సివిల్స్‌లో ప్రకాశించిన తెలుగు తేజాలు

వారి లక్ష్యం సుస్పష్టం.. అదే సివిల్స్‌. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యమైనా అందరిదీ ఒకే సూత్రం.. పట్టుదలతో శ్రమించడం. యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తెలుగు తేజాలు మరోసారి మెరిశాయి.

Published : 24 May 2023 04:47 IST

ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం

వారి లక్ష్యం సుస్పష్టం.. అదే సివిల్స్‌. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యమైనా అందరిదీ ఒకే సూత్రం.. పట్టుదలతో శ్రమించడం. యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తెలుగు తేజాలు మరోసారి మెరిశాయి. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రణాళికబద్ధంగా చదవడం, ప్రాక్టీస్‌ టెస్టులు రాస్తూ.. పట్టు సాధించడం.. ఇలా సాగింది వారి విజయ ప్రస్థానం. విజేతల్లో కొందరిని పలకరించగా.. ఇలా స్పందించారు.


ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని..

సరైన లక్ష్యం, కృషితోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు.. సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమాహారతి. వరుస ఓటములనే తన విజయానికి మెట్లుగా మలచుకుని లక్ష్యాన్ని ఛేదించారు. నాన్న మాట మేరకు ఐఏఎస్‌ కావాలన్న పట్టుదలతో ముందుకుసాగిన ఆమె అయిదో ప్రయత్నంలో విజయం సాధించారు. ఉమాహారతి.. నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, శ్రీదేవి దంపతుల కుమార్తె. తండ్రి పోలీసు అధికారి కావడంతో ఆయన బదిలీలకు అనుగుణంగా ఉమాహారతి ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. కుమార్తెను ఐఏఎస్‌ చేయాలన్నది వెంకటేశ్వర్లు కల. అందుకు అనుగుణంగానే చిన్నప్పటి నుంచీ ప్రోత్సహించారు. బీటెక్‌ అనంతరం ఆమెను సివిల్స్‌ వైపు నడిపించారు. నాలుగుసార్లు పరీక్ష రాసి విఫలమైనా ఆమెను తల్లితండ్రులు ఏ దశలోనూ నిరుత్సాహపరచలేదు. ‘నువ్వు గెలవగలవంటూ’ వెన్నుతట్టారు. వైఫల్యాలు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో విక్రమార్కునిలా లోపాలు సవరించుకుంటూ చదివింది ఉమాహారతి. ఆమె కృషి వృధా కాలేదు. ఏదో ఒక ర్యాంకు వస్తుందని భావిస్తున్న ఆమెకు.. ఊహించని విజయం దక్కింది. జాతీయస్థాయిలో ఏకంగా మూడో ర్యాంకు రావడంతో ఆమె కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఆమె తండ్రిగా గర్విస్తున్నా. ఇది ఆషామాషీగా వచ్చిన ర్యాంకు కాదు. ఎంత బాగా చదివితే అంత ప్రతిఫలం వస్తుందని మా అమ్మాయి నిరూపించింది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

మహిళల విద్యపై దృష్టి సారిస్తా: ఉమాహారతి

‘నేను సివిల్స్‌ పరీక్షల తీరును సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల నాలుగుసార్లు విఫలమయ్యాను. కొత్తవాళ్లు అలాంటి పొరపాట్లు చేయవద్దు. దీనికి కావాల్సినవి సిలబస్‌ ఏమిటో సరిగా తెలుసుకోవడం, పాత ప్రశ్నపత్రాల అధ్యయనం, పరీక్షను అలవోకగా రాసేంతగా సాధన చేయడం. ఎంత చదవాలో తెలియక, తెలిసిన విషయమే అయినా.. రాసే విధానం సరిగా లేక నేను ఫెయిలయ్యాను. ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఉన్న జాగ్రఫీలో మార్కులు సరిగా సాధించలేకపోవడం మరో కారణం. అందుకే రిస్క్‌ అని అందరూ హెచ్చరిస్తున్నా, మధ్యలో ఆంత్రోపాలజీకి మారాను. పరీక్షకు అవసరమైనంతగా చదివాను. వారంలో కనీసం రెండు ప్రాక్టీస్‌ టెస్టులు రాసి.. అప్పటికే విజయం సాధించిన మిత్రులకు పంపేదాన్ని. వారి సూచనలతో లోపాలను సవరించుకుంటూ సాధనను మెరుగుపరచుకున్నాను. ఇంటర్వ్యూ కూడా ఒకసారి విఫలమైనందున లోపాలు సరిదిద్దుకున్నాను. ఈసారి ఎక్కువ మార్కులు సాధించాలన్న లక్ష్యంతోనే చదివాను. ఇలా పరీక్షపై నా ఆలోచన, దృక్పథం మార్చుకోవడంతో విజయం సాధ్యమైంది. అయిదేళ్లపాటు విజయం లేకుండా ఉండడం మానసికంగా చాలా కష్టం. కానీ మా అమ్మానాన్నలు, మిత్రులు అడుగడుగునా ప్రోత్సహించడమే నా విజయంలో ఎక్కువపాత్ర పోషించినట్లు నేను భావిస్తాను. ఐఏఎస్‌ అధికారిగా మహిళల విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నది నా ఆలోచన.’


మొదటి ర్యాంకర్‌ ఇషితా కిశోర్‌ పుట్టింది హైదరాబాద్‌లోనే

ప్రథమ ర్యాంకర్‌గా నిలిచిన బిహార్‌కు చెందిన ఇషితా కిశోర్‌ పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో హైదరాబాద్‌లో పనిచేసేవారు. ఆ సమయంలోనే బేగంపేటలో ఇషిత జన్మించారు. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అయిన ఇషిత మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమినరీ పరీక్షను కూడా నెగ్గలేకపోయారు. మూడోసారి ఏకంగా ప్రథమ ర్యాంకు సాధించడం విశేషం. ప్రస్తుతం ఇషిత కుటుంబం యూపీలో స్థిరపడింది. తల్లి విశ్రాంత ఉపాధ్యాయురాలు.


వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే..
- పవన్‌దత్త, 22వ ర్యాంక్‌, తిరుపతి

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన పవన్‌దత్త మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 22వ ర్యాంకు సాధించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి సివిల్స్‌ వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. తండ్రి వెంకటేశ్వర్లు ఎల్‌ఐసీ ఉద్యోగి అని, అమ్మ లలితాకుమారి ఉపాధ్యాయురాలని వివరించారు. అమ్మ ప్రేరణతో సివిల్స్‌కు సిద్ధమైనట్లు తెలిపారు. అన్నమాచార్య కీర్తనలు ఆలపించడం, వయోలిన్‌ వాయించడమంటే ఇష్టమని పేర్కొన్నారు.  


ఎక్కువ సాధన చేయడం కలిసొచ్చింది.
- తరుణ్‌ పట్నాయక్‌, 33వ ర్యాంకు, రాజమహేంద్రవరం

మదళా తరుణ్‌ పట్నాయక్‌ గతేడాది(2021) సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించి సిమ్లాలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌లో శిక్షణ అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే రెండో ప్రయత్నంలో 33వ ర్యాంకు సాధించారు. తరుణ్‌ పట్నాయక్‌ తండ్రి ఎంఆర్‌కే పట్నాయక్‌ ఎల్‌ఐసీలో పనిచేస్తుండగా... తల్లి వైజాగ్‌ ఫుడ్స్‌ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఒక ఏడాది కాలంలో ఎలా చదవాలో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్లినట్లు తరుణ్‌ తెలిపారు. మొత్తం సిలబస్‌ను నెల, వారం, రోజు, గంటలో ఏమేమీ చదవాలో కాలపట్టిక రచించుకుని పూర్తిచేయడం... దానికన్నా ఎక్కువగా సాధన చేయడం కలిసొచ్చాయని పేర్కొన్నారు.


బలహీనవర్గాలకు అండగా నిలుస్తా
- అజ్మీరా సంకేత్‌, 35వ ర్యాంక్‌, హైదరాబాద్‌

ఐఏఎస్‌ శిక్షణ పూర్తయ్యాక ఎక్కడ ఉద్యోగం వచ్చినా బలహీనవర్గాలకు అండగా నిలుస్తానని అజ్మీరా సంకేత్‌ ‘ఈనాడు’కు తెలిపారు. సంకేత్‌ తల్లి సవిత బాలానగర్‌లోని ఇస్రోలో ప్రాజెక్ట్‌ అధికారిగా, తండ్రి అజ్మీరా ప్రేమ్‌సింగ్‌ ఉద్యానవనశాఖ ఉపసంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న సంకేత్‌.. దిల్లీ ఐఐటీలో (2013-17) మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బంగారు పతకం సాధించారు. తర్వాత ఒక ఏడాది జపాన్‌లో ఉద్యోగం చేసి దిల్లీకి తిరిగివచ్చారు. తన స్నేహితుడు కట్టా రవితేజ ప్రోత్సాహంతో ఇద్దరూ 2021లో సివిల్స్‌ రాశారు. రవితేజ ఉత్తీర్ణులయ్యారు. తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తాను కూడా ఐఏఎస్‌ అధికారి కావాలన్న పట్టుదలతో ఏడాదిపాటు దిల్లీలోనే ఉండి పరీక్షలు రాసి ఇప్పుడు విజయం సాధించారు.


పేదలకు సేవచేయాలనే లక్ష్యంతో..
- శాఖమూరి ఆశ్రిత్‌, 40వ ర్యాంక్‌, హనుమకొండ

పేదలకు సేవచేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమైనట్లు శాఖమూరి ఆశ్రిత్‌ తెలిపారు. ఇంటర్‌ వరకూ ఉమ్మడి వరంగల్‌లో చదివిన ఆశ్రిత్‌.. రాజస్థాన్‌లోని బిట్స్‌ పిలానిలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. హైదరాబాద్‌లో ఓ కోచింగ్‌ కేంద్రంలో ఏడాదిపాటు శిక్షణ పొంది తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించారు. ఆశ్రిత్‌ తండ్రి అమర్‌ వరంగల్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. తల్లి పద్మజ గృహిణి. వీరిది జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామం కాగా.. వ్యాపారరీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు.


ఐఆర్‌ఎస్‌ నుంచి ఐఏఎస్‌కు..
- రిచా కులకర్ణి, 54వ ర్యాంకు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ సీబీఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన రిచా.. 2021లో సివిల్స్‌ రాసి 131 ర్యాంకు సాధించారు. దీంతో ఐఆర్‌ఎస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పట్టుదలతో మళ్లీ ప్రయత్నించి 54 ర్యాంకుతో సత్తా చాటి ఐఏఎస్‌ సాధించారు.


ఎక్కువ మందికి సేవ చేయాలనేది లక్ష్యం
- ఎం.సాయి ప్రణవ్‌, 60వ ర్యాంక్‌, గుంటూరు

మూడుసార్లు మెయిన్స్‌ వద్దే ఆగిపోయినా.. పట్టువదలకుండా నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమ ర్యాంకు సాధించినట్లు గుంటూరులోని శ్యామలానగర్‌కు చెందిన ఎం.సాయి ప్రణవ్‌ తెలిపారు. తల్లిదండ్రులు ఉమ, అమర్‌నాథ్‌ విశ్రాంత బ్యాంకు అధికారులు. ‘సివిల్స్‌ కల సాకారం కావటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఎక్కువ మందికి సేవ చేయాలనేది లక్ష్యం. జనరల్‌ నాలెడ్జి, వర్తమాన వ్యవహారాల కోసం ఎక్కువగా తెలుగు, ఆంగ్ల దినపత్రికలను ఫాలో అయ్యేవాడ్ని. స్వయంశక్తితో హోటల్‌ నిర్వాహకుడిగా ఎదిగిన మా తాతయ్య నాకు స్ఫూర్తి’ అని సాయి ప్రణవ్‌ తెలిపారు.


యానాం మున్సిపల్‌ కమిషనర్‌కు 71వ ర్యాంకు

సివిల్స్‌ ఫలితాల్లో యానాం మున్సిపల్‌ కమిషనర్‌ ద్విజ్‌గోయెల్‌ 71వ ర్యాంకు సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరట్‌కు చెందిన ద్విజ్‌గోయెల్‌ తొలి ప్రయత్నంలో పుదుచ్చేరి పీసీఎస్‌ కేడర్‌ సాధించి రెండు నెలలుగా యానాం పురపాలిక కమిషనర్‌గా పనిచేస్తున్నారు. మలి ప్రయత్నంలో సివిల్స్‌ రాసిన ఆయన మంచి ర్యాంకు సొంతం చేసుకున్నారు. మేరట్‌ నుంచి ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తన జీవితలక్ష్యం నెరవేరిందని, నాన్న చనిపోయినా ఉపాధ్యాయినిగా అమ్మ కష్టపడి చదివించారని, ఆమె ప్రార్థనలు ఫలించాయని తెలిపారు.


నాన్న, అక్కల స్ఫూర్తితో...
- ఉత్కర్ష్‌కుమార్‌, 78వ ర్యాంక్‌, హైదరాబాద్‌

తండ్రి, ఇద్దరు అక్కలు తనకు స్ఫూర్తిగా నిలిచారని, సమాజానికి తనవంతు సేవ చేస్తానని ఉత్కర్ష్‌కుమార్‌ తెలిపారు. తల్లిదండ్రులతో హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఉంటున్న ఉత్కర్ష్‌.. ఆరో ప్రయత్నంలో 78వ ర్యాంక్‌ సాధించారు. ఇంటర్‌వరకూ హైదరాబాద్‌లో చదివిన ఉత్కర్ష్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. రెండేళ్ల క్రితం సివిల్స్‌కు ఎంపికైనా.. రక్షణశాఖలో సహాయ సంచాలకునిగా ఉద్యోగం వచ్చినా ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యంతో విధుల్లో చేరలేదు. తండ్రి సునీల్‌కుమార్‌ (ఐఎఫ్‌ఎస్‌) ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా పదవీ విరమణ చేశారు. తల్లి నిషాశ్రీ తెలంగాణ హైకోర్టులో ఉద్యోగి. పెద్ద సోదరి నిషా శ్రీవాత్సవ ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌గా, రెండో సోదరి పరుల్‌ శ్రీవాత్సవ(ఐఆర్‌ఎస్‌) గుజరాత్‌లో కస్టమ్స్‌ విభాగంలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.


ఆరో ప్రయత్నంలో ఈ విజయం
- ఆవుల సాయికృష్ణ, 94వ ర్యాంక్‌, కరీంనగర్‌

ఆవుల సాయికృష్ణ ప్రస్తుతం ఇండియన్‌ కార్పొరేషన్‌ లా సిస్టంలో ఏడీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. 2017లో 728వ ర్యాంకు సాధించిన ఆయన.. ఆరో ప్రయత్నంలో 94వ ర్యాంకును అందుకున్నారు.


వంట కార్మికురాలి కొడుకు.. సివిల్స్‌ సాధించాడు
తుంగెడవాసికి 410 ర్యాంకు

రెబ్బెన, న్యూస్‌టుడే: కుమురం భీం జిల్లాకు చెందిన పేదింటి బిడ్డ 410 ర్యాంకు సాధించి మారుమూల పల్లెకు పేరు తెచ్చారు రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి రేవయ్య. డోంగ్రి మనోహర్‌- విస్తారుబాయి దంపతులకు శ్రావణ్‌కుమార్‌, రేవయ్య, స్వప్న ముగ్గురు పిల్లలు. రేవయ్య చిన్నతనంలోనే మనోహర్‌ మృతిచెందారు. అప్పటి నుంచి తల్లి విస్తారుబాయి పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా, కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. పదో తరగతి వరకు ఆసిఫాబాద్‌ గురుకుల పాఠశాలలో చదివిన రేవయ్య టెన్త్‌లో 512 మార్కులు సాధించాడు. తర్వాత చిలుకూరు సాంఘిక సంక్షేమ వసతిగృహంలో విద్యనభ్యసించి ఇంటర్‌ 929 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. 2012లో ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసి 737 ర్యాంకు సాధించాడు. మద్రాసు ఐఐటీలో సీటు సాధించి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఓఎన్‌జీసీలో అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా పనిచేశారు. గత ఏడాది ఈ పరీక్ష రాసినా రెండు మార్కుల తేడాతో అవకాశం కోల్పోయారు. తర్వాత హైదరాబాద్‌లోని బాల లలిత శిక్షణ సంస్థలో చేరి సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించి అమ్మ కళ్లల్లో సంతోషం నింపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని