Venkatram Reddy: బొప్పరాజు ఉద్యమంతో తెగదు.. తెల్లారదు: వెంకట్రామిరెడ్డి

ప్రభుత్వం హామీ ఇచ్చిన గడువు కంటే ముందే ఉద్యోగుల బిల్లులన్నీ చెల్లిస్తోందని, చెప్పినదాని కంటే ఎక్కువే చేసిందని, అందుకే సీఎంను అభిమానిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్‌) ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Updated : 25 May 2023 07:51 IST

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం హామీ ఇచ్చిన గడువు కంటే ముందే ఉద్యోగుల బిల్లులన్నీ చెల్లిస్తోందని, చెప్పినదాని కంటే ఎక్కువే చేసిందని, అందుకే సీఎంను అభిమానిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్‌) ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఏపీజీఈఎఫ్‌తో కలిసి పనిచేసేందుకు రెవెన్యూశాఖకు చెందిన అయిదు సంఘాలు ముందుకు రాగా, ఆ నేతలతో కలిసి బుధవారం రాష్ట్ర సచివాలయంలో వెంకట్రామిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘ఉద్యోగుల్లో 80% మందికి ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయి. ఎక్కడో ఒకరిద్దరికి రాకపోతే దానినే చూపించి ఒకటిన రాలేదనడం సరికాదు. మార్చిలో జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు చాలావరకు చెల్లించారు’ అని పేర్కొన్నారు. 2004 సెప్టెంబరు ఒకటికి ముందు పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఉద్యోగంలో చేరడం జాప్యమైనవారికి పాత పింఛను అమలుచేయాలని కేంద్రం సర్క్యులర్‌ ఇచ్చింది. రాష్ట్రంలో ఇలాంటివారికి ఓపీఎస్‌ అమలుపై   వచ్చే మంత్రివర్గ సమావేశంలో బిల్లు పెడతారని చెప్పారు’ అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

ఆ ఉద్యమంతో ప్రయోజనం లేదు

‘బొప్పరాజు సంఘానికి బలం లేదు. మాటలతో మేనేజ్‌ చేస్తారు. వారి దగ్గరకు వెళ్లి కొట్లాడుతున్నానని చెబుతారు. ఇటొచ్చి ఉద్యోగులు తనను దగ్గరకు రానివ్వరంటారు. ఈ ఉద్యమం 2024లో ఎన్నికలు వచ్చేవరకూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి మూడుదశల ఉద్యమమైంది. ఇంకో 10-15 దశలు చేస్తారు. దాంతో తెగదు, తెల్లారదు. వాళ్లకు ఉద్యోగుల కోసం ఉద్యమించే చరిత్ర లేదు. గుర్తింపు కోసమే ఉద్యమిస్తారు. 50-60 డిమాండ్లు పెట్టుకొని.. ఏది నెరవేర్చినా, ఇంకా పోరాడుతున్నట్లే చెబుతారు. ఇప్పుడు ఉద్యమిస్తున్న నాయకులు గత ప్రభుత్వంలో ఎక్కడికి పోయారు? ఆ ప్రభుత్వం నాయకులను నెత్తిన పెట్టుకుంది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకుని.. నాయకులను పట్టించుకోవట్లేదు. అదే వీరి బాధ’ అని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల ఐకాస, ఏపీ ప్రోగ్రెసివ్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, వీఆర్‌ఏ సంఘం, వీఆర్వోల సంఘం, కంప్యూటర్‌ ఆపరేటర్ల సంఘం.. ఏపీజీఈఎఫ్‌తో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని