శకపురుషుడు ఎన్టీఆర్‌

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌.. శకపురుషుడని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.

Published : 22 May 2023 05:27 IST

ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
సావనీర్‌, వెబ్‌సైట్‌ కమిటీకి చంద్రబాబు సూచన

ఈనాడు, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌.. శకపురుషుడని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా శకపురుషుడు అనే పేరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ‘కాలమానాన్ని కొలిచే సమయంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఎలా చెబుతామో.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి తెలుగుజాతి కూడా ఎన్టీఆర్‌కు పూర్వం, ఎన్టీఆర్‌ తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది...’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ వెబ్‌సైట్‌ కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్‌, సభ్యులు కాట్రగడ్డ ప్రసాద్‌, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆదివారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించి శకపురుషుడు ప్రత్యేక సంచికతో పాటు, జైఎన్టీఆర్‌ వెబ్‌సైట్‌ల ఆవిష్కరణను ఘనంగా నిర్వహించి విజయవంతం చేశారని చంద్రబాబు వారిని అభినందించారు. కేక్‌ కట్‌ చేసి సభ్యులందరికీ స్వయంగా అందించారు. ఎన్టీఆర్‌పై వెలువరించిన పుస్తకాలను ఆంగ్లం, హిందీ భాషల్లోకి అనువదించి.. జాతీయస్థాయిలో ఆయన భావజాలాన్ని, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమిటీకి  సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన మహానాయకుడు నందమూరి అని  కొనియాడారు. కార్యక్రమంలో కంఠంనేని రవిశంకర్‌, అట్లూరి నారాయణరావు, విక్రమ్‌పూల, అశ్విన్‌ అట్లూరి మధుసూదన్‌రాజు, సతీశ్‌ మండవ, శ్రీపతి సతీశ్‌, కాసననేని రఘు, డి.రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు