సంక్షిప్త వార్తలు (5)

జిల్లా పరిధి, అంతర్‌ జిల్లాల బదిలీలకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సోమవారం నుంచి జూన్‌ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated : 29 May 2023 04:28 IST

సచివాలయ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం

నేటి నుంచి దరఖాస్తుల నమోదు

ఈనాడు, అమరావతి: జిల్లా పరిధి, అంతర్‌ జిల్లాల బదిలీలకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సోమవారం నుంచి జూన్‌ 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు రోజువారీ హాజరు నమోదు చేసే హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లోనే బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేలా లింకుని అందుబాటులో ఉంచారు. ఖాళీలకు సంబంధించిన వివరాలను అత్యధిక జిల్లాల్లో అధికారులు ఆదివారం ప్రకటించారు. వీటి ఆధారంగా ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తులు చేసుకోవాలి. వీటి పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, బదిలీల తుది జాబితా తయారీ, తదనంతర ప్రక్రియను వచ్చే నెల 10లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సచివాలయాలశాఖ ఆదేశించింది.


పార్లమెంటులో ఎన్టీఆర్‌కు నివాళి

ఈనాడు, దిల్లీ: ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు.


ఆర్‌-5 జోన్‌ కాదు.. పెద్ద మోసం

రాజధాని రైతుల ఆవేదన

తుళ్లూరు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం రాజధాని బృహత్‌ ప్రణాళికలో మార్పులు చేసి ఏర్పాటు చేసింది ఆర్‌-5 జోన్‌ కాదని, అది ఆరిపోయే జోన్‌ అని మందడం ఐకాస నాయకులు, రైతులు విమర్శించారు. ఆదివారం మందడం దీక్షా శిబిరం వద్ద ఉరేసుకున్నట్టు మెడకు తాళ్లు తగిలించుకొని రైతులు కట్టా రాజేంద్రప్రసాద్‌, ఆలూరి శ్రీనివాసరావు తదితరులు నిరసన తెలిపారు. అమరావతి అంశం న్యాయస్థానాల్లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో అడ్డగోలుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం పేదలను మోసం చేయడమేనని అన్నారు. చెల్లని పట్టాల పంపిణీ కార్యక్రమానికి వైకాపా నాయకులు ఆడంబరాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తుళ్లూరు శిబిరంలో రైతులు, మహిళలు వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటపాలెం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, దొండపాడు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.


పదోన్నతులు మాన్యువల్‌గా నిర్వహించాలని ఆందోళనలు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులు మాన్యువల్‌గా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా విద్యాధికారుల (డీఈవో) కార్యాలయాల వద్ద ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనలు నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో ఛైర్మన్‌, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మంజుల మాట్లాడుతూ.. ‘దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది జులై, డిసెంబరుల్లో రెండు పర్యాయాలు పదోన్నతులు ఇస్తామని ఉపాధ్యాయుల నుంచి ఆమోదం తీసుకున్నారు. ఆ తర్వాత వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా ఆన్‌లైన్‌ విధానంలో పదోన్నతులు ఇస్తూ ఇష్టం లేనివారిని వదులుకోమని డీఈవోలు ఒత్తిడి చేస్తున్నారు. బదిలీల ఉత్తర్వులు మొత్తం గందరగోళంగా ఉన్నాయి. పదోన్నతులను మాన్యువల్‌గా నిర్వహించాలి. ఏ ఒక్క ఖాళీని బ్లాక్‌ చేయకూడదు’ అని డిమాండ్‌ చేశారు.


మూడు పంచాయతీలకు జాతీయ అవార్డులు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఏపీలోని మూడు గ్రామ పంచాయతీలు ఎంపికయినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎ.సూర్యకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘పరిశుభ్రత-పచ్చదనం’ విభాగంలో తూర్పు గోదావరి జిల్లా బిల్లందూరు, విజయనగరం జిల్లా జోగింపేట, నెల్లూరు జిల్లా కడలూరు గ్రామ పంచాయతీలు అవార్డులకు ఎంపికయినట్లు తెలిపారు. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దిల్లీలో కేంద్రప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి మూడు పంచాయతీల తరఫున సర్పంచులు హాజరై అవార్డులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు