నీ కథ చూస్తా.. ‘గడప గడప’లో ఫొటో దిగలేదని ప్రభుత్వ విప్‌ ఆగ్రహం

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బ్రోచర్‌ పట్టుకుని ఫొటో దిగలేదని హోటల్‌ నిర్వాహకుడు, తెదేపా మైనార్టీ సెల్‌ నాయకుడు రఫీపై రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 26 May 2023 04:55 IST

తెదేపా మైనార్టీ నాయకుడి హోటల్లో తనిఖీలకు ఆదేశం

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బ్రోచర్‌ పట్టుకుని ఫొటో దిగలేదని హోటల్‌ నిర్వాహకుడు, తెదేపా మైనార్టీ సెల్‌ నాయకుడు రఫీపై రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్‌ నిర్వహణపై పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు హుకుం జారీ చేశారు. రఫీ కుటుంబ సభ్యులు గ్రామంలో రోడ్డు పక్కన చిన్న హోటల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రఫీ ఇంటికి వెళ్లారు. జగన్‌ మైనార్టీలకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెబుతూ వారికి బ్రోచర్‌ ఇచ్చారు. ఫొటో దిగాలని కోరగా.. అందుకు రఫీ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తమకు జగన్‌ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని, తాను తెదేపా మైనార్టీ నాయకుడని రఫీ చెప్పారు. ప్రభుత్వ విప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన హోటల్‌ నిర్వహిస్తున్నావని, నీ కథ చూస్తానని తనను బెదిరించారని రఫీ ఆరోపించారు. హోటల్‌లో శుచి, శుభ్రతపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని వాపోయారు. వీఆర్వో రామన్న, పంచాయతీ కార్యదర్శి కుళ్లాయిస్వామినాయుడు హోటల్‌ను పరిశీలించి వంటనూనె, దోసె రవ్వ, చపాతీ పిండి నమూనాలు తీసుకెళ్లారని రఫీ ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్‌ నిర్వహణకు అనుమతి పత్రాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులు అడగ్గా, స్థానిక తెదేపా నాయకులు కేశప్ప, వీఎల్‌ రామాంజనేయులు, నాగరాజులతో పాటు గ్రామస్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్థలాన్ని పరిశీలించి వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు