ఆగిన అంబులెన్సు.. ఆగని ఆర్తనాదాలు

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను విశాఖపట్నం తరలిస్తున్న అంబులెన్సు మార్గమధ్యంలో ఆగిపోయింది.

Published : 22 May 2023 04:10 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా  గాయపడిన మహిళ
గంటపాటు మండుటెండలో విలవిల

మాకవరపాలెం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను విశాఖపట్నం తరలిస్తున్న అంబులెన్సు మార్గమధ్యంలో ఆగిపోయింది. దాంతో క్షతగాత్రురాలి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పర్రెడ పంచాయతీ గుడ్లపల్లికి చెందిన మాకాడ వెంకటలక్ష్మి (37) తన కుటుంబసభ్యులతో గూడెంకొత్తవీధి మండలం ధారకొండలోని ధారాలమ్మ ఆలయానికి వెళ్లారు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన ఆమె రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మికి కుడి కాలు విరిగింది. పాడేరు ఐటీడీఏకు చెందిన అంబులెన్సులో దారకొండ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రథమచికిత్స అనంతరం ఆమెను అదే అంబులెన్సులో విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకువెళ్తుండగా.. మాకవరపాలెం సమీపంలోకి రాగానే సాంకేతిక సమస్యతో అంబులెన్సు ఆగిపోయింది. మధ్యాహ్నం కావడం, ఎండవేడిమి, గాయాల నొప్పులతో వెంకటలక్ష్మి నర్సీపట్నం ఆస్పత్రి నుంచి మరో వాహనం వచ్చేవరకు గంటపాటు ఆర్తనాదాలు పెట్టారు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులే ఇలా ఆగిపోతే ఎలాగని బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని