YS Avinash Reddy: విశ్వభారతి వీధిలో ‘అధికార’ పెత్తనం

కర్నూలు గాయత్రి ఎస్టేట్‌ ప్రాంతంలో విశ్వభారతి ఆసుపత్రి ఉన్న వీధిలో గత వారం రోజులుగా ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుల పెత్తనం సాగుతోంది. ఆ వీధిలో అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Updated : 26 May 2023 07:35 IST

తిష్ఠ వేసిన అవినాష్‌రెడ్డి అనుచరులు
అడుగడుగునా నిఘా.. సమాచార సేకరణ
రహస్య ప్రదేశంలో సీబీఐ బృందం

ఈనాడు, కర్నూలు, కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: కర్నూలు గాయత్రి ఎస్టేట్‌ ప్రాంతంలో విశ్వభారతి ఆసుపత్రి ఉన్న వీధిలో గత వారం రోజులుగా ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరుల పెత్తనం సాగుతోంది. ఆ వీధిలో అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి. అవినాష్‌రెడ్డికి మద్దతుగా పులివెందుల నుంచి పలువురు మహిళలు గురువారం ఇక్కడికి తరలివచ్చారు. వారు విశ్వభారతి ఆసుపత్రి ముందు బైఠాయించి ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. వీధి ప్రారంభం నుంచి చివరి వరకు.. ఆ వీధికి అనుకుని ఉన్న ఇతర మార్గాలు.. ప్రధాన రహదారి కలిసే అడ్డరోడ్లలో  వైకాపా నాయకులు పహారా కాస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఓ సీఐ అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఆయన్ను అందరి ముందూ ఓ నేత అసభ్య పదజాలంతో దూషించడంతో పోలీసులూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి తలెత్తింది. మూడు రోజుల కిందటే బదిలీపై వచ్చిన ఆయన బుధవారం నాటి ఘటనతో తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు సమాచారం. గురువారం ఆయనకు ఆసుపత్రి వద్ద బందోబస్తు బాధ్యతలు అప్పగించకుండా దూరం పెట్టారు. బదిలీ చేస్తే పార్టీకి నష్టమని పలువురు చెప్పడంతో ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని తెలుస్తోంది. అవినాష్‌రెడ్డి గురువారం తనను కలిసిన పలువురు అనుచరులతో మాట్లాడారు.

వ్యాపారాలు లేక విలవిల

గాయత్రి ఎస్టేట్‌ పరిసరాలన్నీ వైకాపా నాయకులతో నిండిపోయాయి. అయిదు రోజులుగా ఆ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు పెరగడం.. అధికార పార్టీ నేతలు తిష్ట వేయడంతో సామాన్య జనం అటు వెళ్లడం లేదు. ఈ పరిసరాల్లో ఎన్నో ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు, క్లీనిక్‌ సెంటర్లు ఉన్నాయి. ఔషధ దుకాణాల్లో వ్యాపారాలు జరగక యజమానులు దిగులు చెందుతున్నారు. విశ్వభారతి ఆసుపత్రికి పక్కనే ఉన్న ఔషధ దుకాణంలో నిత్యం రూ.10 వేల వరకూ వ్యాపారం జరిగేది.. రోగులెవరూ రాకపోవడంతో మంచినీటి సీసాలు, శీతలపానీయాలు మాత్రమే అమ్ముతున్నారు. మధుమేహం రోగులకు చికిత్స అందించే ఓ వైద్యుడి వద్దకు నిత్యం కనీసం 30 మంది వచ్చేవారు.. ఇప్పుడు 10 మంది రావడమే గగనమవుతోందని ఆ వైద్యుడు తెలిపారు.

కోలుకొంటున్న శ్రీలక్ష్మి  

అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు హెల్త్‌ బులెటిన్‌లో గురువారం ప్రకటించారు. ‘గత మూడురోజుల్లో ఆమెలో గణనీయమైన పురోగతి కనిపించింది’ అని   తెలిపారు.

బుగ్గన ఎందుకు రాలేదో

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం నగరానికి వచ్చారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అక్కడికి కూతవేటు దూరంలోనే విశ్వభారతి ఆసుపత్రి ఉన్నప్పటికీ ఆయన అక్కడికి వెళ్లి అవినాష్‌రెడ్డి తల్లిని పరామర్శించలేదు. ఉమ్మడి జిల్లాలోని పలువురు వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి అవినాష్‌రెడ్డితో మాట్లాడారు. మంత్రి బుగ్గన ఆసుపత్రికి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.

వాహనాలన్నీ మొబైల్‌ బార్లే

కర్నూలులో మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. ఎంపీ అవినాష్‌రెడ్డి మద్దతుగా వైయస్‌ఆర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వైకాపా నేతలు తరలొస్తున్నారు. రాత్రింబవళ్లు గాయత్రి ఎస్టేట్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్నారు. లాడ్జీలన్నీ కిటకిటలాడుతున్నాయి. వైకాపా నాయకులు, కార్యకర్తలూ కేసులకొద్దీ మద్యం కొనుగోలు చేసి లాడ్జీలకు తీసుకు వెళుతున్నారు. పలువురు నాయకులు తమ వాహనాలను మొబైల్‌ బార్లుగా మార్చేసుకున్నారు. కర్నూలులో ఉన్న  23 మద్యం దుకాణాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి 24 వరకు రూ.3.14 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గాయత్రి ఎస్టేట్‌ సమీపంలోని బుధవారపేట మద్యం దుకాణంలోనే రూ. 22.59 లక్షల మద్యం, మద్దూర్‌నగర్‌లోని దుకాణంలో రూ.15.09 లక్షల విలువగల మద్యం విక్రయాలు జరిగాయి.


రహస్య ప్రదేశంలో సీబీఐ అధికారులు

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం తీర్పు వెలువడుతుందన్న ఉద్దేశంతో తదుపరి చర్యల కోసం సీబీఐ అధికారులు మళ్లీ కర్నూలు వచ్చారు. అనూహ్యంగా పిటిషన్‌ విచారణ శుక్రవారానికి వాయిదా పడడంతో వారు నగరంలోని ఆ రహస్య ప్రదేశంలోనే ఉన్నట్లు సమాచారం.  


రోగుల్లో అసహనం

కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న     నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్దఎత్తున    ఆసుపత్రికి చేరుతున్నారు. వీధిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం.. ఆసుపత్రికి చెందిన అంబులెన్సులను వేరేదారిలో మళ్లిస్తుండటంతో రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్సులూ ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి.

ఈనాడు, కర్నూలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని