, అందులోనే ఈడబ్ల్యూఎస్‌ స్థలాలనూ కేటాయించినందున తదనుగుణంగానే ప్రణాళిక అమలును రైతులు కోరుతున్నారన్నారు. ఆర్‌5 జోన్‌కు వ్యతిరేకంగా గ్రామ సభలన్నీ తీర్మానించడంతోపాటు ప్రజలనుంచి 5,844 అభ్యంతరాలు, సూచనలు, సలహాలు వస్తే సీఆర్‌డీఏ వేటినీ పరిగణనలోకి తీసుకోలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే పేదల కోసం నిర్మించిన 5,800కిపైగా ఇళ్లు పంపిణీ చేయకుండా మాస్టర్‌ప్లాన్‌ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నందున స్టేటస్‌కోకానీ, స్టేకానీ ఇవ్వాలని కోరారు. మరో సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ రిట్‌ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం మే 1న ఇచ్చిన ఉత్తర్వుల్లో మే 8వ తేదీకల్లా ప్లాట్లను అభివృద్ధి చేయాలని పేర్కొన్నట్లు తెలిపారు.

మరో న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదిస్తూ ఎలక్ట్రానిక్‌ సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా హామీనిచ్చిందని, దాన్ని హైకోర్టు ఫుల్‌బెంచ్‌ సమర్థించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ మీరు స్థలాలిచ్చేటప్పుడు ప్రభుత్వం కచ్చితంగా ఏం చెప్పిందని ప్రశ్నించారు. చట్టపరంగా హామీనిచ్చిన ఎలక్ట్రానిక్‌ సిటీతోపాటు, నవనగరాల స్వరూపాన్ని మార్చకూడదన్నదే తమ వాదన అని దేవదత్‌ కామత్‌ పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలంటే ప్రత్యేకాధికారిని నియమించాలని న్యాయవాది దామా శేషాద్రినాయుడు పేర్కొన్నారు. దీనికి భిన్నంగా సీఆర్‌డీఏనే మార్పులు ప్రతిపాదించిందన్నారు.

ఎక్కడ ఎవరికి భూమి ఇవ్వాలన్నది నిర్ణయించడానికి వారెవరు?

ఏపీ ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ రైతులనుంచి సేకరించిన 34వేల ఎకరాల్లో 900 ఎకరాలనే ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించినట్లు చెప్పారు. ఇది మొత్తం భూమిలో 3.1% మాత్రమేనన్నారు. చట్టంలో ఈడబ్ల్యూఎస్‌కు కనీసం 5% భూమి కేటాయించినట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన తీర్పులో హైకోర్టు దీన్ని అమలు చేయమని చెప్పిందని, అలాంటప్పుడు ఎలా కాదంటారని ప్రశ్నించారు. ఇదివరకు అదే తీర్పు అమలుకు ఉత్తర్వులివ్వాలని కోరారని, ఇప్పుడు దాన్నే అమలుచేయొద్దని కోరుతున్నారని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ మాస్టర్‌ప్లాన్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోసం స్థలాలను భిన్న ప్రాంతాల్లో కేటాయించారు కదా? ప్రణాళికను పక్కనపెట్టేలా మార్పు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎక్కడ ఎవరికి భూమి ఇవ్వాలన్నది నిర్ణయించడానికి వారెవరని సింఘ్వీ పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత పట్టాలివ్వడానికి ఎంత సమయం తీసుకుంటారని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించగా.. ఇప్పటికే కేటాయింపులు జరిపినట్లు సింఘ్వీ బదులిచ్చారు.

ఒకవేళ ఈ కేసులో వాళ్లు గెలిచినా అక్కడ కార్మికులు అవసరమవుతారని, ఇందుకోసం మరో 900 ఎకరాలు కేటాయించాల్సి వస్తుందని అన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ ఈ కేసు తుది విచారణకు ముందే ఎన్నో మార్పులు చేయడం చట్టవ్యతిరేకమన్న పిటిషనర్ల వాదనలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్‌కు 5% స్థలాలు కేటాయించాలని పాత చట్టంలోనే చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వం దాన్నే అమలు చేస్తోందని సింఘ్వీ వివరించారు. దాన్ని హైకోర్టు ఫుల్‌బెంచ్‌ సమర్థించిందన్నారు. వచ్చే జులైలో ఈ కోర్టు ముందు జరిగే విచారణలో ఆ తీర్పును సమర్థించినా తేడా ఏమీ రాదని వివరించారు. సీఆర్‌డీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ మాస్టర్‌ప్లాన్‌లో 0.09% మాత్రమే ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించినట్లు తెలిపారు. విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మెమో రూపంలో హైకోర్టుకు చెప్పిందని గుర్తుచేశారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ మాస్టర్‌ప్లాన్‌లో ఈడబ్ల్యూఎస్‌కు ఇప్పటిలా ఒకేచోట క్లస్టర్‌లాగా కాకుండా విభిన్న ప్రాంతాల్లో భూమి కేటాయించినట్లు చెప్పారు కదా? అని ప్రశ్నించారు.

నిరంజన్‌రెడ్డి బదులిస్తూ ఇప్పుడు కూడా 3, 4 చోట్ల కేటాయిస్తున్నారని చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు చేస్తూ ప్రజాభిప్రాయాన్ని కోరగా ఐదు వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయన్నది నిజమని, ఏ పిటిషనర్‌ దీనికి అభ్యంతరం చెబుతున్నట్లు చెప్పలేదని తెలిపారు. అప్పుడు జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అధీకృత సంస్థపై లేదా? అని ప్రశ్నించారు. అందుకు నిరంజన్‌రెడ్డి బదులిస్తూ.. అభ్యంతరం వ్యక్తం చేసిన వారు కేవలం మాస్టర్‌ప్లాన్‌ను మార్చొద్దని మాత్రమే చెప్పారన్నారు. జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ ఈ అభ్యంతరాలను పరిశీలించినట్లు ప్రొసీడింగ్స్‌లో ఎక్కడ చూపారు? కసరత్తు ఎక్కడ? అని ప్రశ్నించారు. నిరంజన్‌రెడ్డి బదులిస్తూ భూసమీకరణకు ప్రాతిపదికైన మాస్టర్‌ప్లాన్‌ను మార్చొద్దన్న ఒకే ఒక అభ్యంతరాన్నే వారు వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఆ అభ్యంతరాన్ని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పరిశీలించి అసాధ్యమని చెప్పిందన్నారు. పిటిషనర్లుగా మీరు వ్యక్తిగతంగా అభ్యంతరం తెలిపారా? అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించగా.. శ్యామ్‌దివాన్‌ లేదని చెప్పగా, తమ క్లయింట్‌ వ్యక్తిగతంగా అభ్యంతరం చెప్పారని శేషాద్రినాయుడు ధర్మాసనానికి చెప్పారు.

మాస్టర్‌ప్లాన్‌లో 17వేల ఎకరాలు నివాసాలకు కేటాయించారని, అందులో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలూ ఉన్నాయని తెలిపారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ ఉదాహరణకు జులైలో రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసులను డిస్మిస్‌ చేసి, హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయమని చెబితే మీ పరిస్థితేమిటి? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. న్యాయవాది రాజూరామచంద్రన్‌ స్పందిస్తూ ఇది ఈడబ్ల్యూఎస్‌ వర్గాల జీవనోపాధికి సంబంధించిన విషయమన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ స్పందిస్తూ దాంతో దీన్ని కలపొద్దని సూచించారు. ఈ-సిటీకి కేటాయించిన మొత్తం 6వేల ఎకరాల్లో 700 ఎకరాలు ఈడబ్ల్యూఎస్‌కు కేటాయిస్తే దాదాపు పది శాతం అవుతుందని, ఆ మేరకు ఈ-సిటీ స్థలాన్ని వాడుకోవడం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉంటామని, ఎలాంటి ఈక్విటీ కోరబోమంటూ అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. జులైలో మీరు హైకోర్టు తీర్పును సమర్థిస్తే దాని ప్రకారం 5% స్థలం ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించాల్సి ఉంటుందని, ప్రత్యేకంగా కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదని సింఘ్వీ పేర్కొన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ బదులిస్తూ మీరు ఆ కేసులో గెలిస్తే సరే.. తర్వాత ఆశ్చర్యకరంగా ఏదో ఒకటి చెప్పకూడదంటూ పై ఉత్తర్వులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని