Kakinada: తీగపై పడిన వానరం.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

కాకినాడ జిల్లా సామర్లకోట-వేట్లపాలెం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం మధ్యాహ్నం విద్యుత్‌ లైనులో తలెత్తిన సాంకేతిక లోపంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Updated : 21 May 2023 07:07 IST

ఆలస్యంగా నడిచిన రత్నాచల్‌, ప్రశాంతి, మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లు

సామర్లకోట, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా సామర్లకోట-వేట్లపాలెం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం మధ్యాహ్నం విద్యుత్‌ లైనులో తలెత్తిన సాంకేతిక లోపంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సామర్లకోట రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. హుస్సేన్‌పురం-గూడపర్తి మధ్య వెంకటరామా ఆయిల్‌ పరిశ్రమ సమీపంలో ఓ వానరం రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగపై పడి మృతిచెందడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే అప్‌లైన్‌లో రైళ్లకు అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ కారణంగా సామర్లకోట రైల్వేస్టేషన్‌తో పాటు అవుటర్‌లో కొన్ని రైళ్లను నిలిపేశారు. ఇంజినీరింగ్‌ అధికారులు అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.06 గంటలకు సామర్లకోట రావాల్సిన విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 3.56కు వచ్చి, రెండు గంటలు నిలిచిపోయింది. బెంగళూరు-భువనేశ్వర్‌ (18463) ప్రశాంతి   ఎక్స్‌ప్రెస్‌ రైలు 3.33 గంటలకు రావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా 4.05 గంటలకు వచ్చింది. ఈ రైలును సాయంత్రం 5.54 గంటలకు పంపించారు. హావ్‌డా-ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12863) సూపర్‌ఫాస్ట్‌ రైలు మధ్యాహ్నం 2.34కు రావాల్సి ఉండగా అవుటర్‌లో నిలిపివేయడంతో సాయంత్రం 5.10కు వచ్చి, 6.02 గంటలకు వెళ్లింది. తర్వాత తిరుమల ఎక్స్‌ప్రెస్‌, చెన్నై మెయిల్‌ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైళ్లన్నీ రెండు గంటలకుపైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులతో పాటు స్టేషన్‌లో వేచిచూస్తున్న పలువురు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని