కర్నూలులో ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుల వీరంగం

కర్నూలు నగరంలో ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో వీరంగం సృష్టించారు. గాయత్రి ఎస్టేట్‌ ప్రాంతంలోని విశ్వభారతి ఆసుపత్రి వద్ద విధి నిర్వహణలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు.

Updated : 22 May 2023 06:58 IST

ఆంధ్రజ్యోతి రిపోర్టరుపై దాడి..
ఈటీవీ ప్రతినిధినీ వెంబడించారు
విలేకరుల కెమెరాలు ధ్వంసం
విశ్వభారతి ఆసుపత్రి వద్ద ఏమి జరుగుతోందో అర్థం కాని పరిస్థితి
వీధిలోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టడి
తీవ్ర భయాందోళనలో స్థానికులు

ఈనాడు, కర్నూలు: కర్నూలు నగరంలో ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో వీరంగం సృష్టించారు. గాయత్రి ఎస్టేట్‌ ప్రాంతంలోని విశ్వభారతి ఆసుపత్రి వద్ద విధి నిర్వహణలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇక్కడ ఉంటే ఉపేక్షించేది లేదంటూ నానా దుర్భాషలాడారు. రాత్రి వేళ మీకు ఇక్కడేం పని అంటూ తొలుత ఆర్‌టీవీ ప్రతినిధులు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ వెంకటేశ్వర్లుపై దాడి చేశారు. దీంతో మిగిలిన మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. కొందరు మీడియా ప్రతినిధుల చేతుల్లోని కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. ఈటీవీ ప్రతినిధి రామకృష్ణారెడ్డి సమీపంలోని ఓ హోటల్లోకి వెళ్లగా.. ఆయన్ను వెంబడించారు. హోటల్‌ షట్టర్లు వేసి దాడి చేయబోయారు. ఆయన బ్యాగ్‌లో ఉన్న ‘ఈటీవీ’ లోగో చూసి వదిలేశారు.

ఆదివారం ఉదయం నుంచే దాదాపు 60, 70 మంది వరకు ఎంపీ అనుచరులు ఆ ప్రాంతానికి చేరుకొని సమీపంలోని లాడ్జిల్లో బస చేశారు. రాత్రి అయ్యేసరికి మద్యం తాగి రోడ్డు మీదకు చేరుకుని దండయాత్ర మొదలుపెట్టారు. అసలు ఆ వీధిలోకి ఇతరులెవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు. ఆసుపత్రికి సమీపంలో మీడియా ప్రతినిధులు ఎవరు ఉన్నారని ఆరా తీశారు. రోడ్డు మీద నిల్చున్నవారితో మాట్లాడి వారు మీడియా ప్రతినిధా.. కాదా? అని తెలుసుకున్నారు. వారి సెల్‌ఫోన్లు పరిశీలించి మీడియా ప్రతినిధులు కాదని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పంపించారు. అవినాష్‌రెడ్డి అనుచరుల ఆవేశం చూసి పోలీసులు సైతం వారి వద్దకు వెళ్లేందుకు జంకారు. ఈ పరిస్థితిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి రిపోర్టరుపై, మీడియా వాహనంపై ఎంపీ అవినాష్‌రెడ్డి వర్గీయులు దాడి చేసిన విషయం విదితమే.

స్పందించని పోలీసులు

విశ్వభారతి ఆసుపత్రి ఉన్న ప్రాంతం మొత్తాన్ని పదుల సంఖ్యలో ఉన్న అవినాష్‌రెడ్డి అనుచరులు తమ అదుపులోకి తీసుకుని బీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు మాత్రం స్పందించలేదు. సంఘటన జరిగింది నగరం నడిబొడ్డులోనే అయినా అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకోకపోవడం గమనార్హం. భారీ సంఖ్యలో అనుచరులు మోహరించడంతో ఆ వీధిలోకి వెళ్లాల్సిన వారు భీతిల్లారు. రాత్రి 12 గంటల వరకు అటు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి సుమారు 12:15 గంటలకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అక్కడికి చేరుకుని అవినాష్‌రెడ్డి అనుచరులు కొందరిని తీసుకొచ్చి మీడియా వారికి క్షమాపణ చెప్పించారు. క్షణికావేశంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, పొరపాటు జరిగిందని పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని