వాలంటీర్లను నాయకుల్ని చేస్తా

గ్రామ, వార్డు వాలంటీర్లను నాయకులుగా చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ పునరుద్ఘాటించారు. వాలంటీర్లను ఉద్దేశించి తాను చేసిన తొలి ప్రసంగంలోనూ ఇదే చెప్పానన్నారు.

Published : 20 May 2023 05:37 IST

మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ భావాలకు అవరోధాలు కల్పించం
ప్రభుత్వానికి వాలంటీర్లు కూడా అండగా ఉండాలి
‘వాలంటీర్లకు వందనం’ సభలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు వాలంటీర్లను నాయకులుగా చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ పునరుద్ఘాటించారు. వాలంటీర్లను ఉద్దేశించి తాను చేసిన తొలి ప్రసంగంలోనూ ఇదే చెప్పానన్నారు. వాలంటీర్ల రాజకీయ హక్కులకు, అభ్యుదయ, ఆదర్శ భావాలకు అవరోధాలు ఏవీ ఉండవని సీఎం తెలిపారు. ఎవరైనా ఫలానా పని చేయకూడదని అంటే వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పాలని వాలంటీర్లకు సూచించారు. వారానికి రెండుసార్లు వేసేది హాజరు కాదని.. ఏ సమయంలోనైనా ప్రభుత్వానికి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రెజెన్స్‌ను మార్కు చేసే కార్యక్రమంగా ముఖ్యమంత్రి వివరించారు. ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న వాలంటీర్లు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. విజయవాడలో శుక్రవారం ‘వాలంటీర్లకు వందనం’ పేరుతో నిర్వహించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ సభలో సీఎం ప్రసంగించారు.

పురస్కారాలకు మూడేళ్లలో రూ.705 కోట్ల ఖర్చు

‘వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమమిది. నగదు పురస్కారాల కోసం మూడేళ్లలో ప్రభుత్వం మీ కోసం రూ.705 కోట్లు ఖర్చుచేసింది. సంక్షేమ పథకాల అమలులో మీది కీలకపాత్ర. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ఇలాంటి సారథులు, వారధులు దేశంలో ఎక్కడా లేరు. ప్రభుత్వంలో తీసుకొస్తున్న అనేక మార్పులకు మీరు కూడా సాక్ష్యాలు. ఇంటికెళ్లి ఒకటో తేదీనే ప్రజలకు పింఛను ఇస్తున్న వ్యవస్థను... అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా వంటివి అందించడాన్ని గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా? అని ప్రజలను అడిగే నైతికత మీకే సొంతం’ అని జగన్‌ అన్నారు.

వాలంటీర్లే బ్రాండ్‌ అంబాసిడర్లు

‘గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకాలు చూశారు. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన తులసి మొక్క లాంటిది వాలంటీర్ల వ్యవస్థ. ప్రతి అక్కను నీకు మంచి జరిగిందా.. లేదా అని నిజాయతీగా అడగగలిగే నైతికత ఈ ప్రభుత్వానికి ఉంది. మీ పరిధిలోని ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలి. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలి. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదే’ అని వాలంటీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి చెప్పారు.

ఉద్యోగం కాదు... స్వచ్ఛంద సేవే

‘మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవే కాబట్టి... ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు. దీన్ని వాలంటీర్లు గుర్తుపెట్టుకోండి. పనిచేస్తున్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులు కారు’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ‘తెదేపా అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి తిరిగి జన్మభూమి కమిటీలు తెస్తానంది. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్లు మద్యం తాగుతారని, అల్లరి మూకలని చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాలంటీర్ల సేవలకు ప్రజల గుర్తింపు రావడంతో మీరంతా జగన్‌ సైన్యమంటున్నారు. ఈ వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపు మంట. నిరంతరం దుష్ప్రచారం, విమర్శలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. సమావేశంలో పురపాలక, పంచాయతీరాజ్‌శాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బూడి ముత్యాలనాయుడు, సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్‌జైన్‌ తదితరులు మాట్లాడారు.

గౌరవ వేతనంపై ఆలోచించండి: సీఎంకు వాలంటీరు సూచన

విజయవాడకు చెందిన వాలంటీరు ఉప్పాల సురేశ్‌ మాట్లాడుతూ ఈ వ్యవస్థతో ప్రజల్లో తనకెంతో గుర్తింపు లభించిందని చెప్పారు. తమ ధైర్యం, నమ్మకం, భవిష్యత్తు అయిన సీఎం జగన్‌.. తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నామని అన్నారు. గౌరవవేతనం పెంపు అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. వాలంటీర్లు హేమ, మురళి కూడా మాట్లాడారు. సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులు సాధించిన కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన పలువురు వాలంటీర్లను శాలువలతో సీఎం సత్కరించి మెమొంటో, సర్టిఫికెట్లు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు