మరో ఏడాది.. తవ్వుకో.. దోచుకో నాయకా!
రాష్ట్రవ్యాప్తంగా అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక దందాకు మరో ఏడాది పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమమైంది.
జేపీ సంస్థతో ఇసుక వ్యాపార ఒప్పందం పొడిగింపు
వచ్చే ఏడాది మే వరకు దందాకు రాజమార్గం
అధికార పార్టీ నేతలకు పండగే
ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక దందాకు మరో ఏడాది పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్గం సుగమమైంది. ఇసుక వ్యాపారానికి గనుల శాఖతో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ఈ నెల మొదటి వారంలో ముగియగా, మరో ఏడాది పొడిగించారు. దీంతో జేపీ సంస్థ పేరిట ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా చేస్తున్న ఇసుక తవ్వకాలు, విక్రయాలు దర్జాగా కొనసాగనున్నాయి. ప్రతినెలా పెద్దలకు భారీ మొత్తం చెల్లించి.. జిల్లాల్లో నేతలు దందా సాగించనున్నారు. జేపీ సంస్థతో ఇసుక వ్యాపార ఒప్పందం గడువు పొడిగించారనే సమాచారాన్ని ఎక్కడా బయటపెట్టకుండా గనులశాఖ రహస్యంగా ఉంచుతోంది.
ప్రభుత్వం పచ్చజెండాతో ఒప్పందం
రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించి ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం 2021లో టెండర్లు పిలిచారు. అప్పట్లో దిల్లీకి చెందిన జేపీ సంస్థ.. బిడ్లు దక్కించుకుంది. 2021 మే 3న గనుల శాఖతో రెండేళ్లకు ఒప్పందం చేసుకుంది. అప్పటి వరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక వ్యాపారాన్ని జేపీ సంస్థ తమ చేతుల్లోకి తీసుకొని, మే 14 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. రెండేళ్ల గడువు ఈ నెలలో ముగుస్తున్నా.. మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం చర్యలేవీ తీసుకోలేదు. చివరకు జేపీ సంస్థతో ఒప్పంద గడువు ఎన్నాళ్లు పునరుద్ధరించాలో చెప్పాలంటూ గనులశాఖ నుంచి ప్రభుత్వానికి దస్త్రం వెళ్లింది. ఏడాది పాటు పునరుద్ధరించేందుకు సర్కారు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో ఇటీవల ఒప్పందాన్ని పునరుద్ధరించారు.
నాయకులకు అడ్డూ అదుపూ లేదు
రెండేళ్ల క్రితం జేపీ సంస్థకు ఇసుక టెండరు దక్కినా.. వెంటనే చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఉప గుత్తేదారుగా రంగప్రవేశం చేసింది. అప్పటినుంచి దాని ఆధీనంలోనే రాష్ట్రమంతా ఇసుక తవ్వకాలు, విక్రయాలు సాగాయి. నిబంధనల ఉల్లంఘనలు, దందా యథేచ్ఛగా జరిగాయి. ఆ సంస్థ ప్రతినెలా పెద్దలకు భారీగా కప్పం కట్టేలా ఏర్పాట్లు చేయడంతో.. ప్రభుత్వశాఖలేవీ ఇసుకలో జరుగుతున్న ఉల్లంఘనలను పట్టించుకోలేదు. గత ఏడాది ఆగస్టులో ఆకస్మికంగా టర్న్‌కీ సంస్థను వైదొలిగేలా చేశారు. వెంటనే ప్రతి జిల్లాలో అధికారపార్టీ నేతలకు ఇసుక వ్యాపారం ఇచ్చేశారు. ఒక్కో ఉమ్మడి జిల్లాను ఓ ముఖ్యనేతకు అప్పగించగా.. వాళ్లు రీచ్‌ల వారీగా స్థానిక నేతలకు కట్టబెట్టారు. మొత్తంగా సిండికేట్‌లా ఏర్పడి.. ప్రతినెలా పెద్దలకు భారీ మొత్తం చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. బిల్లులు జేపీ, టర్న్‌కీ పేరిట ఇచ్చినా.. ఇసుక వ్యాపారం మాత్రం అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది.
ఉల్లంఘనలన్నీ యథావిధిగానే..
ఇసుక ఒప్పందం పొడిగింపు నేపథ్యంలో రెండేళ్లుగా సాగుతున్న ఉల్లంఘనలన్నీ మరో ఏడాది కొనసాగనున్నాయి.
* రీచ్‌లు, స్టాక్ పాయింట్లలో ఆన్‌లైన్ బిల్లులు ఇవ్వరు. సొంతంగా ముద్రించుకున్న బిల్లులపై చేతిరాతతో జారీ చేస్తారు.
* దీనివల్ల వాస్తవ విక్రయాల లెక్కలు ఉండవు. నేతలు ఇచ్చే లెక్కలనే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు.
* ఎక్కడా డిజిటల్ చెల్లింపులు స్వీకరించరు. నగదు ఇస్తేనే ఇసుక లోడ్ చేస్తారు.
* పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో రాత్రివేళ భారీగా ఇసుక ఆయా రాష్ట్రాలకు తరలిపోతుంది.
* ఏం జరిగినా.. గనులశాఖ, విజిలెన్స్, ప్రత్యేక కార్యదళం (ఎస్‌ఈబీ), రెవెన్యూ, పోలీసు శాఖలు అటు కన్నెత్తి చూడవు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!