అవినాష్‌రెడ్డికి సుప్రీంలో దక్కని ఉపశమనం
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా అవినాష్‌రెడ్డికి మధ్యంతర ఉపశమనం కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌పై ఈనెల 25న విచారించి అవసరమైన ఉత్తర్వులివ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై 25న వినాలని తెలంగాణ హైకోర్టుకు సూచన
అక్కడ తేలేవరకు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమన్న సర్వోన్నత న్యాయస్థానం
ఈనాడు - దిల్లీ
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా అవినాష్‌రెడ్డికి మధ్యంతర ఉపశమనం కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌పై ఈనెల 25న విచారించి అవసరమైన ఉత్తర్వులివ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన సుప్రీం వెకేషన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ‘ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గతనెల 27, 28వ తేదీల్లో విచారించి ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. అందువల్ల ఆ కేసును ఈనెల 25న కూర్చునే వెకేషన్ ధర్మాసనం ముందుంచుతున్నాం. అవసరమైన ఉత్తర్వులివ్వాలని ఆదేశిస్తున్నాం. అక్కడ తేలేంతవరకు ఈ కేసులో అవినాష్‌ను అరెస్టు చేయకుండా ఉత్తర్వులివ్వాలన్న వినతిని మేము పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఇదివరకు ఈ కేసును మరో ధర్మాసనం విచారించినప్పటికీ, ఇప్పుడు వెకేషన్ బెంచ్ వినడానికి అడ్డంకి ఉండబోదని స్పష్టతనిచ్చారు. వివేకా హత్య కేసులో విచారణకు రమ్మంటూ సీబీఐ వరుసగా నోటీసులిస్తున్నందున అవినాష్ దాఖలు చేసిన అప్లికేషన్‌పై మంగళవారం ఆయన తరఫున సీనియర్ న్యాయవాది గిరి సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
గతనెల 24న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చాక తమ క్లయింట్‌కు ఎలాంటి రక్షణ లేకపోవడంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశామని చెప్పారు. జస్టిస్ నరసింహ జోక్యం చేసుకుంటూ.. ‘గత నెల మేం ఉత్తర్వులిచ్చాక హైకోర్టులో కేసు విన్నారా?’ అని ప్రశ్నించారు. వరుసగా రెండు రోజులు విన్నారని, విచారణను న్యాయస్థానం జూన్ 5కు వాయిదా వేసిందని, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌నూ ఆమోదించలేదని న్యాయమూర్తి ప్రశ్నలకు న్యాయవాది గిరి సమాధానమిచ్చారు. జస్టిస్ నరసింహ స్పందిస్తూ.. 16న హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చినట్లు, తర్వాత అది వాయిదా పడినట్లు మీరు సమర్పించిన అదనపు డాక్యుమెంట్లలో ఉంది కదా? అని న్యాయవాదిని ప్రశ్నించారు. ‘ఇక్కడ రెండు కోణాలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని భావిస్తున్నాం. హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసి కేసును వెనక్కి పంపుతూ గతనెల 24న ఉత్తర్వులిచ్చాక కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులివ్వకపోవడం ఒకటి. సీబీఐ నోటీసులిచ్చినా మీరు హాజరుకాకపోవడం రెండోది’ అని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు. తమ క్లయింట్ ఇప్పటివరకూ ఏడుసార్లు సీబీఐ ముందు హాజరయ్యారని న్యాయవాది గిరి బదులిచ్చారు. ‘గతనెల 24న మేము ఉత్తర్వులిచ్చాక హాజరయ్యారా? మీరు సమర్పించిన అదనపు డాక్యుమెంట్ల ప్రకారం ప్రస్తుతం హాజరుకాలేను.. గడువు కావాలన్నట్లుంది కదా?’ అని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. న్యాయవాది గిరి బదులిస్తూ నోటీసు ఇచ్చాక కనీసం 3 రోజులైనా గడువు కావాలని సీబీఐకి లేఖ పంపామన్నారు. ఆ మేరకు 16న మరో నోటీసు పంపి 19న హాజరుకావాలని సీబీఐ సూచించిందని వివరించారు.
మధ్యంతర ఉపశమనం హైకోర్టు ఇవ్వలేదు..
అవినాష్ తరఫు వాదనల్లోని అంశాలపై తాను స్పష్టత ఇస్తానని సునీత తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బదులిచ్చారు. వాళ్లు అప్పట్లో మధ్యంతర ఉపశమనం కోరినా హైకోర్టు ఇవ్వలేదని వివరించారు. జస్టిస్ నరసింహ స్పందిస్తూ.. ‘రెండు రోజులు వాదనలు విన్నాక కూడా హైకోర్టు ఉత్తర్వులివ్వలేదని అంటున్నారు. ఈ మధ్యలో అరెస్టు ముప్పు ఏమైనా ఉందా?’ అని అడగ్గా.. కచ్చితంగా ఉందని అవినాష్‌రెడ్డి న్యాయవాది గిరి బదులిచ్చారు. ఇప్పటికే ఆయన తండ్రిని అరెస్టు చేశారని ఆవేశంగా చెప్పారు. అప్పుడు జస్టిస్ నరసింహ జోక్యం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని న్యాయవాదికి సూచించారు. తర్వాత జస్టిస్ జేకే మహేశ్వరి జోక్యం చేసుకుంటూ మీ సహజత్వానికి భిన్నంగా ఎందుకు సహనం కోల్పోతున్నారని న్యాయవాది గిరిని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ తన క్లయింట్‌ను వేటాడుతున్నారని పేర్కొన్నారు. అందుకు జస్టిస్ మహేశ్వరి స్పందిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. మేం మీ వాదనలు, అవతలివైపు వాదనలూ వింటాం. చివరకు ఏం చేయాలో అది చేస్తాం’ అని పేర్కొన్నారు.
కేసును లోగడ విచారించిన ధర్మాసనంలో జస్టిస్ నరసింహ ఉన్నందున ఈ విషయంలో నిర్ణయం వెలువరించే స్వేచ్ఛను ఆయనకు వదిలిపెడుతున్నట్లు పేర్కొన్నారు. తర్వాత జస్టిస్ నరసింహ జోక్యం చేసుకుంటూ మీరు హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లొచ్చు కదా? ఇక్కడ మేం ఎందుకు దీన్ని విచారించాలని న్యాయవాది గిరిని ప్రశ్నించారు. తదుపరి వెకేషన్ బెంచ్ ఈనెల 30న ఉందని న్యాయవాది గిరి చెప్పారు. అప్పుడు జస్టిస్ మహేశ్వరి జోక్యం చేసుకుంటూ ఈనెల 25న ఉన్నట్లు మీ అప్లికేషన్‌లో చెప్పారని గుర్తుచేశారు. జస్టిస్ నరసింహ కూడా దీన్నే ప్రస్తావిస్తూ ఆ బెంచ్ ముందుకెళ్లండని సూచించారు.
ఉద్రిక్తతలను కోర్టుకు తీసుకురావద్దు
జూన్ 30లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా సీబీఐ తదనుగుణంగా ముందుకు సాగడం లేదని న్యాయవాది లూథ్రా పేర్కొన్నారు. ‘సీబీఐ న్యాయవాది వచ్చి ఈ అంశాలను చెబితే అర్థం చేసుకునేవాళ్లం. ఇప్పటికే విచారించిన తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. దాన్ని విచారించాలని మాత్రమే మేం చెబుతున్నాం’ అని లూథ్రాను ఉద్దేశించి జస్టిస్ జేకే మహేశ్వరి వ్యాఖ్యానించారు. లూథ్రా బదులిస్తూ ఈనెల 25న విచారించాలని చెప్పండని కోరారు. ఆ మేరకు జస్టిస్ నరసింహ ఉత్తర్వులిచ్చారు. లూథ్రా వాదనలపట్ల అనినాష్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపగా.. ధర్మాసనం కాస్త ఆగ్రహించింది. మీకు వాదించే హక్కు ఎలా ఉంటుందో, వాళ్లకూ అలాంటి హక్కే ఉంటుందని జస్టిస్ జేకే మహేశ్వరి పేర్కొన్నారు. దీనిపై పోట్లాడొద్దని సూచించారు. మీ క్లయింట్ల మధ్యనున్న ఉద్రిక్తతను కోర్టుకు తీసుకురావద్దని, అవి మీ మనసులోనే ఉంచుకోవాలని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. చివరకు అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది క్షమాపణ కోరగా న్యాయమూర్తులు అలాంటిదేమీ అవసరం లేదని, ప్రతిరోజూ ఇలాంటివి జరుగుతుంటాయని, తరచూ చూస్తుంటామని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో