తేమ పేరుతో సతాయింపు!

తేమ ఎక్కువుంది.. దుమ్ము కనిపిస్తోంది.. ముక్కు నల్లగా ఉందంటూ కొర్రీలు చూపుతూ మొక్కజొన్న రైతులను ప్రభుత్వం సతాయిస్తోంది.

Published : 24 May 2023 04:47 IST

ముక్కిన గింజ ఉందంటూ కొర్రీ
మార్క్‌ఫెడ్‌ వైఖరితో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన
హమాలీ ఖర్చులను భరించాల్సిందీ రైతులే

ఈనాడు, అమరావతి: తేమ ఎక్కువుంది.. దుమ్ము కనిపిస్తోంది.. ముక్కు నల్లగా ఉందంటూ కొర్రీలు చూపుతూ మొక్కజొన్న రైతులను ప్రభుత్వం సతాయిస్తోంది. ఆపై బస్తాల్లో నింపడం నుంచి లారీలోకి ఎత్తాక పట్టలు కట్టడానికి అయ్యే కూలీ మొత్తాన్నీ రైతులే భరించాల్సి వస్తోంది. దీంతో విసిగిపోతున్న రైతులు.. క్వింటాకు రూ.200 తక్కువైనా ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకోవడం మేలని భావిస్తున్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటా రూ.1,962 ఉంటే.. అధిక శాతం రైతులు ప్రైవేటు వ్యాపారులకు క్వింటా రూ.1,600 నుంచి రూ.1700కు విక్రయిస్తున్నారు. వారైతే వెంటనే సొమ్ము చెల్లించి పంట తీసుకెళ్తున్నారని, అదే మార్క్‌ఫెడ్‌ నుంచి డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియకపోగా హమాలీ ఖర్చులన్నీ భరించాల్సి వస్తుందని వివరిస్తున్నారు. హమాలీ ఖర్చులకే క్వింటా రూ.వంద వరకు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్నను కొంటామన్న హామీ ఇంకా అమలవడం లేదు. మొత్తంగా మొక్కజొన్న రైతులకు మద్దతు ధరనిచ్చి ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వంలో ఏ కోశానా కన్పించడం లేదు. ఉత్పత్తిలో సేకరణ లక్ష్యం కేవలం 3.72శాతం ఉండటం దీనికి నిదర్శనం.

సేకరణలో జాప్యం.. అకాలవర్షాలతో నష్టం

మద్దతు ధరకంటే మొక్కజొన్న ధర పడిపోయింది. క్వింటా రూ.2,300 నుంచి క్రమంగా తగ్గి రూ.1,600కు చేరింది. అయినా వెంటనే సేకరించలేదు. రబీకి సంబంధించి మార్చి, ఏప్రిల్‌నుంచి మొక్కజొన్న ఉత్పత్తి రైతు చేతికొస్తే.. ప్రభుత్వం మే నెలలో సేకరణ ఉత్తర్వులిచ్చింది. ఈలోగా అకాల వర్షాలు విరుచుకుపడటంతో రైతులు భారీగా నష్టపోయారు. రోజుల తరబడి నీటిలో నానడంతో పంట దెబ్బతింది. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయారు. బాగున్న మొక్కజొన్నను కొనడానికే ప్రస్తుతం సతాయిస్తున్నారనే ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతోంది. గోతాలు సరిగా ఇవ్వడం లేదు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రైతులకు సమాధానం చెప్పేవారే లేరు. ఒకటికి పదిసార్లు తిరిగితే, వచ్చి పంటను పరిశీలించి తేమ ఎక్కువగా ఉందంటూ రకరకాల కొర్రీలు పెట్టడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రైవేటు వ్యాపారులే మేలు

మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న సహా కంది, సెనగ తదితర ఏ పంటలు సేకరించినా రైతులకు ఖర్చులే తడిసి మోపెడవుతున్నాయి. మద్దతు ధరకు కొంటున్నామంటూనే, పరోక్షంగా క్వింటాకు రూ.100 నుంచి రూ.200 వరకు రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారు. సాధారణంగా ఏదైనా పంటను వ్యాపారులు కొంటే బస్తాలను వెంట తెచ్చుకుంటారు. కూలీలను ఏర్పాటుచేసి బస్తాల్లో నింపిస్తారు. తూకం పెట్టించి లారీల్లో లోడ్‌ చేయించుకుంటారు. ప్రభుత్వం మాత్రం మొక్కజొన్న గోతాలు, పురికొసనే ఇస్తామంటోంది. బస్తాల్లో నింపించి, తూకం పెట్టించి లారీల్లోకి ఎక్కించేవరకు రైతులే భరించాలని సతాయిస్తోంది. లారీలో నింపాక సరకు తడవకుండా పట్టలు వేసి తాడు కట్టేందుకయ్యే ఖర్చునూ రైతులపైనే నెట్టేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు