దస్తగిరి క్షమాభిక్ష రద్దు పిటిషన్‌ను పరిగణించవద్దు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయాలని వివేకా హత్యపై ఫిర్యాదు చేసిన ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ వేశారని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోవద్దని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు విన్నవించారు.
దీన్ని కోరుతున్న కృష్ణారెడ్డి బాధితుడు కాదు
సుప్రీంకోర్టులో సునీత విన్నపం
ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయాలని వివేకా హత్యపై ఫిర్యాదు చేసిన ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ వేశారని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోవద్దని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఎంవీ కృష్ణారెడ్డి వేసిన మిసిలేనియస్ అప్లికేషన్‌లో ఆమె శుక్రవారం ఇంప్లీడ్ అయ్యారు. బాధితుడి ముసుగులో కృష్ణారెడ్డి ఈ పిటిషన్ వేశారని జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ముందు విన్నవించారు. ‘దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయాలంటూ హత్య కేసు నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి లోగడ పిటిషన్ వేస్తే.. నిందితులకు అలా కోరే హక్కు లేదని, సరైన వ్యక్తులు (కాంపిటెంట్ పర్సన్) సవాలుచేస్తే చట్టప్రకారం, మెరిట్స్ ఆధారంగా పరిశీలించవచ్చని 2022 అక్టోబరు 10న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల్లోని ‘కాంపిటెంట్ పర్సన్’ పదాన్ని ప్రస్తావిస్తూ వివేకా హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తానే కాబట్టి క్షమాభిక్ష రద్దు కోరుతూ పిటిషన్ వేస్తున్నానని కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను గురువారం ఆయన తరఫు న్యాయవాదులు ఇదే ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
విషయం తెలిసి సునీత శుక్రవారం పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యారు. ఈ హత్య కేసులో తాను, తన తల్లి మాత్రమే బాధితులమని, ఫిర్యాదు చేసినంత మాత్రాన కృష్ణారెడ్డిని బాధితుడిగా గుర్తించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ‘కృష్ణారెడ్డి.. వివేకా వ్యక్తిగత సహాయకుడు మాత్రమే. ప్రతి దశలో ఆయన ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నవారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించడానికి నిందితుల ప్రోద్బలంతో సీబీఐకి, నాకు, నా భర్తకు, నా తల్లికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయించడానికి నిందితుల ప్రయత్నాలు విఫలమయ్యాక కృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. దస్తగిరి సాక్ష్యం వెలుగులోకి వచ్చాక సీబీఐ కేసు దర్యాప్తులో పురోగతి సాధించింది. అందువల్ల క్షమాభిక్ష రద్దు కోరుతూ వేసిన అప్లికేషన్‌ను రద్దు చేయాలి. ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన తనను బాధితుడిగా గుర్తించాలన్న కృష్ణారెడ్డి విన్నపం మేరకు.. నా, సీబీఐ వాదనలు వినకుండా ఉత్తర్వులిస్తే అది మాకు నష్టం చేకూర్చినట్లవుతుంది. ఈ హత్యలో పాల్గొన్న వారందరికీ శిక్షపడేలా నేను, నా తల్లి ప్రయత్నిస్తుంటే కృష్ణారెడ్డి మాత్రం హత్యలో భాగస్వాములైన ప్రభావశీల వ్యక్తులకు రక్షణ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తు సరిగా లేదని, సీబీఐకి అప్పగించాలని నా తల్లి న్యాయస్థానంలో పిటిషన్ వేయడం వల్లే ఈ కేసు సీబీఐకి వెళ్లింది. ఈ తీర్పులో నన్ను, నా తల్లినే కోర్టు బాధితులుగా గుర్తించింది’ అని సునీత తన విన్నపంలో పేర్కొన్నారు.
ఆమె తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం ముందు వాదనలను వినిపించారు. ఈ కేసులో తన క్లయింట్, ఆమె భర్త, ఆమె తల్లిని ప్రాసిక్యూట్ చేయమని కోరిన వ్యక్తి ఇప్పుడు తననే బాధితుడిగా గుర్తిస్తూ స్పష్టత ఇవ్వమని కోరుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. జస్టిస్ కృష్ణమురారి జోక్యం చేసుకుంటూ ‘గురువారం వాళ్లు ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వుల్లోని కాంపిటెంట్ పర్సన్ పదంపై స్పష్టతనివ్వాలి’అని పేర్కొన్నారు. ‘ఇది సింపుల్ క్లారిఫికేషన్ అన్న ఉద్దేశంతో స్పష్టతనిస్తామని చెప్పాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులేమీ జారీ చేయనందున వాదనలను జులై 3 లేదా 4న వింటాం’ అని పేర్కొన్నారు. అయితే కృష్ణారెడ్డి అప్లికేషన్ జులై 3న లిస్ట్ అయిందని, దాన్నీ అదే రోజు తీసుకోవాలని సునీత తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీబీఐకీ నోటీసులిచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్