Saint Lukes - YS Vimala Reddy: చర్చి వెలిసింది... ఆసుపత్రి ఏమైంది?

సేవ చేస్తామని చెప్పి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గుప్పిట్లో పెట్టుకున్నారు. అధికారపార్టీ కీలకనేత కుటుంబం ఆశీస్సులతో నెట్టుకొస్తున్నారు.

Updated : 26 May 2023 09:56 IST

లక్ష్యం నెరవేరకున్నా రూ.కోట్ల విలువైన భూమి గుప్పిట్లోనే
సెయింట్‌ లూక్స్‌ సంస్థకు 7.35 ఎకరాల కేటాయింపు
ఏళ్లు గడుస్తున్నా కానరాని పేదల ఆసుపత్రి భవనం
దరఖాస్తులో లేని ప్రార్థనా మందిరం మాత్రం నిర్మించారు
ఈ చర్చితో వైఎస్‌ విమలారెడ్డికి  అనుబంధం!

ఈనాడు, విశాఖపట్నం: సేవ చేస్తామని చెప్పి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గుప్పిట్లో పెట్టుకున్నారు. అధికారపార్టీ కీలకనేత కుటుంబం ఆశీస్సులతో నెట్టుకొస్తున్నారు. లక్ష్యాన్ని పక్కనపెట్టి భూ వినియోగంలో నిబంధనలకు పాతరేశారు. ఆసుపత్రి కట్టాలంటే సవాలక్ష సాకులు చెబుతున్న నిర్వాహకులు.. అక్కడ ఓ ప్రార్థన మందిరాన్ని మాత్రం ఎప్పుడో నిర్మించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తప్పేమీ చేసి ఉండకపోవచ్చంటూ కితాబిచ్చిన ఆయన అత్త వైఎస్‌ విమలారెడ్డి... తరచు ఈ ప్రార్థన మందిరానికి వచ్చి మతపరమైన సందేశాలు ఇస్తుంటారట! విశాఖ సాగర తీరంలో రూ.300 కోట్ల విలువైన భూమి చుట్టూ నడుస్తున్న తతంగమిది!! అంతేనా... వైకాపా అధికారంలోకి రాగానే నిబంధనల ఉల్లంఘన పేరుతో తెదేపా నేతల ఆస్తులపై ఉక్కుపాదం మోపింది. ఇక్కడ భూ వినియోగం లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు.

ఇలా చెప్పి చక్కబెట్టారు

‘సెయింట్‌ లూక్స్‌ మైనారిటీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. క్రిస్టియన్‌ కమ్యూనిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల సాధికారిత కోసం నర్సింగ్‌ శిక్షణ ఇస్తాం. దీనికి అవసరమైన స్థలం కేటాయించాలి. ఆసుపత్రి నిర్మాణం, మౌలిక వసతులు, శిక్షణ తరగతులకు అనుగుణంగా నిర్మించాల్సి ఉన్నందున తక్కువ ధరకు భూమిని ఇవ్వాలి. పేదల వైద్య అవసరాలు తీర్చేలా మిషనరీ ఆసుపత్రి నడిపి సమీప గ్రామాలు, పునరావాస కేంద్రాల్లో మందుల పంపిణీ, వైద్య శిబిరాల వంటివి నిర్వహిస్తాం’ - ఇదీ సెయింట్‌ లూక్స్‌ సంస్థ 2004లో చేసిన దరఖాస్తు సారాంశం. 2009 ఫిబ్రవరి 20న స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విచిత్రమేమంటే 2004లో దరఖాస్తు చేయగా, 2006లో కేబినెట్‌ ఈ తీర్మానాన్ని తిరస్కరించింది. అయినా వైఎస్‌ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండటంతోనే దస్త్రం ముందుకు కదిలి విలువైన భూమిని కేటాయించినట్లు అప్పట్లో విమర్శలొచ్చాయి.

వెనక్కి తీసుకోవాలని సూచించినా..

ఓ లక్ష్యంతో ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి వినియోగంలో నిబంధనలకు పాతరేశారు. కేటాయించిన భూమిలో కొంత రోడ్డు విస్తరణకు పోగా, 6 ఎకరాలకు పైగా సంస్థ ఆధీనంలో ఉంది. ఇందులో కొంత భాగంలో మూడు రేకుల షెడ్లు నిర్మించి నర్సింగ్‌ శిక్షణ ఇస్తున్నారు. ఇటీవలే నర్సింగ్‌ విద్యార్థినులకు వసతిగృహం ఏర్పాటుచేశారు. తాజాగా మ్యూజిక్‌, యోగ శిక్షణ ఇచ్చేందుకు ఏయూతో కలిసి అడుగులు పడ్డాయి. అయితే, ఆసుపత్రి భవనం నిర్మించి ఉచిత వైద్యసేవలు అందిస్తామన్న మాటను మాత్రం గాలికొదిలేశారు. భూమి కేటాయించిన తర్వాత నిర్దేశిత సమయంలో సేవలు అందుబాటులోకి తేవాలి. పద్నాలుగేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో లక్ష్యం నెరవేరకపోగా, విలువైన భూములను ఖాళీగా ఉంచి చేతుల్లో పెట్టుకోవడం గమనార్హం. ఇదే విషయంపై కొన్నేళ్ల క్రితం వేసిన కమిటీ... ఖాళీ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే వైఎస్‌ కుటుంబసభ్యులతో సంబంధాలు ఉండటంతో.. దీనిపై దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి.

విమలారెడ్డి పర్యటనలు

పేదల కోసం ఆసుపత్రి ఎందుకు కట్టలేదంటే.. ఇక్కడ మట్టి స్వభావం అందుకు అనుగుణంగా లేదని సంస్థ నిర్వాహకులు సాకు చెబుతున్నారు. కానీ, అసలు దరఖాస్తులో చూపించని ప్రార్థన మందిరాన్ని మాత్రం ఎప్పుడో కట్టేశారు! ఇక్కడికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరి విమలారెడ్డి మత సందేశం ఇవ్వడానికి తరచూ వస్తున్నట్లు సమాచారం. 2019 ఏప్రిల్‌ 21న చర్చి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు.. మధ్యమధ్యలో సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆసుపత్రి ఆలస్యం.. అందుకే వైద్య శిబిరాలు

ఈ అంశంపై సొసైటీ కరస్పాండెంట్‌ ప్రీతం లూక్స్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ... ఆసుపత్రి, ఇతర భవన నిర్మాణాల అనుమతులకు రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసినా అనుమతులు రాకపోవడం వల్లే ఆలస్యమైందన్నారు. అయినా తాత్కాలికంగా వైద్య సేవలు అందిస్తూ, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


సముద్ర తీరానికి అభిముఖంగా..

విశాఖలో విలువైన భూములను దక్కించుకోవాలని ముందునుంచే ప్రణాళిక రచించినట్లు దరఖాస్తు చూస్తే అర్థమవుతుంది. సాగర తీరానికి చేరువలో సముద్రానికి అభిముఖంగా స్థలం ఇవ్వాలని కోరారు. అందుకు అనుగుణంగానే స్థలం గుర్తించారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూశాఖకు భూ కేటాయింపుపై దస్త్రం రాగా, దానిపై కలెక్టర్‌ నివేదిక ఇస్తూ అందులో భూమి అప్పటి మార్కెట్‌ విలువ ఎకరా రూ.1.50 కోట్లుగా పేర్కొన్నారు. సేవ పేరుతో ఎకరా రూ.25 లక్షలకే కట్టబెట్టారు. భూపరిపాలన శాఖ నిర్ణయం తీసుకుని సొసైటీకి విశాఖ గ్రామీణ మండలం ఎండాడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 16/1లో 7.35 ఎకరాలు కేటాయించింది. ఈ భూమి జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో దీని విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు