‘రొయ్య’కు కరెంట్‌ షాక్‌

విద్యుత్‌ కోతలు ఆక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేళాపాళా లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

Updated : 26 May 2023 04:52 IST

నెల రోజులుగా విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు
జనరేటర్‌ నిర్వహణ కోసం భారీగా ఖర్చు
అదనపు భారంతో రైతులకు తప్పని వెతలు 
ఈనాడు-అమరావతి

‘గణపవరం మండలం కేశవరం పరిధిలోని మూడు ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నా. వేళాపాళా లేకుండా విధిస్తున్న విద్యుత్‌ కోతల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమయంలో జనరేటర్‌ నిర్వహణ కోసం రోజుకు రూ.3 వేలు ఖర్చు చేస్తున్నా. ఇప్పటికే రొయ్యల ధర ఆశించిన స్థాయిలో లేదు. దీనికితోడు డీజిల్‌, జనరేటర్‌ కోసం చేసే ఖర్చు అదనపు భారంగా మారింది’

సప్పా ప్రవీణ్‌ రైతు, పశ్చిమగోదావరి

‘నిడమర్రు మండలంలో సుమారు 10 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నా. నెల రోజులుగా రోజూ విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. రొయ్యలను కాపాడుకోటానికి నిత్యం జనరేటర్‌లో డీజిల్‌ కోసం రూ.4 వేలు ఖర్చు చేస్తున్నా. గతంలో గ్రామంలో విద్యుత్‌ ఉపకేంద్రం లేదని కోతలు పెట్టారు. ఇప్పుడు ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసినా సమస్య తీరలేదు’

చనపతి సూరిబాబు, రైతు


విద్యుత్‌ కోతలు ఆక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేళాపాళా లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాత్రివేళల్లో కనీసం.2, 3 గంటల పాటు విధిస్తున్న విద్యుత్‌ కోతల వల్ల చెరువుల్లో ఏరియేటర్స్‌ పనిచేయడం లేదు. రొయ్యను కాపాడుకోడానికి రైతులు జనరేటర్లను వినియోగించాల్సి వస్తోంది. వాటి అద్దె, డీజిల్‌ కోసం కనీసం రోజుకు రూ.2 నుంచి రూ.3 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

నెల రోజులుగా కోతలతో ఇబ్బంది

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. ఇందులో సుమారు 2 లక్షల ఎకరాలు గణపవరం, నిడమర్రు, ఉండి, భీమవరం, పాతకోడేరు, కాళ్ల, ఆకివీడు మండలాల పరిధిలోనే ఉంది. రాష్ట్రంలో ఆక్వా సాగు జరిగే ప్రాంతాల్లోని రైతులకు కోతలు లేకుండా విద్యుత్‌ అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పగటి వేళల్లో కొద్ది సేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినా. సర్దుబాటు చేసుకోడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా రాత్రి వేళల్లో కోతలు పెడుతున్నారు. దీంతో రూ.లక్షల ఖర్చుతో రొయ్యల సాగు చేపట్టిన రైతులు.. దాన్ని కాపాడుకునేందుకు కంటి మీద కునుకు లేకుండా చెరువుల దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్‌ అంతరాయం కారణంగా కనీసం 10 నిమిషాలు ఏరియేటర్స్‌ పనిచేయడం ఆలస్యమైనా ఆక్సిజన్‌ అందక రొయ్యకు ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

డీజిల్‌ భారం రోజుకు రూ.2 వేలు పైనే..

విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సమయంలో జనరేటర్‌ వినియోగానికి గంటకు కనీసం 5-6 లీటర్ల డీజిల్‌ను వినియోగించాల్సి ఉంది. దీనికి రూ.600 వరకూ ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రోజుకు 3 గంటల పాటు జనరేటర్‌ వినియోగానికి రూ.1,800 వంతున రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు జనరేటర్‌ సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అద్దె రూపేణా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే రొయ్యకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నామని.. 100 కౌంట్‌కు రూ.230 ధర మాత్రమే వస్తోందని రైతులు పేర్కొన్నారు. రొయ్య మేత, విద్యుత్‌ ఛార్జీలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరాకు రూ.3-4 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.  ప్రస్తుతం లాభాల మాట ఎలాగున్నా.. పెట్టుబడి కూడా వెనక్కి రావడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని