చెత్త పన్ను వసూలు చేస్తారా? జీతాల్లో రికవరీ చేయాలా?

పట్టణ స్థానిక సంస్థల్లో చెత్త పన్ను వసూలు చేయాల్సిందేనని వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శుల మెడపై అధికారులు కత్తి పెడుతున్నారు.

Published : 28 May 2023 03:59 IST

వార్డు కార్యదర్శులపై పెరిగిన అధికారుల ఒత్తిడి
అనేక చోట్ల షోకాజ్‌ నోటీసులు, మెమోలు జారీ

ఈనాడు, అమరావతి: పట్టణ స్థానిక సంస్థల్లో చెత్త పన్ను వసూలు చేయాల్సిందేనని వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శుల మెడపై అధికారులు కత్తి పెడుతున్నారు. నిర్దేశించిన వసూళ్ల లక్ష్యాలను చేరుకోనట్లయితే జీతాల్లో నుంచి రికవరీ చేస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కార్యదర్శులను హడలెత్తిస్తున్నారు. తీవ్రమైన పని ఒత్తిడితో ఆపసోపాలు పడుతున్న తమపై అధికారులు చెత్త పన్ను వసూళ్ల పేరుతో మానసికంగా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఈనెల 21న వివిధ జిల్లాల కార్యదర్శులు ధర్నా చేసి నిరసనను తెలియజేశారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) పేరుతో రాష్ట్రంలో 42 పుర, నగరపాలక సంస్థల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు.. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో రుసుముల వసూళ్ల లక్ష్యం బెడిసి కొడుతోంది. నిర్దేశించిన లక్ష్యంలో నెలలో 50% కూడా చాలా చోట్ల వసూలు కావడం లేదు. దీనిపై దుకాణాల ముందు చెత్త వేయడం, పేదల ఇళ్లకు వెళ్లి రుసుములు చెల్లించాల్సిందేనని హడావుడి చేసి భయపెట్టడంతో ప్రజల్లో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న అధికారులు మళ్లీ ఇప్పుడు వార్డు కార్యదర్శులకు భారీ లక్ష్యాలను నిర్దేశించి గడువులోగా రుసుములు వసూలు చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు.

* నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రజల నుంచి చెత్త పన్ను (వినియోగ రుసుములు) వసూలు చేయనందుకు తణుకు పురపాలక సంఘంలో 15 మంది వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులకు పుర కమిషనర్‌ ఈనెల 17న షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మీపై ఎందుకు చర్య తీసుకోరాదో 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని