అమరావతిని చంపే ప్రయత్నాలు మానుకోవాలి

అమరావతిలో పేదలకు ఉపాధే లేకుండా పోయిందని, అలాంటప్పుడు రాజధానిలో ఇళ్లు కట్టుకోవడానికి వస్తారా అని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు.

Published : 21 May 2023 03:43 IST

ఉపాధి లేకుండా ఇళ్లు కట్టుకుంటారా?
ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే: అమరావతిలో పేదలకు ఉపాధే లేకుండా పోయిందని, అలాంటప్పుడు రాజధానిలో ఇళ్లు కట్టుకోవడానికి వస్తారా అని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. పారిశ్రామికాభివృద్ధి లేని నగరం ఎలా మనగలుగుతుంది, ప్రజలు ఉండడానికి ఇష్టపడతారా అని నిలదీశారు. శనివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజధానిలో ఇళ్లస్థలాలకు నిర్దేశించిన ఆర్‌-3 జోన్‌ ఉండగా.. పారిశ్రామికాభివృద్ధి కోసం కేటాయించిన ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామనడం అమరావతిని చంపే ఉద్దేశంతోనే కదా అని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ప్రభుత్వం భూమి కొనివ్వాలి గానీ.. అభివృద్ధికి ఇచ్చిన భూములను ఇతరులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. అమరావతి అనే పదమే ముఖ్యమంత్రి జగన్‌కు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందన్నారు. అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకుండా.. పారిశ్రామికాభివృద్ధి కోసం కేటాయించిన ఆర్‌-5 జోన్‌లో సెంటు స్థలం చొప్పున ఇవ్వాలన్న నిర్ణయంలో పరమార్థం ఏమిటో చెప్పాలని మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రాజధాని అభివృద్ధికి రూపాయి ఇవ్వకుండా, 35 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు అమరావతిలో లేకుండా.. వాళ్ల భూముల్లో స్థలాలు ఇవ్వడం చూస్తే ప్రజలను విభజించి పరిపాలించాలన్న కుట్ర కోణం కనిపిస్తోందన్నారు. ఉపాధి లేక రాష్ట్రం నుంచి యువత వలసపోతుంటే.. బడ్జెట్‌లో పెట్టింది రూ.411 కోట్లు మాత్రమే అని, ఇప్పుడు ఆర్‌5 జోన్‌ కూడా లేకుండా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అమరావతిలో మార్పులు రైతుల అంగీకారంతోనే జరగాలని, ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు కేటాయించడం సరికాదన్నారు. రైతులు తిరగబడి భూసేకరణ చట్టం, మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలంటే.. ఇచ్చే ఆర్థిక స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ నగరాలు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రం మెడలు వంచి అమరావతికి నిధులు తీసుకొస్తే.. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా మూడు రాజధానుల్లో ఒకదానిని నిలబెట్టినవారవుతారని పేర్కొన్నారు. సమావేశంలో ఫోరం సభ్యులు బొప్పన రాజశేఖరరావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని