ప్రజాప్రతినిధి అండ.. గుల్లయిన కొండ
తమ గ్రామం సమీపం నుంచి ఎక్స్‌ప్రెస్ రహదారి వెళ్తోందన్న ఆనందం చిత్తూరు జిల్లా నరిగపల్లి వాసులకు కొన్ని రోజులకే ఆవిరైంది.
చిత్తూరు శివారులో మట్టి అక్రమ రవాణా
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు (గ్రామీణ): తమ గ్రామం సమీపం నుంచి ఎక్స్‌ప్రెస్ రహదారి వెళ్తోందన్న ఆనందం చిత్తూరు జిల్లా నరిగపల్లి వాసులకు కొన్ని రోజులకే ఆవిరైంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మట్టి కోసం వారి గ్రామ సమీపంలోని కొండను కొల్లగొడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా పశుపోషణకు ఉపయోగపడిన కొండ కళ్లెదురుగా కరిగిపోతుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. తవ్వకాలు చేస్తున్న నిర్మాణ సంస్థకు ఓ కీలక ప్రజాప్రతినిధి అండగా ఉండటంతో వారి గోడును ఏ అధికారీ పట్టించుకోవడం లేదు.
గనుల శాఖ అనుమతులు లేకుండానే..
చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు రూ.3,197 కోట్ల వ్యయంతో ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదం తెలిపింది. తమిళనాడులోని కట్టుపల్లి పోర్టు అనుసంధానంతోపాటు సరకు రవాణాను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారి నిర్మాణానికి భారీగా మట్టి అవసరం కావడంతో టెండర్లు దక్కించుకున్న ఓ నిర్మాణ సంస్థ కన్ను చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని నరిగపల్లి రెవెన్యూలోని కొండపై పడింది. రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన కొండ హస్తగతమైతే మట్టికి కొరత ఉండదని భావించారు. అంతకు ముందే నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అక్కడ మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ యంత్రాంగం నిరంభ్యంతర పత్రం ఇచ్చింది. అనంతరం గనుల శాఖ మాత్రం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ నిర్మాణ సంస్థ ఆ కొండ నుంచి మట్టి తీసుకోవచ్చని ప్రజాప్రతినిధి పచ్చజెండా ఊపారు.
రోజూ వంద టిప్పర్లలో తరలిస్తున్నా..
కొండ నుంచి రోజుకు వంద టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. నెల రోజులకు పైగా తవ్వకాలు చేస్తుండగా.. ప్రారంభంలోనే గ్రామస్థులతోపాటు ఆ ప్రాంతానికే చెందిన ప్రజాప్రతినిధి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదు. పలుమార్లు అడ్డుకోవడంతో పోలీసులు తమదైన శైలిలో గ్రామస్థులను హెచ్చరించారు. కలెక్టరేట్‌కు సమీపంలో జరుగుతోన్న అక్రమ రవాణాను ఇప్పటికైనా అడ్డుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై చిత్తూరు తహసీల్దారు కిరణ్‌కుమార్ ‘ఈనాడు’తో మాట్లాడుతూ మట్టి తవ్వకాలకు తాము ఎన్వోసీ ఇచ్చామని.. ఆ తర్వాత గనుల శాఖకు వివరాలు వెళ్లాయన్నారు. అక్కడ అనుమతులు వచ్చాయా? లేవా? అన్నది తెలియదన్నారు.
పోలీసులతో బెదిరిస్తున్నారు
మా రెవెన్యూలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. పశువుల మేతకు ఉపయోగపడే భూమిలో ఇలా మట్టి తీసుకోకూడదని చెప్పినా వినడం లేదు. గట్టిగా ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
నరేష్, నరిగపల్లి
విచారించి చర్యలు తీసుకుంటాం
మట్టి తవ్వకాల విషయంలో రెవెన్యూ, గనుల శాఖ అధికారులను పరిశీలించమని ఆదేశాలిస్తాం. అక్రమాలు వాస్తవమని తేలితే, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసులు, జేసీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్