Guntur: బాబోయ్‌ సీఎం జగన్‌ పర్యటన.. ట్రాఫిక్‌ ఆంక్షలతో అల్లాడిన గుంటూరు ప్రజలు

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో గుంటూరులో మంగళవారం విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు సామాన్యులను అష్టకష్టాలపాలు చేశాయి.

Updated : 24 May 2023 07:22 IST

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో గుంటూరులో మంగళవారం విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు సామాన్యులను అష్టకష్టాలపాలు చేశాయి. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ మాతృమూర్తి మరణించడంతో ఆయన్ను పరామర్శించేందుకు సీఎం బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు చూపిన అత్యుత్సాహం, విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలు అందరికీ చుక్కలు చూపెట్టాయి. పోలీసు కవాతు మైదానం, కలెక్టరేట్‌ కూడలి, కంకరగుంట బ్రిడ్జి, నగరంపాలెం కూడలి, పట్టాభిపురం, శ్యామలానగర్‌ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో బారికేడ్లను పెట్టారు. సీఎం ఉదయం 8 గంటలకు గుంటూరు వస్తారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. సుమారు 9.30 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ పోలీసు కవాతు మైదానాన్ని చేరుకుంది. అక్కడినుంచి సీఎం కాన్వాయ్‌ ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపేశారు. ముఖ్యమంత్రి తన పర్యటన ముగించుకొని తిరిగి పోలీసు కవాతు మైదానానికి సుమారు పదిన్నరకు చేరుకున్నారు. ఈ పర్యటన కోసం దాదాపు 4 గంటలపాటు నగరవాసులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఉద్యోగులు క్షణమో యుగంలా గడిపారు. ఆయా మార్గాలను ఉన్నపళంగా మళ్లించడంతో స్థానికులు అష్టకష్టాల పాలయ్యారు.


నేడు కొవ్వూరు వంతు!  

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘జగనన్న విద్యాదీవెన’ను ప్రారంభించనున్నారు. తొలుత ఇక్కడ ‘వాలంటీర్లకు వందనం’ నిర్వహించాలని నిర్ణయించారు. గత నెల 14న, ఈ నెల 5న ఏర్పాట్లు సైతం చేశారు. అవి వాయిదాపడ్డాయి. బుధవారం పర్యటన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కేజీఎం పాఠశాల సమీపంలో హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణానికి రెండు కి.మీ.పరిధిలో పలుచోట్ల చెట్ల కొమ్మలు తొలగించారు.


ఎమ్మెల్యే గిరిధర్‌కు ముఖ్యమంత్రి పరామర్శ

గుంటూరు, న్యూస్‌టుడే: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గిరిధర్‌ తల్లి శివపార్వతి సోమవారం మరణించారు. సీఎం జగన్‌ మంగళవారం గుంటూరు శ్యామలానగర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చి శివపార్వతి చిత్రపటానికి నివాళులర్పించారు. గిరిధర్‌, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుగుపయనమవుతూ కాన్వాయ్‌ వద్ద ఎమ్మెల్యే గిరిధర్‌తో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు