CBI-Supreme Court: న్యాయశాస్త్రంలో ఇది 8వ వింత

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 27న జారీ చేసిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ పేర్కొంది.

Updated : 25 May 2023 13:47 IST

గంగిరెడ్డిని జులై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సీబీఐ వ్యాఖ్య
తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 27న జారీ చేసిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) సంజయ్‌ జైన్‌ వాదనలు వినిపిస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను తాము సమర్థిస్తున్నామన్నారు. దీనిపై గురువారం కల్లా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తామని, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. గంగిరెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదిస్తూ తాము కూడా బెయిల్‌ రద్దును సవాలు చేస్తూ ఒక ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశామన్నారు. అది ఇంకా లిస్ట్‌ కావాల్సి ఉన్నందున దాన్ని కూడా కలిపి విచారించాలని కోరారు. దాంతో జస్టిస్‌ నరసింహ రెండు కేసులనూ శుక్రవారానికి వాయిదా వేశారు. బుధవారం విచారణ ప్రారంభమైన వెంటనే సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ బెయిల్‌ రద్దు చేసే సమయంలో మళ్లీ బెయిల్‌ ఎలా ఇస్తారు? విజ్ఞప్తి లేకుండానే ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. జస్టిస్‌ నరసింహ స్పందిస్తూ ఆ ఉత్తర్వులను తాము చూశామన్నారు. కౌంటర్స్‌ పేరుతో విషయాన్ని సంక్లిష్టం చేయడానికి బదులు ఈ పిటిషన్‌పై అభిప్రాయం చెప్పడానికి అడ్డంకి ఏముందని సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించారు. ఏఎస్‌జీ జైన్‌ స్పందిస్తూ ఈ ఉత్తర్వు బెయిల్‌ న్యాయశాస్త్రంలో 8వ వింతలా కనిపిస్తోందని, ఇలాంటిది తామెప్పుడూ వినలేదని పేర్కొన్నారు. ఒకవైపు బెయిల్‌ రద్దు చేస్తూనే మరోవైపు బెయిల్‌ ఇవ్వడం ఎలా సాధ్యమని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వుల్లోనే పరస్పర వైరుద్ధ్యం ఉందని పేర్కొన్నారు. జస్టిస్‌ నరసింహ జోక్యం చేసుకుంటూ ‘మేం సమతుల్యమైన ఉత్తర్వులు జారీ చేస్తాం. ఆయన బెయిల్‌ కోరుతూ దరఖాస్తు చేసుకోకుండా అడ్డంకులు కల్పించం. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ఆయన దరఖాస్తు చేసుకోవచ్చు. హైకోర్టు ఎన్నో కారణాలు చెప్పి బెయిల్‌ రద్దు చేసిన తర్వాత మళ్లీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశిస్తూ ఉత్తర్వుల్లోని చివరి భాగంలో చెప్పింది. వాస్తవంగా ఇది బెయిల్‌ రద్దుకు సంబంధించిన అంశం’ అని పేర్కొన్నారు. మొత్తం ఉత్తర్వుల్లో అదే కీలకాంశమని, ఆ భాగమే మొత్తాన్ని దెబ్బతీసిందని సీబీఐ న్యాయవాది వ్యాఖ్యానించారు.

100 సార్లు సీబీఐ విచారణకు హాజరు..

హైకోర్టు ఉత్తర్వులపై ప్రతివాది తరఫు న్యాయవాది ఏమంటారని జస్టిస్‌ నరసింహ ప్రశ్నించారు. గంగిరెడ్డికి ఈ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ లభించిన తర్వాత దాదాపు 100 సార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మీ బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎస్‌ఎల్‌పీ ఏమైనా వేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా అవునని చెప్పారు. జస్టిస్‌ నరసింహ స్పందిస్తూ బెయిల్‌ రద్దు విధానాన్ని మీరు సవాల్‌ చేసినప్పుడు దాన్ని వినాల్సి ఉంటుందన్నారు. ఈ రోజు ఆ ఉత్తర్వులను తోసిపుచ్చి, రేపు మీ పిటిషన్‌ను తీసుకోవడం బాగుండదని వ్యాఖ్యానించారు. అందువల్ల రెండు కేసులను కలిపి శుక్రవారం వింటామంటూ ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని