ఇవేం ధరలు కృష్ణ!

ఓ ప్రైవేట్‌ సంస్థ అధిక ధరలకు ప్రాణాధార మందులను పంపిణీ చేస్తుండటంతో ప్రభుత్వాసుపత్రుల నిధులు కరిగిపోతున్నాయి.

Updated : 20 May 2023 05:36 IST

ఇలాగైతే ప్రాణాధార మందులు కొనలేం
3 నెలల బిల్లులు ఒక్క మాసంలోనే పూర్తి
ప్రభుత్వాసుపత్రుల పర్యవేక్షణ అధికారుల ఆందోళన
అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: ఓ ప్రైవేట్‌ సంస్థ అధిక ధరలకు ప్రాణాధార మందులను పంపిణీ చేస్తుండటంతో ప్రభుత్వాసుపత్రుల నిధులు కరిగిపోతున్నాయి.  మూడు, నాలుగు నెలల అవసరాలకు సరిపడా మందుల కొనుగోలుకు వెచ్చించే డబ్బు..ప్రస్తుతం నెల, నెలన్నర సమయంలోనే ఖర్చయిపోతోంది. విశాఖలోని కేజీహెచ్‌ గత అక్టోబరు నుంచి ఈ ఏడాది జనవరి  మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసిన శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్‌ ద్వారా రూ.36,42,568 వ్యయంతో మందులను కొనుగోలుచేసింది. స్థానిక కొనుగోళ్ల విధానంలో ఈ మందులను 2020లో రూ.15,24,469 కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కేంద్రీకృత విధానంలో శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్‌కు అదనంగా బిల్లు అయినట్లు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై పరిశీలన జరుగుతోంది. నిధులు సరిపోయే పరిస్థితులు లేనందున..మందుల కొనుగోలుకు అదనపు మొత్తం కేటాయించాలని ప్రభుత్వాసుపత్రుల వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎమ్మార్పీలోనే కిరికిరి

రాష్ట్రంలోని బోధనాసుత్రులు, ఇతర ఆసుపత్రుల వారీగా మందుల అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఈ నిధుల్లో 80% మొత్తానికి రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ తయారీదారుల నుంచి కొనుగోలు చేసిన మందులను ఆసుపత్రులకు పంపిణీ చేస్తోంది. మిగిలిన 20% నిధుల నుంచి అత్యవసర మందులు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీల ద్వారా స్థానికంగానే కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే..అత్యవసర మందుల కొనుగోలు వ్యవహారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండడంలేదన్న ఉద్దేశంతో ఒకే సంస్థ ద్వారా బోధనాసుపత్రులు, ఇతర ఆసుపత్రులకు మందుల పంపిణీ కోసం వైద్య ఆరోగ్య శాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదన మేరకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కిందటేడు టెండరు పిలిచింది. దీని ప్రకారం. ఎల్‌1గా వచ్చిన శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్‌ సంస్థకు అత్యవసర మందుల పంపిణీ బాధ్యతను అప్పగించింది. ఈ సంస్థ నిర్దేశించిన ఎం.ఆర్‌.పి.లో 35.6% రాయితీతో మందులు పంపిణీ చేయాలన్న నిబంధనతో టెండరు దక్కించుకుంది. సరఫరా చేయాల్సిన జాబితాలో జనరిక్‌తోపాటు బ్రాండెడ్‌ మందులూ ఉన్నాయి. ఈ సంస్థ ఆసుపత్రులకు మందుల పంపిణీ ప్రారంభించింది. అయితే..ఈ సంస్థ కోట్‌చేసిన ధరకు..హోల్‌సేల్‌/రిటైల్‌ మార్కెట్లో ఉన్న ధరల్లోని వ్యత్యాసం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. హోల్‌సేల్‌లో జనరిక్‌ మందులు ఉన్న ధరపై 70% నుంచి 85% వరకు తగ్గిస్తున్నాయి. బ్రాండెడ్‌ మందుల్లోనూ కంపెనీ స్థాయి నుంచి ధరల్లో విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నాయి. శ్రీకృష్ణ సంస్థ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందుల, తయారీ కంపెనీల ప్రాధాన్యం, ఎమ్మార్పీలో ఉన్న మతలబుల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంస్థ నుంచి త్వరగా మందుల సరఫరా కూడా జరగడంలేదని ప్రభుత్వాసుపత్రులు పేర్కొంటున్నాయి.


స్థానిక కొనుగోళ్లతో నిధుల ఆదా!

స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ మందుల ధరల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ రోగులకు అందించిన చికిత్స కింద ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సూపర్‌ స్పెషాల్టీ, స్పెషాల్టీ మందులను స్థానిక కొనుగోళ్లకు అవకాశాన్ని కల్పించాలని విశాఖలోని కేజీహెచ్‌ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రీకృత విధానంలో మందుల కొనుగోలు చేసే పక్షంలో నిధులు సరిపోవని ఆసుపత్రుల వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌కు శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్‌ సంస్థ సరఫరా చేసిన మందులు ధరలు... అంతకుముందు సరఫరా జరిగిన మందుల ధరల మధ్య ఉన్న వ్యత్యాస పట్టిక.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని