Ap Volunteers: ఆహ్వానించి.. అవమానించారు!

చంటిపిల్లలను చంకన వేసుకొని వచ్చినవారు కొందరు.. గర్భిణులు కొంతమంది.. ఎండకు తాళలేక చెట్లకిందకు వెళ్లేవారు మరికొందరు.

Updated : 20 May 2023 08:06 IST

వాలంటీర్లను సీఎం సభ బయటే నిలిపిన పోలీసులు
ఎండవేడిమికి అల్లాడిన మహిళా వాలంటీర్లు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే-విజయవాడ సిటీ: చంటిపిల్లలను చంకన వేసుకొని వచ్చినవారు కొందరు.. గర్భిణులు కొంతమంది.. ఎండకు తాళలేక చెట్లకిందకు వెళ్లేవారు మరికొందరు. తిరిగి వెళ్లిపోతే ఏం ప్రమాదమో.. ఉంటే పోలీసుల అదిలింపులు.. శుక్రవారం విజయవాడలో సీఎం సభకు హాజరైన వాలంటీర్ల దుస్థితి ఇది. 

‘ఇక్కడ నిలబడవద్దు.. ట్రాఫిక్‌కు అంతరాయం.. దూరంగా వెళ్లండి..’ అని పోలీసుల హెచ్చరికలు

‘మమ్మల్ని తప్పక రావాలన్నారు. లేకపోతే.. చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు..’ వాలంటీర్ల వేడుకోలు ‘లేదు.. లోపల హాలు నిండిపోయింది.. అనుమతించబోము..’ కఠినంగా బెదిరింపులు. దీంతో చేసేది లేక సీఎం ఫ్లెక్సీల వద్ద ఫొటోలు దిగి వాటినే తమ అధికారులకు పంపారు. ఇలా వందలమంది సమావేశ హాలు బయటే నిలబడి పోయారు. ఆహ్వానించి అవమానించారే అని ఆవేదనకు గురయ్యారు.

ఏం జరిగిందంటే..

వాలంటీర్లకు వందనం పేరుతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో కార్యక్రమాన్ని తలపెట్టింది. ఎన్టీఆర్‌, కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని వాలంటీర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సభకు ఎలాగైనా రావాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభకు హాజరైనట్లు సెల్ఫీలు తీసి పంపాలన్నారు. దీంతో అందరూ శుక్రవారం ఉదయమే విజయవాడ చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే హాలు నిండిపోయింది. ఆ తర్వాత పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. దీంతో వందల సంఖ్యలో వాలంటీర్లు బయట నిలబడిపోయారు. అలా ఉన్నవారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసులతో వాదనకు దిగారు. కొంతమంది చంటిపిల్లలతో ఎండ తట్టుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. బయట తాగేందుకు మంచినీళ్లూ లేవు. అవార్డులు వచ్చినవారే 600 మంది వరకు ఉన్నారు. వారిలో కొందరే లోపలకు వెళ్లారు. ఈ కల్యాణమండపం సామర్థ్యం 1,500 వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో వచ్చిన వారంతా.. సీఎం ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలు తీసుకుని అధికారులకు వాట్సప్‌లో పంపించారు. చంటిబిడ్డతో వచ్చిన ఓ వాలంటీరు ఎండవేడి తట్టుకోలేక రోడ్డుపైనే కూలబడిపోయింది. కనీసం సమీపంలో ఉంచకుండా దూరంగా తరిమికొట్టడం అవమానంగా భావించి ఆ భారంతో ఇంటికి పయనమయ్యారు. సామర్థ్యం ఉన్నంతవరకు పాసులు ఇస్తే సరిపోయేదని, ఇలా దూరప్రాంతాల నుంచి తమను రమ్మని ఇబ్బందులకు గురిచేయడం ఏంటని వాలంటీర్లు ప్రశ్నించారు. గుడివాడ, మచిలీపట్నం, తిరువూరు, పెడన తదితర ప్రాంతాలనుంచి వచ్చినవారు బయటే ఉండిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని