చందనసీమలో నందమూరి సౌరభాలు

కన్నడ గడ్డపై నందమూరి తారకరామారావు జ్ఞాపకాలను ఘనంగా నెమరువేసుకున్నారు. రాముడు, కృష్ణుడంటే తెలుగు ప్రజలందరికీ ఆ తారకరాముడి నిండైన రూపమే గుర్తుకొస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కీర్తించారు.

Updated : 22 May 2023 06:10 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కన్నడ గడ్డపై నందమూరి తారకరామారావు జ్ఞాపకాలను ఘనంగా నెమరువేసుకున్నారు. రాముడు, కృష్ణుడంటే తెలుగు ప్రజలందరికీ ఆ తారకరాముడి నిండైన రూపమే గుర్తుకొస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కీర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తీసుకురావడంలో ఎన్టీఆర్‌ వారసత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని ప్రస్తుతించారు. బెంగళూరు వసంతనగరలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో బెంగళూరు తెదేపా ఫోరం ఆదివారం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపించినప్పుడు తాను ఆయనతో కలిసి చైతన్యరథంలో పర్యటించిన రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ అంటే ఒక వ్యక్తి కాదని.. మహాశక్తి అని కీర్తించారు.

కర్ణాటకలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌- తెలుగు గడ్డపై నందమూరి తారకరామారావు ఇద్దరూ నట దిగ్గజాలని రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్న విశ్లేషించారు. వారిద్దరి స్ఫూర్తితో తాను ‘శ్రీకృష్ణ దేవరాయలు’ చిత్రాన్ని మరోసారి తెరకెక్కించాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ఆయన పాలన అందించారని అనంతపురం మాజీ శాసనసభ్యుడు ప్రభాకర్‌ చౌదరి తెలిపారు. మరోసారి తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంభూపాల్‌ రెడ్డి, కంచెర్ల శ్రీకాంత్‌ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రదానం చేయాలని అతిథులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు ఆర్‌వీ హరీశ్‌, వ్యాపారవేత్త ప్రత్తిపాటి ఆంజనేయులు, తెదేపా నాయకుడు రావి మోహన్‌ చౌదరి, తెలుగు ప్రముఖులు రుక్మాంగద నాయుడు, రాజేంద్ర నాయుడు, బెంగళూరు తెదేపా ఫోరం ప్రతినిధులు సోంపల్లి శ్రీకాంత్‌, కనకమేడల వీర, వంశీ మాన్యం, శివ, వెంకటరత్నం, నారాయణ, కేశవ్‌, పవన్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు