బిల్లు ఇప్పించి.. ఆదుకోకుంటే మరణమే శరణ్యం

పాఠశాల ప్రహరీ నిర్మించి నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ బిల్లు చెల్లించలేదని, మీరు స్పందించి మంజూరు చేయించకపోతే తాను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని ఓ దివ్యాంగుడు ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు.

Published : 28 May 2023 03:59 IST

ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ ఎదుట దివ్యాంగుడి ఆవేదన

చోడవరం, న్యూస్‌టుడే: పాఠశాల ప్రహరీ నిర్మించి నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ బిల్లు చెల్లించలేదని, మీరు స్పందించి మంజూరు చేయించకపోతే తాను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని ఓ దివ్యాంగుడు ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి జిల్లా నర్సాపురంలో ధర్మశ్రీ పర్యటించారు. గ్రామానికి చెందిన దివ్యాంగుడు గోలగాన గోవిందు తన తల్లితో కలిసి ఆయన్ను కలిశారు. ‘2019లో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.16.5 లక్షలు మంజూరయ్యాయి. విద్యా కమిటీ ఛైర్మన్‌తో కలిసి పనులు చేశా. ఎంబుక్‌ రూ.10 లక్షలకు చేసినట్లు ఇంజినీరింగు అధికారులు చెప్పారు. అప్పట్లో రూ.6 లక్షలు అప్పు చేశా. ప్రహరీ పూర్తయినా.. ఇప్పటికీ బిల్లుల చెల్లింపు జరగలేదు. వడ్డీ రూ.3.5 లక్షలు దాటింది. వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు. వారి వేధింపులు భరించలేకున్నా. మీరు ఆదుకోకుంటే నాకు మరణమే శరణ్యం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ధర్మశ్రీ సంబంధిత అధికారులతో సెల్‌ఫోనులో మాట్లాడారు. బిల్లు సంగతి చూస్తానంటూ ఆయన వెళ్లిపోయారని గోవిందు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని