31 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌కు సంబంధించి తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన్ను అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Updated : 28 May 2023 07:32 IST

సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
తల్లికి శస్త్రచికిత్స అవాస్తవమైతే చర్యలు
ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌కు సంబంధించి తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన్ను అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్లీ శనివారం మధ్యాహ్నం దాకా ఇరుపక్షాల మధ్య కొనసాగిన సుదీర్ఘ వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ కోర్టు ముందున్న విస్తృత సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటికిప్పుడు తుది ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని, 31న తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. దీనిపై అవినాష్‌ తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు స్పందిస్తూ పిటిషనర్‌ తల్లిని కర్నూలు నుంచి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. గుండె కవాటాలు మూసుకుపోవడంతో శస్త్రచికిత్సకు చేర్పించారన్నారు. దీనిపై సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ తన్వర్‌ స్పందిస్తూ అవినాష్‌రెడ్డి తల్లిని ఆసుపత్రిలో చేర్చించారనడానికి ఎలాంటి మెడికల్‌ రికార్డు సమర్పించలేదని, అరెస్టును తప్పించుకోవడానికే సాకుగా చెబుతున్నారన్నారు. శస్త్రచికిత్స అవసరమని.. ఆ ప్రక్రియ కొనసాగుతుందని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది చెప్పిన వివరాలను నమోదు చేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది అవాస్తవమని తేలితే కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కోర్టు ముందున్న విస్తృత సమాచారంతో పాటు ఇంకా అదనపు వివరాలను సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తామని సీబీఐ చెబుతోందని, వీటన్నింటి పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి ఈ కోర్టుకు లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టుకు సమర్పిస్తామని, నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం వాటిని పిటిషనర్‌కు ఇవ్వరాదని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారన్నారు. దీంతోపాటు పిటిషనర్‌ తండ్రి ఇప్పటికే జైల్లో ఉన్నారని, ఈ కారణాలన్నింటి దృష్ట్యా పిటిషన్‌పై తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా సీబీఐని నియంత్రించడానికే ఈ కోర్టు మొగ్గు చూపుతోందన్నారు. అందువల్ల అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయరాదని ఆదేశిస్తూ తీర్పు నిమిత్తం పిటిషన్‌ను ఈ నెల 31కి వాయిదా వేశారు.

న్యాయవాదుల పరస్పర అసహనం

వాదనల సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది, పీపీలు, సునీత తరఫు న్యాయవాదులు ఒకరిపై మరొకరు అసహనం వ్యక్తం చేశారు. వాదనలు వినిపిస్తుండగా ఆవేశంగా అడ్డుకోవడం ప్రారంభించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు జోక్యం చేసుకోరాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తప్పుగా వాదనలు వినిపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రతి దశలోనూ న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సర్దిచెబుతూ వచ్చారు. న్యాయవాదులు చెప్పేదంతా నిజమేనంటారా అని ప్రశ్నించారు. సహనంగా వాదనలు వినిపించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని