కదలిరండి.. కదలిరండి రైతన్నలారా!

అమరావతి ఉద్యమం 1,250వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరు శిబిరంలో శనివారం ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక ఉద్యమ గీతాన్ని ఆవిష్కరించారు.

Updated : 21 May 2023 05:43 IST

ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమ గీతం ఆవిష్కరణ

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతి ఉద్యమం 1,250వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరు శిబిరంలో శనివారం ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక ఉద్యమ గీతాన్ని ఆవిష్కరించారు. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత డీఎస్పీ బొప్పన విజయ్‌కుమార్‌ తన సతీమణి విజయకుమారి జ్ఞాపకార్థం ఈ గీతాన్ని సమర్పించారు. గాయకుడు రమణ బృందం ఆలపించింది. భారతీయత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, అమరావతి సమన్వయ కమిటీ సభ్యుడు పువ్వాడ సుధాకర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులు, మహిళలతో కలసి గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ అమరావతిపై ప్రభుత్వం కక్షకట్టి ఆర్‌-5 జోన్‌ పేరుతో విధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, రైతులకు మధ్య చిచ్చు పెట్టాలనే రాజధానిలో సెంటు భూమి పంపిణీకి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. అమరావతి బృహత్‌ ప్రణాళిక ప్రకారం ఆర్‌-3 జోన్‌లో రైతులతో పాటు, పేదల కోసం 5 శాతం నివాస భూములున్నప్పటికీ ప్రభుత్వం కావాలనే పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం కేటాయించిన భూముల్లో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసి పట్టాల పంపిణీకి సిద్ధమైందని మండిపడ్డారు. రాజధాని విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది.. రైతులు ఈ విషయాన్ని గ్రహించి వేలాదిగా తరలివచ్చి శాంతియుత నిరసనల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయవాది రవీంద్రబాబు మాట్లాడుతూ రైతులందరూ కలసికట్టుగా ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో అమరావతి వ్యతిరేక శక్తులను తుదముట్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఆర్డీఏ చట్టం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన విషయాలతో కూడిన కరపత్రాలను శిబిరంలో అన్నదాతలకు పంచారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు మహిళలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు