YS Avinash Reddy - CBI: అరెస్టు అడ్డుకునేందుకు అరాచకం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు సన్నద్ధమవడం.. దాన్ని అడ్డుకునేందుకు ఆయన అనుచరులు వందల మంది వైయస్‌ఆర్ జిల్లా నుంచి తరలివచ్చి ఎంపీ తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు బైఠాయించడం.. తివాచీలు పరుచుకుని మరీ కూర్చుని భోజనాలూ, అల్పాహారాలూ అక్కడే చేయడం.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వచ్చి వారికి మద్దతుగా నిలవడం.. తదితర పరిణామాలతో కర్నూలు నగరంలో సోమవారం రోజంతా హైడ్రామా నెలకొంది.
అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామన్న సీబీఐ
సహించబోమంటూ ఆయన అనుచరుల వీరంగం
తివాచీలు వేసుకుని ఆసుపత్రి ముందే బైఠాయింపు
వైకాపా ఎమ్మెల్యేలు, మద్దతుదారుల హల్‌చల్
వారి అడుగులకు మడుగులొత్తేలా పోలీసుల వ్యవహారశైలి
కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించని వైనం
ఎంపీ అనుచరుల హంగామాతో బిక్కుబిక్కుమంటూ గడిపిన రోగులు, ప్రజలు
కర్నూలులో రోజంతా ఉత్కంఠ
ఈనాడు - కర్నూలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు సన్నద్ధమవడం.. దాన్ని అడ్డుకునేందుకు ఆయన అనుచరులు వందల మంది వైయస్‌ఆర్ జిల్లా నుంచి తరలివచ్చి ఎంపీ తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు బైఠాయించడం.. తివాచీలు పరుచుకుని మరీ కూర్చుని భోజనాలూ, అల్పాహారాలూ అక్కడే చేయడం.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో వచ్చి వారికి మద్దతుగా నిలవడం.. తదితర పరిణామాలతో కర్నూలు నగరంలో సోమవారం రోజంతా హైడ్రామా నెలకొంది. అవినాష్‌ను కాపాడేందుకు తరలివచ్చిన అధికార పార్టీ శ్రేణుల ఆగడాలను పోలీసులు చోద్యం చూస్తుండటంతో.. చివరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కూడా నిస్తేజంగా తయారైంది. అరెస్టుకు సహకరించాలని వారు జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రి వర్గాలు సోమవారం ఉదయం 10 గంటలకు బులిటెన్ విడుదల చేస్తూ.. అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నాయి. అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కర్నూలుకు వచ్చి ఆమెను పరామర్శించారు. మరోవైపు వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేశారు. దీన్ని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించనుంది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశానని, అదీకాక తన తల్లి అనారోగ్యంగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు తనకు ఈ నెల 27 వరకు గడువు కావాలంటూ అవినాష్ సోమవారం ఉదయం సీబీఐ అధికారులకు మరో లేఖ రాశారు.
తెల్లవారుజాము నుంచి సీబీఐ నిరీక్షణ
కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు సోమవారం తెల్లవారుజామునే కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని రహస్యంగా పరిశీలించారు. విషయం తెలిసిన అవినాష్ అనుచరులు వారిని అడ్డుకోవడానికి అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. సీబీఐ వాహనాలు రాకుండా ఆసుపత్రి మార్గంలో వారి వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో స్థానిక పోలీసుల సహకారం లేనిదే అవినాష్‌ను అరెస్ట్ చేయడం సాధ్యం కాదని భావించిన సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కలిశారు. అవినాష్‌రెడ్డి స్వచ్ఛందంగా లొంగిపోతే ఎలాంటి సమస్యలు లేకుండా అరెస్ట్ చేసినట్లవుతుందని ఆ మేరకు సహకరించాలని కోరారు. అలా సలహాలిచ్చే అధికారం తనకు లేదని ఎస్పీ వారికి తేల్చిచెప్పారు. అరెస్ట్ సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన సంఖ్యలో బలగాల్ని మోహరించాలని సీబీఐ అధికారులు కోరారు. దీంతో పోలీసు అధికారుల్ని, పెద్దసంఖ్యలో సిబ్బందిని విశ్వభారతి ఆసుపత్రి దగ్గరకు పంపారు. తాము కర్నూలు చేరుకునేసరికే.. అవినాష్‌రెడ్డి అనుచరులు కూడా పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు రావడంతో సీబీఐ వర్గాలు విస్తుపోయాయి.
వ్యాపారులు, రోగుల అడ్డగింత
ఉదయం నాలుగున్నర గంటలకే గాయత్రి ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న విశ్వభారతి ఆసుపత్రి రోడ్డును పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆసుపత్రికి వచ్చే మార్గాల్లో స్టాపర్లు పెట్టి రాకపోకలను నిషేధించారు. దీంతో అదే వీధిలో ఉన్న ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు, హోటళ్ల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారు నిలదీస్తుండటంతో పోలీసులు ఆంక్షలను కొంత సడలించి, నడిచి వెళ్లడానికి అనుమతించారు. మీడియా ప్రతినిధుల రాకపోకలపై కూడా తొలుత నిషేధం విధించిన పోలీసులు తరువాత కెమెరాలు లేకుండా వెళ్లాలని, ఫొటోలు, వీడియోలు తీయరాదని ఆంక్షలు పెట్టారు. విశ్వభారతి వీధిలోని మిగిలిన ఆసుపత్రుల్లో చాలా మంది రోగులు ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. ఈ మార్గంలో అవినాష్ అనుచరులు వందల మంది బైఠాయించడంతో ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగుల బంధువులు, ప్రత్యేకించి మహిళలు అవస్థలు పడాల్సి వచ్చింది. సాధారణ ప్రజానీకాన్ని తెల్లవారుజాము నుంచి అడ్డుకున్న పోలీసులు.. అవినాష్‌రెడ్డి అనుచరులు, ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు, కార్యకర్తలను మాత్రం విశ్వభారతి ఆసుపత్రి ఉన్న వీధిలోకి యథేచ్ఛగా అనుమతించారు. దీంతో ఆ వీధితోపాటు ఆసుపత్రి పరిసర వీధులన్నీ అవినాష్ అనుచరులు, అభిమానులు, వైకాపా కార్యకర్తలతోనూ, వారి వాహనాలతోనూ నిండిపోయాయి. విచారణకు పిలిస్తే గతంలో అవినాష్‌రెడ్డి వెళ్లారని, ఇప్పడు ఆయన తల్లి శ్రీలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో మంచానపడి ఉంటే సీబీఐ అధికారులు ఆయన్ను ఎలా తీసుకెళ్తారని ఎంపీ అనుచరులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.
తమను కాదని అవినాష్‌ను ఎలా తీసుకెళ్తారో చూస్తామని సీబీఐ అధికారులకు సవాల్ విసిరారు. ఆసుపత్రి ముందే బైఠాయించారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు, కడప జిల్లాల ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, సుధాకర్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆర్థర్, కంగాటి శ్రీదేవి, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సుధ, మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి, కడప మేయర్ తదితరులు అవినాష్‌రెడ్డి అనుచరులతోపాటు ఆందోళనలో పాల్గొన్నారు. అవినాష్‌రెడ్డికి మద్దతుగా వచ్చిన వారందరికీ రోడ్డుపైనే టిఫిన్లు, భోజనాలు అందజేశారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉదయం నుంచి ఆసుపత్రి దగ్గరే ఉండి.. స్నానం కూడా సమీపంలోనే చేసి ఆసుపత్రి దగ్గర పరిస్థితిని పర్యవేక్షించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అవినాష్‌రెడ్డిని కలిశారు. అధికార పార్టీ నేతలు కావడంతో వారు ఎటు తిరుగుతున్నా, ఏం చేస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. దీంతో అవినాష్ అనుచరులు మరింత రెచ్చిపోయారు. మీడియాపైనా దాడులకు తెగబడ్డారు. ఈ పరిణామాలతో అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వీధుల్లో వందల సంఖ్యలో గుమిగూడిన వైకాపా కార్యకర్తల్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏమైనా గొడవలు జరుగుతాయేమోనన్న భయంతో కొందరు వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. అవినాష్ అనుచరులు రాత్రి ఆసుపత్రి ముందే పడుకునేందుకు వీలుగా అక్కడ తివాచీలు పరిచినట్లు సమాచారం.
అరెస్ట్‌కు సహకరించని పోలీసులు
అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారులకు కర్నూలు జిల్లా పోలీసులు ఏ మాత్రం సహకరించలేదు. ఆసుపత్రి ముందున్న అవినాష్ అనుచరులు, వైకాపా శ్రేణులను దూరంగా పంపేయాలని సీబీఐ అధికారులు కోరారు. దీంతో ఎస్పీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని పంపినప్పటికీ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో ఉన్న అవినాష్‌రెడ్డి అనుచరులను అక్కడి నుంచి పంపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం చేయాలో తోచని సీబీఐ అధికారులు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు సమీపంలోని ‘పోలీసు రెస్ట్ హౌస్’లోకి వెళ్లి.. పరిస్థితిపై సమీక్షించారు. స్థానిక పోలీసుల నుంచి ఆశించినంత సహకారం అందడం లేదని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.
కేంద్ర బలగాలు వస్తున్నాయంటూ ప్రచారం
అవినాష్‌రెడ్డి అనుచరుల్ని అక్కడి నుంచి పంపించడానికి అదనపు బలగాలు అవసరమని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. జిల్లాలోని అన్ని సబ్‌డివిజన్ల నుంచే కాకుండా నంద్యాల, కడప జిల్లాల నుంచి పోలీసుల్ని పిలిపించారు. జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమానికి కూడా హాజరుకాకుండా పూర్తిగా ఈ వ్యవహారాలపైనే దృష్టిసారించారు. సత్వర స్పందన బృందాలను (క్యూఆర్‌టీ) కూడా సిద్ధం చేశారు. స్థానిక పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి కేంద్ర బలగాల సాయం కోరినట్లు సమాచారం. కర్నూలు, కడప జిల్లాల నుంచి కర్నూలుకు చేరుకున్న అవినాష్ అనుచరులు తమ వాహనాలను ఇష్టానుసారంగా గాయత్రీ ఎస్టేట్ నుంచి వినాయక ఘాట్ వరకు రోడ్డుపైనే ఆపారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరమని ఆసుపత్రి బులెటిన్
కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వైద్యులు సోమవారం ఉదయం 10 గంటలకు బులెటిన్ విడుదల చేశారు. నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఉందని.. హార్ట్‌ఎటాక్ వచ్చే అవకాశముందన్నారు. ఆమెకు చేసిన యాంజియోగ్రామ్‌లో రెండు నాళాలు బ్లాక్ అయినట్లు గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమెకు రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని పేర్కొన్నారు. వాంతులవుతున్నాయని.. అలాగే కొనసాగితే అల్ట్రాసౌండ్, పొట్ట, మెదడుకు స్కానింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆమెకు బీపీ తక్కువగా ఉండటంతో మరికొన్ని రోజులు ఐసీయూ ఉండాల్సి ఉంటుందని బులెటిన్‌లో తెలిపారు.
అనుచరుల దౌర్జన్యకాండ
కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు కర్నూలుకు పెద్దఎత్తున తరలివచ్చారు. వారిలో కొందరు గాయత్రి ఎస్టేట్ ప్రాంతంలో దురుసుగా, దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఆదివారం రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనుచరులు.. తర్వాత కర్నూలు ఎమ్మెల్యే జోక్యంతో క్షమాపణ చెప్పారు. సోమవారం ఉదయానికి పరిస్థితి మామూలే అన్నట్లు తయారైంది. ఫొటోలు, వీడియోలు తీయనీయకుండా పలువురిని భయపెట్టడం గమనార్హం. వీడియోలు తీసిన మీడియా ప్రతినిధులు అవినాష్‌రెడ్డి అనుచరులకు దొరక్కుండా పారిపోవాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మేడపైకి ఎక్కి వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా కొందరు రాళ్లు రువ్వారు. ఆసుపత్రి రోడ్డులో పదుల సంఖ్యలో పోలీసులున్నా వారి ముందే రాళ్లు రువ్వడం గమనార్హం. అవినాష్‌రెడ్డి అనుచరులు గుంపులుగా విడిపోయి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని వీధుల్లో తిరుగుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్లలో పార్టీ పెద్దలకు చేరవేశారు. వైయస్‌ఆర్ జిల్లా నుంచి వందల సంఖ్యలో వచ్చిన అవినాష్‌రెడ్డి అనుచరులు ఆయన అరెస్టును అడ్డుకునేందుకు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుండటం పార్టీకి ప్రజల్లో చెడ్డపేరు తీసుకొస్తుందని కొందరు వైకాపా నాయకులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు.
కెమెరాలు తీసుకెళ్లడానికి భయపడే పరిస్థితులు
విశ్వభారతి ఆసుపత్రి వీధిలో ఆదివారం రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అవినాష్‌రెడ్డి అనుచరులు.. సోమవారం కూడా ఫొటోలు, వీడియోలు తీస్తే ఉపేక్షించేది లేదని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. వీడియోలు, ఫొటోలు తీస్తున్నవారిపై వైకాపా శ్రేణులు దాడులకు పాల్పడితే తాము బాధ్యులం కాదంటూ.. పోలీసులూ వారికే వత్తాసు పలికారు. దీంతో మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీయడానికి భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఓ టీవీ ఛానల్ ప్రతినిధులపై గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరించారు. తాము ఎంపిక చేసుకున్న కొద్దిమంది మీడియా ప్రతినిధులకు ఆసుపత్రి ముందు ఆందోళనలను చిత్రీకరించడానికి అనుమతించారు.
వైఎస్ విజయమ్మ పరామర్శ
అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించడానికి అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ సోమవారం సాయంత్రం విశ్వభారతి ఆసుపత్రికి వచ్చారు. ఆమె తిరిగి వెళ్లేటప్పుడు అవినాష్‌రెడ్డి కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. తల్లిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత ఆయన తొలిసారి ఆసుపత్రి బయటకు రావడం గమనార్హం. విజయమ్మకు వీడ్కోలు పలికే సమయంలో ఓ మీడియా ప్రతినిధి వీడియో చిత్రీకరించగా.. వైకాపా నాయకులు అతని ఫోన్ లాక్కుని, వీడియో క్లిప్పింగ్‌ను తొలగించారు.
నేడు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్ దరఖాస్తు
ఈనాడు, దిల్లీ: వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం తాను దాఖలు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వేసిన మిసిలేనియస్ అప్లికేషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అవినాష్‌రెడ్డి న్యాయవాదులు ఈ కేసును సోమవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు ఉంచారు. తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు సీబీఐ విచారణకు హాజరుకాలేనని, అందువల్ల తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించి నిర్ణయం వెలువరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, విచారణకు హాజరుకాలేని పరిస్థితి ఉన్నందున మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి ఆ దరఖాస్తులో విన్నవించారు. కోర్టు ఈ కేసును మంగళవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు లిస్ట్ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు