Registrations: ఏపీలో ఇక ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ ఎక్కడికక్కడే!

‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కీలక మార్పు జరగనుంది. ఎనీవేర్‌ కింద వచ్చిన దస్తావేజులను సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఆ ఆస్తి ఉన్న ప్రాంతానికి చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదు.

Updated : 20 May 2023 08:54 IST

జూన్‌ 1 నుంచి అమల్లోకి కొత్త విధానం

ఈనాడు, అమరావతి: ఏపీలో ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కీలక మార్పు జరగనుంది. ఎనీవేర్‌ కింద వచ్చిన దస్తావేజులను సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఆ ఆస్తి ఉన్న ప్రాంతానికి చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి చెందిన ఆస్తిగా భావించి ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని నిర్థారించుకుని రిజిస్ట్రేషన్‌ చేయాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విధానంలో నెల్లూరు నగర పరిధిలోని ఆస్తి డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ను ఒంగోలు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చేయించుకునే పక్షంలో అందుకు సంబంధించిన దస్తావేజును ఆన్‌లైన్‌ మాడ్యుల్‌లో పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ జాబితాలో చేరుస్తున్నారు. అనంతరం సిబ్బంది నెల్లూరు నగరంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఆస్తి తాలూకు దస్తావేజులను ఆన్‌లైనులో పంపుతున్నారు. అక్కడి సబ్‌రిజిస్ట్రార్‌ ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్థారణకు వచ్చిన అనంతరమే... సదరు దస్తావేజుకు గ్రాంట్‌ అప్రూవల్‌ ఇస్తారు.

దీని ప్రకారం ఒంగోలులోని సదరు సబ్‌రిజిస్ట్రార్‌ ఆ దస్తావేజుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. తిరస్కరిస్తే.. పునఃపరిశీలన జరుగుతుంది. ఆస్తి ఉన్న ప్రాంత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నిర్ణయం సానుకూలంగా రాకుంటే... ఆ దస్తావేజు రిజిస్ట్రేషన్‌ చిక్కుల్లో పడినట్లే. ఈ విధానం అమల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల భారీఎత్తున అవినీతి కూడా జరుగుతోంది. ఒక సబ్‌రిజిస్ట్రార్‌ ఓకే అంటే.. మరో సబ్‌ రిజిస్ట్రార్‌ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో అమల్లోకి తేనున్న కొత్త విధానాన్ని పురస్కరించుకొని ఈ నెల 27లోగా సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కోర్టు అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు, నిషిద్ధ జాబితాలు సరిచూడాలి. మార్పులు ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని