దళితులపైనే దాడులు చేయిస్తున్నారు

బాపట్ల జిల్లా పర్చూరు వైకాపా సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీ కోసం కష్టపడిన దళిత నాయకుల్ని అణగదొక్కుతున్నారని ఆ పార్టీకే చెందిన మార్టూరు మండలం ద్రోణాదుల ఎస్సీ సర్పంచి వంకాయలపాటి భాగ్యారావు విమర్శించారు.

Updated : 23 May 2023 06:16 IST

పర్చూరు వైకాపా సమన్వయకర్త ఆమంచిపై సర్పంచి ఫిర్యాదు
సీఎం జగన్‌కు వీడియో సందేశం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - మార్టూరు: బాపట్ల జిల్లా పర్చూరు వైకాపా సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీ కోసం కష్టపడిన దళిత నాయకుల్ని అణగదొక్కుతున్నారని ఆ పార్టీకే చెందిన మార్టూరు మండలం ద్రోణాదుల ఎస్సీ సర్పంచి వంకాయలపాటి భాగ్యారావు విమర్శించారు. ఆయన నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఆవేదనను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వీడియో రూపంలో విన్నవించారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘జగనన్నా.. మీ మీద, పార్టీపై నమ్మకంతో ద్రోణాదుల సర్పంచ్‌గా రూ.లక్షలు ఖర్చు చేసి గెలుపొందా. గత జనవరి 13న పర్చూరు వైకాపా సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారని సంతోషించాం. కానీ అతని పోకడ సరిగా లేదు. దళితుల మీద దాడులు చేయించటం, దళిత సర్పంచులను టార్గెట్‌ చేయటం, పది మందిలో చులకనగా మాట్లాడటం చేస్తున్నారు. నా పంచాయతీలో(ద్రోణాదుల) గోల్‌మాల్‌ జరిగిందని, అవినీతికి పాల్పడ్డానని దళితుడ్ని కావటంతో నాపై అభియోగం మోపి నా పరువుకు నష్టం కలిగించారు. నేను పంచాయతీలో కూర్చోవటానికి అవకాశం లేకుండా చేశారు. ఆమంచి సామాజికవర్గానికే చెందిన ఎంపీడీవో కృష్ణకుమారి, ఈవోఆర్డీలతో విచారణ చేయించారు. అవినీతి జరగలేదని తేల్చారు.

ఇదన్నా... ఆమంచి అవినీతి

నియోజకవర్గంలో గ్రానైట్‌, ఎర్రమట్టి ప్రధాన ఆదాయ వనరులు. బల్లికురవ, మార్టూరు మండలాల నుంచి బండలు తోలుకోవటానికి ఒక్కో లారీకి 8 వేలు, అదే శ్లాబ్స్‌ అయితే ఒక్కో లారీకి 3 వేలు ముట్టజెప్పాలి. ఇది ఆమంచి అవినీతి. వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఒక్కో షాపునకు రోజుకు రూ.40 వారానికి 180 చొప్పున ముడుపులు చెల్లించాలి. అదే విధంగా నియోజకవర్గంలో బొబ్బేపల్లి, వలపర్ల గ్రామాలు ఎర్రమట్టికి ప్రసిద్ధి. వాటిని ఆయన అధీనంలోకి తీసుకుని లీజుదారులను ఇబ్బందిపెట్టి రద్దు చేయించి వారిపై కేసులు పెట్టించి బాపట్ల, చీరాలకు గ్రావెల్‌ తరలిస్తున్నారు. నియోజకవర్గంలో మేజర్‌ పంచాయతీల సెక్రటరీలు, ఎంపీడీవోలను తన చేతిలో పెట్టుకుని 15వ ఆర్థిక సంఘం నిధుల్ని నేను చెప్పకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టరాదని హుకుం జారీ చేశారు. మేం ఎలా బతకాలి? మా ఊళ్లో పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా అది నేనే చేయాలి. ఆ ఖర్చు ఎవరిస్తారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్రోణాదులలో ఇద్దరు వాలంటీర్లు తప్పు చేశారు. అది మా దృష్టికి వచ్చింది. బాధ్యులైనవారిని అడిగితే నన్ను కొట్టడానికి ఆ సామాజికవర్గం వారిని పెద్దసంఖ్యలో పోగు చేశారు. నన్ను గదిలో పెట్టి గడియ వేశారు. నన్ను కొట్టేందుకు ఓ సామాజికవర్గం వారు వచ్చారని చెబితే బయట మన వాళ్లు ఎంతమంది ఉంటే అందరూ వారిని కొట్టండి నేను చూసుకుంటానన్నారు. కానీ కేసు పెట్టించారే తప్ప వారిపై చర్యలు తీసుకోలేదు. దళితుల్ని, పార్టీ వ్యక్తుల్ని ఇబ్బందిపెడుతున్న ఆమంచిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పార్టీని కాపాడండి. జై జగన్‌, జోహార్‌ వైఎస్సార్‌’ అంటూ ముగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు