CBI - YSRCP - AP Police: సీబీఐయే.. బిక్కచచ్చిపోయేలా వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలి

వారంతా అతి సామాన్యులు, సాధారణ పౌరులు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆవేదనతో సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెడితే చాలు ఆగమేఘాలపై వారింట్లో పోలీసులు ప్రత్యక్షమైపోతారు.

Updated : 23 May 2023 11:21 IST

అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు అడ్డగోలుగా ముందుకు
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై మాత్రం చిన్నవిషయానికీ ఉక్కుపాదం


నాలుగేళ్లుగా సామాన్యులను వెంటాడుతూ వేధిస్తూ..

వారంతా అతి సామాన్యులు, సాధారణ పౌరులు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆవేదనతో సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెడితే చాలు ఆగమేఘాలపై వారింట్లో పోలీసులు ప్రత్యక్షమైపోతారు. బలవంతంగా వారిని ఎత్తుకెళ్లిపోతారు. ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నారనేది కనీస సమాచారమివ్వరు. అసలు వారు నిజంగా పోలీసులేనా? ఎవరైనా కిడ్నాప్‌ చేశారా అన్నంత అరాచకంగా వ్యవహరిస్తారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వ వైఫల్యాల్ని తూర్పారపడుతూ పోరాడే ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలపై కేసులు బనాయించి... అర్ధరాత్రీ, అపరాత్రీ అని చూడకుండా వారిపై దండయాత్రకు వెళ్తారు. ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసినట్లుగా వందల మంది పోలీసులను మోహరించి.. వారి గ్రామాల్ని, ఇంటిని దిగ్బంధిస్తారు. గోడలు దూకుతారు, ఇళ్లల్లోకి చొరబడతారు. తలుపులు విరగ్గొడతారు. పడకగదిలోకి సైతం చొచ్చుకెళ్లి మరీ అదుపులోకి తీసుకుంటారు. ఘోరమైన నేరానికి పాల్పడ్డ వారిలా క్షణాల్లో అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు.

- గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో తరచూ కనిపిస్తున్న దృశ్యాలివి. జగన్‌ కనుసన్నలతో ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ పోలీసులు, సీఐడీ, ఏసీబీ అధికారుల నిర్వాకమిది.

* బాధితులు: సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక వేత్తలు, ప్రజావేగులు.


ఇప్పుడు సీబీఐనే ముప్పుతిప్పలు పెడుతూ..

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డి అత్యంత కిరాతకంగా హత్యకు గురై నాలుగేళ్లు దాటిపోయింది. పలు సిట్‌లు ఏర్పాటు చేసినా నిజాలు నిగ్గు తేల్చలేకపోయాయి. మూడేళ్ల కిందట రంగంలోకి దిగిన సీబీఐ కేసులో ఒక్కో చిక్కుముడినీ విప్పుతూ.. తీగ లాగుతూ పలువుర్ని అరెస్టు చేసింది. డొంకంతా కదిల్చి కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి దగ్గరకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఆయన్ను అరెస్టు చేస్తామని న్యాయస్థానాలకు నివేదించింది. ఈ నేపథ్యంలో సీబీఐని.. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు కలిసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా అవినాష్‌ను అరెస్టు చేయటానికి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు వెళ్లేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించగా వారిని నిందితుడి దరిదాపుల్లోకి కూడా రానీయకుండా వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, వందల మంది మోహరించి దౌర్జన్యానికి తెగబడి, వీరంగం సృష్టించారు. తరిమికొట్టాల్సిన రాష్ట్ర పోలీసులే వారికి వత్తాసు పలుకుతున్నారు.

- గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కనిపిస్తున్న పరిణామాలకు ఈ తాజా ఘటనలు పరాకాష్ఠ.

*  బాధితులు: సీబీఐ, ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత


ఈనాడు - అమరావతి: వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయటానికి వచ్చిన సీబీఐనే ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తీసుకెళ్లాలంటే మీకు ఎన్ని గుండెలు ఉండాలి? ఎంత ధైర్యం కావాలి? అన్నట్లుగా తన చర్యల ద్వారా సీబీఐకే సవాల్‌ విసరుతోంది. అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే సీబీఐపై ఎంతటికైనా తెగిస్తామంటూ తన తాజా చర్యల ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సీబీఐ.. ఏపీలో మాత్రం రాష్ట్ర పోలీసులు, ఏపీ ప్రభుత్వ అరాచక చర్యలతో బిక్కచచ్చిపోయింది.

రఘురామకు వేధింపులు.. అవినాష్‌కు వత్తాసు

అవినాష్‌రెడ్డి, రఘురామకృష్ణరాజు.. ఇద్దరూ వైకాపా ఎంపీలే. అవినాష్‌ ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు. రఘురామకృష్ణరాజు వైకాపా ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపుతూ, వైఫల్యాల్ని ప్రస్తావిస్తూ సునిశిత విమర్శలు చేస్తుంటారు. అందుకే ఆయనపై ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి మరీ అరెస్టు చేశారు. రాత్రంతా నిర్బంధంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ప్రభుత్వం ఆయనపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేసింది. తనపై ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించింది. ఆయన్ను రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే తన సొంత పార్టీ ఎంపీని అంతలా హింసించిన జగన్‌ ప్రభుత్వం.. హత్య కేసులో నిందితుడిగా తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డికి అన్ని రకాలుగా కొమ్ముకాస్తుండటం కావాల్సిన వారు ఎన్ని తప్పులు చేసినా వారిని కాపాడటానికి ఎంతకు తెగించడానికైనా వెనుకాడని ప్రభుత్వ తీరుకు నిదర్శనం.

రక్తస్రావమవుతున్నా వదల్లేదే?

* తెదేపా నాయకుడు, మాజీ మంత్రి పి.నారాయణ తన కుమారుడు నిషిత్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భార్యతో కలిసి కారులో వెళ్తుండగా మఫ్టీలో ఉన్న చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌ వద్ద అడ్డగించారు. నారాయణ సతీమణిని కిందకు దించేసి, అదే కారులో ఆయన్ను తీసుకెళ్లిపోయారు. కుమారుడి వర్ధంతి కార్యక్రమం ముగించుకుని వస్తానని చెప్పినా వినకుండా ఆయన్ను కక్ష కట్టినట్లు లాక్కెళ్లారు.

* తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు మొలల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఇటీవలే శస్త్రచికిత్స జరిగిందని, మందులు వేసుకుని వస్తానని చెప్పినా సమయమివ్వలేదు. శ్రీకాకుళం నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని విజయవాడకు రోడ్డు మార్గంలో ఆయన్ను తీసుకొచ్చారు. దారి పొడవునా రక్తస్రావమవుతున్నా కనికరించలేదు.

* తెదేపా నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటిని దాదాపు 300 మంది పోలీసులు చుట్టిముట్టి ఆయన్ను అరెస్టు చేశారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డిలోకి వెళ్లిన ఆయన్ను తలుపులు కొట్టి మరీ బయటకు రప్పించారు.

* తెదేపా నాయకుడు కూన రవికుమార్‌ను ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.

* అధికార పార్టీ నాయకుల్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారంటూ తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడైన 70 ఏళ్ల వృద్ధుడు నలంద కిశోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేదని, ఉదయం వస్తానని చెప్పినా వినకుండా విశాఖపట్నం నుంచి కర్నూలు వరకూ రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన మరణించారు.

* తెదేపా నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను కనీసం చొక్కా వేసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా అరెస్టు చేశారు.

* తెదేపా నాయకుడు చింతకాయల విజయ్‌కు నోటీసులివ్వటానికి హైదరాబాద్‌ వెళ్లిన సీఐడీ పోలీసులు.. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవటంతో చిన్న పిల్లయిన విజయ్‌ కుమార్తెను బెదిరించారు.

ఇలా ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు పేరిట వేధిస్తారు కానీ.. హత్య కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నా అరెస్టు చేయకూడదా? ఇలా వ్యవహరించే జగన్‌ ప్రభుత్వానిది చట్టబద్ధ పాలన ఎలా అవుతుంది?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని