రాజధానిలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌ వద్ద కాపలా పోలీసుకు పాముకాటు

విధులు ముగించుకొని విశ్రాంతి సమయంలో నిద్రిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ను ఓ కట్లపాము కాటు వేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి అనంతవరంలో చోటు చేసుకుంది.

Published : 24 May 2023 04:39 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: విధులు ముగించుకొని విశ్రాంతి సమయంలో నిద్రిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ను ఓ కట్లపాము కాటు వేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి అనంతవరంలో చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పంపిణీపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో లేఅవుట్‌ పనులు జరుగుతున్న గ్రామాల్లో వివిధ జిల్లాకు చెందిన సుమారు 1600 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వారు గ్రామాల్లోనే రాత్రి పూట తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు భోజనాలు ముగించుకొని కొండ కింద స్వామివారి మెట్ల ముందు ఉన్న గచ్చుపై నిద్రపోతున్నారు. సోమవారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో అక్కడ నిద్రిస్తున్న ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పవన్‌కుమార్‌ (పీసీ.నెం:2394, 2011 బ్యాచ్‌, దర్శి సబ్‌ డివిజన్‌) కుడి భుజంపై పాము కాటు వేసింది. ఆయన పామును చేత్తో పట్టుకొని లాగడంతో మళ్లీ ఎడమ చేతి ఉంగరం వేలుపైౖ కాటు వేసింది. ఇది గమనించిన తోటి సహచరులు ఆ పామును చంపేశారు. పోలీసులు పవన్‌కుమార్‌ను గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని