అన్నగారి మానస పుత్రిక ‘తెలుగు విశ్వవిద్యాలయం’

తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన ఎన్టీఆర్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

Published : 27 May 2023 04:55 IST

ఈనాడు, అమరావతి: తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిన ఎన్టీఆర్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం బిల్లు ఆంగ్లంలో ఉందని తెలిసి దాన్ని తెలుగులోకి మార్పించి మరీ శాసనసభలో ప్రవేశపెట్టించారు. తాను అధికారంలోకి వచ్చేనాటికి తీవ్ర విమర్శలపాలవుతున్న సాహిత్య, సంగీత, నాటక, లలిత కళా, నృత్య అకాడమీలపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ నివేదికతో వాటన్నింటినీ రద్దు చేశారు. తర్వాత ‘కళాపీఠం’ ఏర్పాటు చేసి, అకాడమీల కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. తర్వాత కళాపీఠాన్ని ‘విజ్ఞాన పీఠం’గా మార్చారు. తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, కళలు, జానపదం, సంస్కృతి వంటి రంగాల్లో సమగ్ర వికాసం కోసం పరిశోధన, ప్రచురణ, బోధన కోసం తెలుగు విజ్ఞాన పీఠాన్ని తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చారు. 1985 డిసెంబరు 2న  తెలుగు విశ్వవిద్యాలయం అవతరించింది. దీంతోపాటు శ్రీశైలం, రాజమహేంద్రవరంలోనూ, తర్వాత వరంగల్‌లోనూ పీఠాలను ఏర్పాటు చేశారు.  మానసపుత్రిక లాంటి తెలుగు విశ్వవిద్యాలయంపై ఎన్టీఆర్‌ ఎంతో ఆసక్తి చూపించేవారు. దానికి ఎలాంటి నిధుల సమస్య లేకుండా చూశారు. ఈ విశ్వవిద్యాలయానికి కొంతకాలం ఎన్టీఆరే కులపతిగా కూడా వ్యవహరించారు. మొదటి స్నాతకోత్సవాన్ని తెలుగుదనం ఉట్టిపడేలా ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించారు. శిల్పం, సంగీతం, నృత్యం, కళలు, జ్యోతిషం లాంటి కోర్సులతో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఎంఏ తెలుగు, చరిత్రలాంటి 14 పీజీ కోర్సులు, 11 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని